శాంతం మూర్తీభవించిన గజరాజు.. ఇదీ ప్రత్యేకత!
కేరళలో ఏనుగులు పెద్ద ఎత్తున దర్శనమిస్తుంటాయి. ప్రత్యేకించి.. ప్రతి ఆలయంలోనూ గజరాజులు భక్తులకు ఆశీర్వాదాలు అందిస్తుంటాయి.

కేరళలో ఏనుగులు పెద్ద ఎత్తున దర్శనమిస్తుంటాయి. ప్రత్యేకించి.. ప్రతి ఆలయంలోనూ గజరాజులు భక్తులకు ఆశీర్వాదాలు అందిస్తుంటాయి. పండుగలు, ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏనుగు అంబారీలపై ఉత్సవమూర్తులు ఊరేగుతారు. కొన్ని సమయాల్లో గజరాజులు తీవ్ర ఆగ్రహానికి గురై.. కనిపించినవారిని కాళ్లతో తొక్కివేస్తుంటాయి. ఇటువంటి సమయాల్లో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్న ఉదంతాలూ ఉన్నాయి.
అయితే.. ఈ సమస్యకు ఒక చక్కని పరిష్కారాన్ని జంతు సంరక్షణ సమితి (పెటా), సినీ నటి ప్రియమణి చూపించారు. అత్యంత భద్రంగా ఆశీర్వాదాలు అందించేందుకు యాంత్రిక గజరాజును కోచిలోని ఒక ఆలయానికి బహూకరించారు. కేరళ ఆలయాల్లో ఇటువంటి యాంత్రిక గజరాజును ఉంచడం ఇది రెండోది. దీనికి మహదేవన్ అనే పేరు కూడా పెట్టారు.
స్వచ్ఛంద సంస్థ పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా), సినీ నటి ప్రియమణి కలిసి నిలువెత్తు మెకానికల్ ఎలిఫెంట్‌ను కోచిలోని తిరిక్కయిల్ మహదేవ్ ఆలయానికి బహూకరించారు. ఏనుగులను సొంతంగా కలిగి ఉండరాదని, లేదా కిరాయికి తీసుకోవద్దని ఆలయ పాలక మండలి నిర్ణయం నేపథ్యంలో భక్తులకు ఆశీర్వాదాలు అందించేందుకు ఈ యాంత్రిక ఏనుగును అందించారు.
ఈ ఏనుగు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉంటుందని పెటా ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం నిర్వహించిన ఒక ఉత్సవంలో ఈ ఏనుగును అందించారు. మూగ జీవాలను హింసించకుండా మన గొప్ప సంస్కృతి, వారసత్వాలను కొనసాగించుకునేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని ప్రియమణి పేర్కొన్నారు.
దీనిపై తిరిక్కయిల్ మహదేవ ఆలయ యజమాని తెక్కినియెదత్ వల్లభన్ నంబూద్రి స్పందిస్తూ.. యాత్రిక ఏనుగును సాదరంగా స్వీకరిస్తున్నామన్నారు. జంతువులను కూడా దేవుడే సృష్టించాడని, మానవుల్లాగే అవికూడా తమ కుటుంబాలతో సంతోషంగా ఉండాలని అన్నారు. గత ఏడాది కూడా త్రిస్సూర్‌లోని ఇరింజడప్పిళ్లి శ్రీకృష్ణ దేవాలయం మండలి కూడా ఉత్సవాలకు ఏనుగులను ఉపయోగించరాదని తీర్మానించింది. అక్కడ యాంత్రిక ఏనుగును మొట్టమొదటిసారి ప్రవేశపెట్టారు.