జనగామలో.. గులాబీ పాలీ’ట్రిక్స్’.. అధినేతపై అందరిదీ ఒకటే గురి

జనగామలో.. గులాబీ పాలీ’ట్రిక్స్’.. అధినేతపై అందరిదీ ఒకటే గురి
  • ఒకరిపై ఒకరు గిట్టని నేతలు
  • అధినేతపై అందరిదీ ఒకటే గురి
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రతిస్పందన
  • ఆసక్తికరంగా బీఆర్ఎస్ రాజకీయం


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: జనగామ జిల్లా బీఆర్ఎస్ నాయకులకు ఒకరంటే మరొకరికి గిట్టదుకానీ, అధినేత కేసీఆర్ పైన మాత్రం ఆ నాయకులందరూ నమ్మకపు పాలీ’ట్రిక్స్’ ప్రదర్శిస్తున్నారు. ఒకరి వెనుక మరొకరు గోతులు తీసుకుంటున్నారు. ఈ గోతులకు మీరు కారణమంటే, మీరు కారణమంటూ విమర్శించుకుంటున్నారు. ఒకరిని కాదని మరొకరికి అవకాశం కల్పించేందుకు తన పక్కనే ఉంటున్న సొంత పార్టీ నాయకుడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


తమపై అపనమ్మకం ప్రదర్శిస్తున్న అధినేత పట్ల నమ్మకం ప్రదర్శించడం గమనార్హం. జనగామ జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని జనగామ, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాల్లో పరస్పరం దూషించుకుంటున్న నాయకుల ‘నమ్మకం’ ప్రకటనలు వింటూ రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.


అభ్యర్థుల ప్రకటనతో నెలకొన్న సీన్


రాబోయే ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించిన అనంతరం జనగామ జిల్లాలో ఈ పరిణామాలు జరుగుతున్నాయి. స్టేషన్ ఘన్ పూర్ అభ్యర్థిగా సిటింగ్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యను కాదని, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు. ఇక జనగామ సిటింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కాదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి అవకాశం కల్పిస్తారనే వివాదం నేపథ్యంలో అభ్యర్థి ప్రకటన పీటముడిపడింది. జనగామ బీఆర్ఎస్ రాజకీయం రచ్చగా మారి రచ్చకెక్కింది.


మార్పుపైన రాజయ్యకు నమ్మకం


నాలుగు పర్యాయాలు స్టేషన్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, ఐదోసారి పోటీకి ఆశతో ఉన్న డాక్టర్ రాజయ్య తనకు ఈ దఫా టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తొలి వారం రోజులు మనస్థాపంతో అందరికీ దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ‘నమ్మకం’తో కూడిన ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఎన్నికల నాటికి అభ్యర్థి మార్పుంటుందనీ, తనకు తప్పక అవకాశం లభిస్తుందని ప్రకటించారు. ఎస్సీ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందనే భావనతో తన కులానికి చెందిన వారున్నారని చెబుతున్నారు. అధినేత కేసీఆర్ పై తనకు పూర్తి ‘నమ్మకం’ ఉందంటున్నారు. నమ్మకం కోల్పోతే మాత్రం కాలమే నిర్ణయిస్తుందన్నారు.


ఈ క్రమంలో ప్రగతి భవన్ సాక్షిగా కేటీఆర్ సమక్షంలో కడియం శ్రీహరితో సయోధ్య కుదిరినట్లు వార్తలు వెలువడ్డాయి కడియం గెలుపునకు సహకరిస్తానని రాజయ్య హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగింది. విచిత్రంగా రెండు రోజుల తర్వాత రఘునాథపల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఇదంతా తూచ్ అంటూ రాజయ్య ప్రకటించడం తీవ్ర చర్చకు దారి తీసింది. కడియంతో తాను కలిసి పోలేదని, తన పోటీపై కాలమే నిర్ణయిస్తుందంటూ ప్రకటించి సంచలనానికి తెర తీశారు అయినప్పటికీ అధిష్టానంపైన తనకు నమ్మకం ఉందంటూ ప్రకటించారు.


