జార్ఖండ్‌లో అర్ధరాత్రి ఎన్‌కౌంటర్
జార్ఖండ్‌లోని గర్వా జిల్లాలో మావోయిస్టులతో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి

- మావోయిస్టుల కాల్పుల్లో పోలీస్ అధికారికి గాయాలు
విధాత: జార్ఖండ్‌లోని గర్వా జిల్లాలో మావోయిస్టులతో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని సోమవారం ఉదయం పోలీస్ అధికారులు మీడియాకు వెల్లడించారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి 200 కిలోమీటర్ల దూరంలోని డెంగురా గ్రామంలో సోమవారం తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిందని పేర్కొన్నారు.
మావోయిస్టు నుంచి విడిపోయిన గ్రూపు జార్ఖండ్ జన్ ముక్తి పరిషత్ (జేజేఎంపీ)తో జరిగిన కాల్పుల్లో రాంకా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి శంకర్ ప్రసాద్ కుష్వాహకు బుల్లెట్ గాయాలయ్యాయని గర్వా పోలీస్ సూపరింటెండెంట్ దీపక్ కుమార్ పాండే తెలిపారు. గర్వాలో ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం కుష్వాహను రాంచీకి రెఫర్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. కుష్వాహ కుడి చేతికి బుల్లెట్ గాయాలయ్యాయని వెల్లడించారు. అడవిలోకి పారిపోయిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు వివరించారు.