Yadadri Bhuvanagiri: రెండో విడత.. గొర్రెల పంపిణీకి సన్నాహాలు

ల‌బ్ధిదారులు త‌మ వాటా ధ‌నం చెల్లించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. అధికారులకు అదనపు కలెక్టర్ దీపక్ తివారీ సూచ‌న‌ విధాత: రెండో విడత గొర్రెల పంపిణీకి లబ్ధిదారులు తమ వాటా ధనం చెల్లించేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గొర్రెల కొనుగోలుకు సంబంధించి శనివారం ఏర్పాటు చేసిన మండల టీమ్‌ల అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రతి మండల టీమ్‌లో మండల […]

Yadadri Bhuvanagiri: రెండో విడత.. గొర్రెల పంపిణీకి సన్నాహాలు
  • ల‌బ్ధిదారులు త‌మ వాటా ధ‌నం చెల్లించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని..
  • అధికారులకు అదనపు కలెక్టర్ దీపక్ తివారీ సూచ‌న‌

విధాత: రెండో విడత గొర్రెల పంపిణీకి లబ్ధిదారులు తమ వాటా ధనం చెల్లించేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అధికారులకు సూచించారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గొర్రెల కొనుగోలుకు సంబంధించి శనివారం ఏర్పాటు చేసిన మండల టీమ్‌ల అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రతి మండల టీమ్‌లో మండల స్పెషల్ ఆఫీసర్, తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారి, వెటర్నరీ అసిస్టెంట్ ఉంటారన్నారు.

జిల్లాలో రెండవ విడత గొర్రెల పంపిణీకి సంబంధించి 15,390 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని, వీరిలో ఇప్పటివరకు 1509 మంది ఆన్‌లైన్ ద్వారా తమ వాటా ధనాన్ని చెల్లించార‌న్నారు. మిగతా వారి నుండి కూడా వాటా ధనం చెల్లించేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని తెలిపారు.

వచ్చే సోమవారం నుండి రైతు వేదికలలో లబ్ధిదారులకు వాటా ధనంపైన, గొర్రెల సంరక్షణ, ఇన్సూరెన్స్ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. లబ్ధిదారుడు తన వాటా ధనం కింద రూ.43,750/- ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని, తద్వారా ఒక యూనిట్ కింద 21 గొర్రెలను అందించడం జరుగుతుందని తెలిపారు.

గొర్రెల యూనిట్ పంపిణీ లబ్ధిదారులకు సంబంధించిన కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ మొదలైన సర్టిఫికెట్స్ లను దరఖాస్తుతో పాటు తీసుకోవాలన్నారు.

అనంతపురం, కృష్ణా, కర్ణాటకలోని బెల్గాం, మహారాష్ట్రలోని చంద్రాపూర్ ప్రాంతాలలో గొర్రెల కొనుగోలు జరుగుతుందని, మండల స్పెషల్ ఆఫీసర్ తన వెంట కొనుగోలుదారుని తీసుకుని వెళ్తారని తెలిపారు. లబ్ధిదారునికి గొర్రెల యూనిట్లు అందించే సమయంలో 100 కిలోల దాణా, 500 రూపాయల విలువ గల మందులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

ఉపాధి హామీ పనుల ద్వారా గొర్రెల షెడ్డు ఏర్పాటు చేసుకోవడానికి లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. గొర్రెల రవాణాకు సంబంధించిన సీల్ టెండర్లు ఈనెల 18వ తేదీన ఓపెన్ చేసి ట్రాన్స్ పోర్టు వారిని ఎంపిక చేయాలని సూచించారు. అవగాహన కార్యక్రమంలో జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ కృష్ణ, సహాయ సంచాలకులు డాక్టర్ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.