ఇద్దరిపైనా కడియానికి నమ్మకం


తనపై నమ్మకంతో కేసీఆర్ ఈ దఫా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండు పర్యాయాలు రాజయ్యకు ఎమ్మెల్యే టికెటిస్తే తాను సహకరించి గెలిపించానని, ఈసారి డాక్టర్ రాజయ్య తన విజయానికి సహకరిస్తారని కడియం నమ్మకంగా చెబుతున్నారు. తాజా రాజయ్య ప్రకటన నేపథ్యంలో కడియం ఇంకా ప్రతిస్పందించలేదు.


ముత్తిరెడ్డికి పూర్తి నమ్మకం ఉంది


మూడోసారి ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు ఆసక్తితో ఉన్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి టికెట్ పెండింగ్ లో ఉంది. దీనిపై ముత్తిరెడ్డి స్పందిస్తూ ఉద్యమకాలం నుంచి కలిసి పనిచేసిన తనకు కేసీఆర్ అన్యాయం చేయరనీ అప్పాయింట్ మెంట్ ఇవ్వకున్నా నమ్మకంగా చెబుతున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి వారు తప్పుడు ప్రచారం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం ఆదేశమే తనకు శిరోధార్యం అంటూ నమ్మకంగా ప్రకటిస్తున్నారు.


నమ్మకంగా టికెట్ అంటున్న పల్లా


ఈసారి జనగామ ఎమ్మెల్యే టికెట్ నమ్మకంగా తనకే వస్తుందని ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి చెబుతున్నారు. తన అనుచరులు, పార్టీ కార్యకర్తల సమావేశంలో ఇప్పటికే ఈ భరోసా ఇచ్చారు. జనగామ నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. అక్కడ అభివృద్ధిపై చర్చలు జరిపారు. కేటీఆర్ జోక్యంతో కొద్దిరోజులు ప్రస్తుతం సద్దు మణిగింది. ఓన్లీ జనగామ నియోజకవర్గ కేడర్ తో ప్రత్యేక రహస్య సమావేశాలు నమ్మకంగా కొనసాగిస్తున్నారు.


నమ్మకంగా నాకే అంటున్న పోచంపల్లి


మరో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి సైతం తన అనుచరులు, కార్యకర్తల సమావేశంలో ఈ సారి టికెట్ మనకే వస్తుందని నమ్మకంగా చెబుతున్నారు. కాకుంటే పల్లా మాదిరి దూకుడు ప్రదర్శించకుండా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. పల్లాకు చెక్ పెట్టేందుకే కేటీఆర్ రంగంలోకి దిగినట్లు ఆయన అనుచరుల వద్ద నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.


అంతులేనిది ఎర్రబెల్లి నమ్మకం


బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రికేటీఆర్ లకు ఎవరికి అవకాశం ఇవ్వాలా? ఎవరికి ఏ పదవి ఇవ్వాలో బాగా తెలుసని మంత్రి ఎర్రబెల్లి ప్రకటించారు. ఎవరికీ అన్యాయం చేయకుండా వారి సామర్థ్యాన్ని బట్టి వినియోగించుకుంటారంటూ చెబుతున్నారు. జనగామలో గత శుక్రవారం జరిగిన సభలో మంత్రి వ్యాఖ్యల్లో.. కడియం అనుభవజ్ఞుడు, రాజయ్య త్యాగశీలి, ముత్తిరెడ్డి ఉద్యమకారుడు అంటూ ట్యాగ్ లిచ్చారు. అందరినీ పార్టీ కాపాడుకుంటుందనే నమ్మకాన్ని ప్రదర్శించారు. ఆసక్తికరమైన అంశమేమిటంటే పరస్పరం నమ్మకం లేకుండా దూషించుకుంటున్న నాయకులంతా, నమ్మకంగా అధిష్టానంపై విశ్వాసం ప్రదర్శించడం జనగామ రాజకీయాల్లో  కొసమెరుపు.