బీసీలపై మోడీ ప్రేమ ఎన్నికల కోసమే: వి.హనుమంతరావు

బీసీలపై మోడీ ప్రేమ ఎన్నికల కోసమే: వి.హనుమంతరావు
  • 10న కామారెడ్డిలో సీఎం సిద్ధరామయ్యతో బీసీ డిక్లరేషన్ సభ


విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధీ ప్రయత్నాల్లో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ బీసీల జపం చేస్తున్నారని, బీజేపీ బీసీ సీఎం నినాదాం ఎత్తుకుందని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. మంగళవారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ ఎల్బీ స్టేడియంలో బీసీల ఆత్మగౌరవ సభకు హాజరవ్వడం రాజకీయ జిమ్మిక్కు మాత్రమేనన్నారు. మోడీకి ఎన్నికల ముందు మీకు బీసీలు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. బీసీలపై మోడీ, బీజేపీలది ఎన్నికల ప్రేమ అని విమర్శించారు.


బీసీ కులగణన, బ్యాక్ ల్యాగ్ పోస్టుల భర్తీకి కేంద్రం తీసుకున్న చర్యలేమిటో ముందుగా మోడీ చెప్పాలన్నారు. కాంగ్రెస్ ఓబీసీల కోసం ఎంతో చేసిందన్నారు. ఐఐటీ, ఐఐఎంలలో రిజర్వేషన్లు కావాలని కోర్టుకు వెళ్తే అవకాశం లేదని సుప్రీం కోర్టు చెప్పిందని, సొనియా గాంధీని కలిసి న్యాయం చేయాలని పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని కోరామని, ఈరోజు వేలాది సంఖ్యలో డాక్టర్లు చదువుతున్నారంటే అందుకు కాంగ్రెస్ కారణమన్నారు. క్రిమిలేయర్ ఎత్తివేతకు కూడా తాము గతంలో డిమాండ్ చేశామన్నారు. రాహుల్ గాంధి భారత్ జోడొయాత్రతో ఒబీసీ ల సమస్యలు తెరపైకి వచ్చాయని, దీంతో ఓబిసి కుల గణన చేయడానికి అంగీకరించారన్నారు.


ఆంధ్ర కి ప్రత్యేక హోదా కావాలని అడిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మోడీ పక్కన చేరారని, పవన్ కళ్యాణ్ ని బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారని, బీసీల గురించి చెప్తున్న పవన్ కళ్యాణ్ కాపు కి చెందిన వారని, ప్రైవేట్ ఇండస్ట్రీలలో రిజర్వేషన్స్ ఎందుకు అడగలేదని విహెచ్ ప్రశ్నించారు. మోడీ మాయమాటలతో చేస్తున్న మోసాన్ని ఓబిసిలు గమనించాలన్నారు. కాంగ్రెస్ ఒక్కటే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందన్నారు. ఈ నెల 10 వ తేదీన కామారెడ్డిలో నిర్వహించే బీసీ గర్జన సభకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వస్తారని, కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్ విడుదల చేస్తారన్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే బీసీ కులగణన, బీసీ సబ్ ప్లాన్, క్రిమిలేయర్ ఎత్తివేత ప్రకటనలుంటాయన్నారు.


మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీజేపీ బీసీల ఆత్మగౌరవ సమావేశానికి మోడీ హాజరవుతున్నారని, మీకు బీసీల మీద ప్రేమ ఉంటే కుల గణనని ఎందుకు అంగీకరించడం లేదన్నారు. మోడీ ,కేసీఆర్ ఇద్దరు బీసీలకు అన్యాయం చేస్తున్నారన్నారు. బీసీ సంక్షేమంపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే బీసీల సమగ్ర సర్వే రిపోర్టును బయటపెట్టాలన్నారు. బీఆరెస్ లో బడుగు బలహీన వర్గాలకు అవకాశం కల్పించే పరిస్థితి లేదని, కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అన్నారు.


మా ప్రభుత్వం రాగానే కుల గణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారన్నారు. ఓబిసి జాతీయ అధ్యక్షులుగా ఉన్న లక్ష్మణ్ ఏడాది కాలంగా ఎందుకు బీసీల సమావేశం పెట్టలేదని ప్రశ్నించారు. బీసీల పై బీజేపీ మోసలి కన్నీరు కారుస్తుందని, బీజేపీ కుల గణన ని ఎందుకు వ్యతిరేకించిందో మోడీ స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు ఎక్కువ స్థానాలు ఇవ్వడానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని, ఇప్పటికే 23స్థానాలు ఇచ్చిందని, భవిష్యుత్తులో బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరిన్ని మంచి అవకాశాలు లభిస్తాయన్నారు.