మోగిన నగారా.. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

- నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
- డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు.. ఫలితాల వెల్లడి
- ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడుతలుగా ఎన్నికలు
- మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒకే విడుతలో పూర్తి
ఇదీ షెడ్యూల్
- నామినేషన్ల స్వీకరణ : నవంబర్ 3 నుంచి
- దాఖలుకు చివరితేదీ : నవంబర్ 10
- నామినేషన్ల పరిశీలన : నవంబర్ 13
- ఉపసంహరణకు గడువు: నవంబర్ 15
- పోలింగ్ నిర్వహణ: నవంబర్ 30
- ఓల్ల లెక్కింపు లెక్కింపు : డిసెంబర్ 3
అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. నవంబర్ 7 నుంచి 30వ తేదీ మధ్య ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీలలోని మొత్తం 679 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం సుమారు 16 కోట్ల మంది ఓటు వేయనున్నారు. ఐదు రాష్ట్రాల్లోని పార్టీల భవితవ్యం తేల్చడంతోపాటు.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజానాడి ఎలా ఉండబోతున్నదో సంకేతాలు ఇవ్వనున్నారు.
న్యూఢిల్లీ : 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 7 నుంచి 30 మధ్యలో ఎన్నికలు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపును డిసెంబర్ 3న చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. తెలంగాణ ఎన్నికలు నవంబర్ 30న జరుగుతాయి. తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్రం ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7న తొలి విడుత పోలింగ్, 17న రెండో విడుత పోలింగ్ ఉంటాయి. రాజస్థాన్‌లో నవంబర్ 23న ఒకే విడుతలో ఓటింగ్ జరుగుతుంది. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న ఒకే దఫాలో ఎన్నికలు నిర్వహిస్తారు. మిజోరంలో నవంబర్ 7న ఒకే విడుతలో పోలింగ్ ఉంటుంది.

అమల్లోకి ఎన్నికల కోడ్
ఎన్నికల షెడ్యూల్ విడుదల అవడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరితేదీ నవంబర్ 10. 13న స్క్రూట్నీ నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15. నవంబర్ 30వ తేదీన ఎన్నికలు నిర్వహించి, డిసెంబర్ 3న కౌంటింగ్ చేపడుతారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
35,356 పోలింగ్ కేంద్రాలు
తెలంగాణలో 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. ఇందులో 14,464 కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ఉండగా, 20,892 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పారు. సగటున ప్రతి పోలింగ్ కేంద్రంలో 897 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. 27,798 కేంద్రాల్లో (78 శాతం) వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఇక 597 పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని, అదేవిధంగా 644 మోడల్ కేంద్రాలు, మరో 120 పోలింగ్ కేంద్రాలను వికలాంగుల కోసం ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం ఆరు నెలలుగా కసరత్తు చేస్తున్నామని రాజీవ్ కుమార్ తెలిపారు.
తెలంగాణలో 119, ఛత్తీస్‌గఢ్‌లో 90, మిజోరాంలో 40, రాజస్థాన్‌లో 200, మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ పేర్కొన్నారు. మొత్తంలో ఐదు రాష్ట్రాల్లో 679 శాసనసభ స్థానాలున్నాయని తెలిపారు. మిజోరాం శాసనసభ పదవీకాలం డిసెంబర్ 17, ఛత్తీస్‌గఢ్ జనవరి 3, మధ్యప్రదేశ్ జనవరి 8, రాజస్థాన్ జనవరి 14, తెలంగాణ శాసనసభ పదవీకాలం జనవరి 18 ముగియనున్నట్లు పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో 8.2 కోట్ల మంది పురుష ఓటర్లు, 7.8 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇందులో 60.2 లక్షల మంది తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఛత్తీస్‌గఢ్
మొత్తం స్థానాలు : 90
పోలింగ్ : నవంబర్ 7, 17
అధికార పార్టీ : కాంగ్రెస్
మధ్యప్రదేశ్
మొత్తం సీట్లు : 230
పోలింగ్ : నవంబర్ 17
అధికార పార్టీ : బీజేపీ
మిజోరం
మొత్తం స్థానాలు 40
పోలింగ్ నవంబర్ 7
అధికార పార్టీ : మిజో నేషనల్ ఫ్రంట్
రాజస్థాన్
మొత్తం సీట్లు : 200
పోలింగ్ : నవంబర్ 23
అధికార పార్టీ : కాంగ్రెస్
తెలంగాణ
మొత్తం సీట్లు : 119
పోలింగ్ : నవంబర్ 30
అధికార పార్టీ : బీఆరెస్