Ambedkar Statue | విగ్రహం సాక్షిగా రాజకీయం
విధాత: దేశం గర్వించదగిన స్థాయిలో 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) ఆయన జయంతి రోజున తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఈ విగ్రహావిష్కరణకు రాష్ట్రంలో ని 119 నియోజక వర్గాల నుంచి ప్రతినిధులను రప్పించి, ప్రభుత్వ ఖర్చులతోనే భారీ హంగామా చేసింది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం పూర్తిగా రాజకీయ ప్రసంగమే తప్ప, ఏ ఒక్క సామాజిక న్యాయ అంశం లేదు. అంబేద్కర్ మహనీయుడి ఆలోచనలు […]
విధాత: దేశం గర్వించదగిన స్థాయిలో 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) ఆయన జయంతి రోజున తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఈ విగ్రహావిష్కరణకు రాష్ట్రంలో ని 119 నియోజక వర్గాల నుంచి ప్రతినిధులను రప్పించి, ప్రభుత్వ ఖర్చులతోనే భారీ హంగామా చేసింది.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం పూర్తిగా రాజకీయ ప్రసంగమే తప్ప, ఏ ఒక్క సామాజిక న్యాయ అంశం లేదు. అంబేద్కర్ మహనీయుడి ఆలోచనలు గరిష్టంగా కాకున్నా కనీసం చర్చ జరిగే అవకాశం ఉంటుందని భావించిన వారికి నిరాశే మిగిలింది.
‘అది విగ్రహం కాదు విప్లవం’ అని అనడం బాగానే ఉంది. అంబేద్కర్ మహాశయుడు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం జీవితాంతం పోరాడాడు. ఆయన అంటరానితనం అనుభవించాడు. ఇప్పటికీ మానసిక అంటరాని తనం బతికే ఉంది.
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి మాటలుగానే మిగిలి ఉన్నాయి. ఆయన కోరుకున్న కుల నిర్మూలన జరగలేదు సరి కదా కులాల ప్రాతి పదికన ఎన్నికలు జరుగు తున్నాయి. అలాంటి ప్రయత్నంలో భాగమే ఈ సభ అనడం కూడా నిర్వివాదమే.
ముఖ్యమంత్రి కెసిఆర్ గొంతు పెగలలేదు. ఆయన నోటి వెంట సామాజిక న్యాయం అనే మాట రాలేదు. అంబేద్కర్ ఆశయాలు చెప్పలేదు. సామాజిక సోషలిజం అంబేద్కర్ లక్ష్యం. ఆ దిశగా అడుగులు పడాలంటే రాజ్యాధికారంలో ప్రజల వాటా పెరగాలి.
కానీ ఇప్పటికీ రాజకీయాలు ఎవరి చేతిలో వున్నాయో అందరికీ తెలుసు. దళితులకు ఏవో కొన్ని రకాల పథకాలు ఇవ్వడం అన్ని పార్టీలు ఆచరించే పద్ధతి. అదే బాటలో దళితబంధును కూడా చూడాలి. దళిత బంధు పథకాన్ని దళితులు కోరుకుంటున్నారన్నది పాక్షిక సత్యమే.
దళితులు రాజ్యాధికారంలో భాగాన్ని కూడా కోరుకుంటున్నారు. రాజకీయ అణచివేత నుంచి విముక్తి కోరుకుంటున్నారు. ఆచరణలో ఆ సామాజిక వర్గాలపై అనుసరించిన పద్ధతినే బేరీజు వేసుకుని చూస్తే ఈ సభ కేవలం ఎన్నికల రాజకీయ సభగానే భావించాలి.
ప్రజలు గెలవాలి అనే మాట తాత్వికంగా గొప్పగా ఉంది. కానీ ఏ ప్రజలు గెలవాలి? ఎందుకు ప్రజలు ఓడిపోతున్నారు? ఎన్నికలు ఇంత ఖరీదైనవిగా ఎందుకు మారాయి? నిజానికి కార్పొరేట్ కంపెనీలు రాజకీయాలను తమ చెప్పు చేతల్లోకి తీసుకుంటున్న దశలో మనం ఉన్నాం.
ఇలా అయితే ప్రజలు ఎలా గెలుస్తారు? ఇప్పుడు ప్రజల భాగస్వామ్యం పెంచాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి. ఆ స్ఫూర్తిని పాటించాలి. అది జరగడం లేదు. వ్యక్తుల అజమాయిషీ నీడన రాజకీయాలు నలిగి పోతున్నాయి.
అంబేద్కర్ జయంతి నాడు మాట్లాడు కోవాల్సిన సమస్య పూర్తిగా సామాజిక న్యాయం మాత్రమే. కానీ కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని దేశంలో విస్తరిస్తామని చెప్పడం, రాబోయే పార్టీ బీఆర్ఎస్ అని చెప్పడం మినహా ఆ ప్రసంగంలో మరే ముఖ్యమైన అంశం ప్రస్తావనకు రాకపోవడం శోచనీయం. అవార్డులు, రివార్డులు కొలహాలాలు, హాలాహలాలు కాదు.
కార్యాచరణ ముఖ్యం అంటూనే కొత్త కార్యాచరణ ఏమీ ప్రకటించ లేదు. మొదటి నుంచి దళితుల అభ్యున్నతి కోసం భూమి ముఖ్యమని చెప్పి, తలా 3 ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని అన్నారు. ఇప్పుడు దళితబంధును ముందుకు తెచ్చి, భూ పంపిణీని పాతర వేయడమే కనపడింది. రాయితీ రాజకీయం వద్దు.. మనుషులు అందరూ సమానమే అనే అవగాహనను బలపరచాలి. అదే అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆశించేది.
– డేగల జనార్దన్, సీనియర్ పాత్రికేయుడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram