Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై పోలీసు కేసు నమోదు!

Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై పోలీసు కేసు నమోదు!

Bellamkonda Srinivas:  హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లో కారుతో రాంగ్‌రూట్‌లో వెళ్లిన బెల్లంకొండ శ్రీనివాస్ కారును ఆపిన కానిస్టేబుల్‌ ను దుర్భాషలాడాడు. ఈ ఘటనపై పోలీసులు బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌ జర్నలిస్టు కాలనీలో నివాసం ఉంటున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈనెల 13న రోడ్‌ నెంబర్ 45 మీదుగా తన ఇంటికి వెళ్లే క్రమంలో రాంగ్ రూట్ లో కారు నడిపాడు. గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ ఆ కారును అడ్డుకుని రాంగ్‌ రూట్‌లో వెళ్లొద్దంటూ సూచించారు. అయితే కానిస్టేబుల్ మాటలు లెక్కచేయకుండా బెల్లంకొండ శ్రీనివాస్ రాంగ్‌ రూట్‌లోనే ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు బెల్లంకొండ శ్రీనివాస్‌కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కారును ఆపేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రయత్నించగా.. ఆయన మీదుగానే కారును పోనిచ్చేందుకు బెల్లంకొండ యత్నించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ వ్యవహారం మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌‌గా మారింది. బెల్లంకొండపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ హీరోలు అయితే ట్రాఫిక్ నిబంధనలు పాటించరా అంటూ నెటిజన్లు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.