ప్రతి ఐదుగురు బాలురిలో ఒకరు, ప్రతి ఆరుగురు బాలికల్లో ఒకరు వివాహితులే

బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేసే విషయంలో ప్రగతి ఇటీవలి సంవత్సరాల్లో కుంటుపడిందని లాన్సెట్‌ అధ్యయనం వెల్లడించింది.

  • By: TAAZ    latest    Dec 16, 2023 11:32 AM IST
ప్రతి ఐదుగురు బాలురిలో ఒకరు, ప్రతి ఆరుగురు బాలికల్లో ఒకరు వివాహితులే
  • బాల్య వివాహాల నిరోధంలో కుంటుపడిన ప్రగతి
  • లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌ జర్నల్‌ అధ్యయనం వెల్లడి
  • న్యూఢిల్లీ : బేటీ పడావో.. బేటీ బచావో అని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన నినాదం సంగతేమోగానీ.. దేశంలో బాల్య వివాహాల కట్టడిలో ఏ మాత్రం పురోగతి కనిపించడం లేదు. దేశంలో ప్రతి ఐదుగురు బాలురలో ఒకరు, ప్రతి ఆరుగురు బాలికల్లో ఒకరు పెళ్లయినవారేనని లాన్సెట్ గ్లోబల్‌ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం పేర్కొన్నది. ప్రత్యేకించి ఇటీవలి సంవత్సరాల్లో ఈ ధోరణి మరింత పెరిగిందని అధ్యయనం వెల్లడించింది. 2016 -2021 మధ్య కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బాల్య వివాహాలు సర్వసాధారణమయ్యాయని అధ్యయనకారులు పేర్కొన్నారు.


మణిపూర్‌, పంజాబ్‌, త్రిపుర, పశ్చిమబెంగాల్‌లో అధికం

మణిపూర్‌, పంజాబ్‌, త్రిపుర, పశ్చిమబెంగాల్‌ సహా ఆరు రాష్ట్రాల్లో బాల్య వివాహాలు గణనీయంగా పెరిగాయని అధ్యయనం తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌, గోవా, మణిపూర్‌, పంజాబ్‌ తదితర ఎనిమిది రాష్ట్రాల్లో మగ పిల్లల్లో బాల్య వివాహాలు గణనీయంగా పెరిగినట్టు పేర్కొన్నది. 1993 నుంచి 2021 వరకూ భారత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలను క్రోడీకరించి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయన బృందంలో హార్వర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకులు, భారత ప్రభుత్వంతో సంబంధం ఉన్న అధికారులు ఉన్నారు.


2016-2021 మధ్య కుంటుపడిన ప్రగతి

దేశవ్యాప్తంగా లెక్కలు చూస్తే మాత్రం బాల్య వివాహాలు తగ్గాయని అధ్యయనం తెలిపింది. యుక్త వయసుకు ముందే బాలికల్లో వివాహాలు 1993లో 49 శాతం ఉంటే.. 2021 నాటికి అది 22 శాతంగా ఉన్నది. బాలురలో 2006లో 7 శాతం ఉంటే.. 2021 నాటికి 2 శాతంగా ఉన్నది. అయితే.. బాల్య వివాహాల పద్ధతిని రూపుమాపే ప్రక్రియ ప్రగతి ఇటీవలి కాలంలో అంటే.. 2016 నుంచి 2021 మధ్య నిలిచిపోయిందని నివేదిక తెలిపింది. బాల్య వివాహాలను యునిసెఫ్‌ మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటున్నది. ఇది బాలబాలిక అభివృద్ధికి అడ్డంకిగా ఉంటుందని చెబుతున్నది. ప్రత్యేకించి బాలికలు దీని వల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్నారని పేర్కొంటున్నది.