Election Code | తెలంగాణలో ‘నగదు’ తరలింపుపై ‘నిఘా’.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Election Code | మీరు రూ. 50 వేల కంటే నగదు తరలిస్తున్నారా..? జర జాగ్రత్త..! ఎందుకంటే తెలంగాణ( Telangana )లో స్థానిక సంస్థల ఎన్నికల( Local Body Elections ) షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో నిన్నటి నుంచి ఎన్నికల కోడ్( Election Code ) అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రూ. 50 వేల కంటే నగదు తరలించే వారు.. అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే.

Election Code | హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల( Local Body Elections ) నగారా మోగిన విషయం తెలిసిందే. ఎంపీటీసీ( MPTC ), జడ్పీటీసీ( ZPTC ), సర్పంచ్( Sarpanch ), వార్డు సభ్యులకు జరిగే ఎన్నికలను మొత్తం ఐదు దశల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిన్న ఎన్నికల షెడ్యూల్( Election Schedule ) విడుదల చేశారు. ఈ ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 9వ తేదీన ప్రారంభమై నవంబర్ 11వ తేదీన ముగియనుంది. రెండు విడతల్లో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబర్ 9న, మూడు విడతల్లో జరిగే సర్పంచ్ ఎన్నికలకు 17వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్( Election Code ) అమల్లోకి వచ్చింది.
తెలంగాణ( Telangana ) వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. నగదు తరలింపుపై ఎన్నికల అధికారులు నిఘా పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నగదు, బంగారంతో పాటు ఇతర విలువైన వస్తువుల తరలింపుపైనా ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అయితే రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లే వారు.. ఈ జాగ్రత్తలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే. అంటే రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు, బంగారం, ఇతర వస్తువులు తరలిస్తే వాటికి సంబంధించిన సరైన పత్రాలను చూపించాలి. లేని యెడల నగదును, ఇతర విలువైన వస్తువులను ఎన్నికల అధికారులు సీజ్ చేయనున్నారు.
జాగ్రత్తలు, నిబంధనలు ఇలా..
- ఒక వేళ రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు తరలించాల్సి వస్తే.. అందుకు సంబంధించిన ఆధారాలు ఉంచుకోవాలి. తనిఖీ సమయంలో అధికారులకు చూపించాలి.
- ఆస్పత్రుల్లో చెల్లింపుల కోసం ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్తే.. రోగి రిపోర్టులు, ఆస్పత్రి బిల్లులు, ఇతర డాక్యుమెంట్లు తమ వెంట ఉంచుకోవాలి.
- ఏదైనా ఎమర్జెన్సీ అవసరాల కోసం బ్యాంకు నుంచి నగదు డ్రా చేస్తే.. బ్యాంక్ పాస్ బుక్ లేదా ఏటీఎం చిటీ వంటివి తప్పనిసరిగా తమవద్ద పెట్టుకోవాలి.
- వస్తువులు, ధాన్యం విక్రయించిన డబ్బు తీసుకెళ్తే.. వాటికి సంబంధించిన బిల్లులు చూపించాలి.
- భూమి విక్రయించిన సొమ్ము అయితే వాటికి దస్తావేజులు చూపించాలి.
- వ్యాపారం, ఇతర సేవల కోసం డబ్బు వినియోగిస్తే తనిఖీల సమయంలో లావాదేవీల వివరాలను ఆధారాలతో సహా అధికారులకు సమర్పించాలి.
- ఎక్కువ మొత్తంలో నగదు, బంగారం లభ్యమైతే ఐటీ, జీఎస్టీ అధికారులు కూడా రంగంలోకి దిగుతారు. వాటికి సంబంధించి కచ్చితమైన ఆధారాలు చూపిస్తేనే తిరిగి ఇస్తారు.