Adilabad | ప్రాజెక్టులు కళకళ.. భారీగా చేరుతున్న వరద నీరు
Adilabad | గేట్లెత్తి.. దిగువకు నీటి విడుదల వాగుల ఉధృతితో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జోరు వానలు విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని ప్రాజెక్టులు వరద నీటితో పోటెత్తుతున్నాయి. ఇప్పటికే అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదిలిపెట్టారు. ఉమ్మడి జిల్లాలో కడెం నారాయణరెడ్డి, గడ్డెన్న వాగు, […]

Adilabad |
- గేట్లెత్తి.. దిగువకు నీటి విడుదల
- వాగుల ఉధృతితో పలు గ్రామాలకు రాకపోకలు బంద్
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జోరు వానలు
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని ప్రాజెక్టులు వరద నీటితో పోటెత్తుతున్నాయి. ఇప్పటికే అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదిలిపెట్టారు. ఉమ్మడి జిల్లాలో కడెం నారాయణరెడ్డి, గడ్డెన్న వాగు, శ్రీపాద ఎల్లంపల్లి, స్వర్ణ, సాథ్నాల, మత్తడి వాగు, కొమురంభీం ప్రాజెక్టులు ఉన్నాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు కలెక్టర్ కే వరుణ్ రెడ్ది బుధవారం సెలవు ప్రకటించారు.
జిల్లాలోని ప్రధానమైన కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టులోకి క్రమక్రమంగా వరద నీరు వచ్చి చేరుతోంది. నాలుగు గేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి వదిలిపెట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 696 అడుగుల వరకు నీరు చేరింది. ఇటీవల కాలంలో ఈ ప్రాజెక్టు రెండు సార్లు వరద ముంపు నుంచి బయటపడింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు వరద తాకిడి పెరిగింది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను. 17.565 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గోదావరి నుంచి ఇన్ ఫ్లో 192474 క్యూసెక్కులు వస్తుండగా, అవుట్ ఫ్లో 200196 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు.
జిల్లాలోని మరో ప్రధాన ప్రాజెక్టు భైంసా పట్టణంలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 8600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, ఒక ప్రాజెక్టు గేటును పైకి ఎత్తి 8600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిపెట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు కాగా, నీటి మట్టం 358.60 మీటర్లకు చేరింది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చి చేరిన వరద నీటిని దిగువకు వదిలిన నేపథ్యంలో ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తూ జలకళను సంతరించుకొన్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో..
మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలోని సాథ్నాల, మత్తడి వాగు ప్రాజెక్టులు కూడా భారీ వర్షాలతో కళకళలాడుతున్నాయి. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువన మహారాష్ట్రలో కూడా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వాగులపై వంతెనలు తెగిపోయి ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొన్ని రోజులు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మారుమూల గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు.
బాహ్య ప్రపంచంతో సంబంధాలను కోల్పోతున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో కొన్ని వాగులు ఉధృతంగా ప్రవహించడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లక్మాపూర్ గ్రామ మధ్యలో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజులు గడిచినా వాగు ఉధృతి తగ్గలేదు. లక్మాపూర్ గ్రామానికి చెందిన మల్లేష్ తన కూతురుకు జ్వరం రావడంతో, వైద్యం కోసం వాగు దాటి కెరెమెరికి వెళ్లాల్సి వచ్చింది. ధైర్యం చేసి మెడ వరకు వస్తున్న వాగునీళ్లలో నడుచుకుంటూ బాహుబలి సినిమాని తలపించే విధంగా కూతుర్ని తలపైకి పట్టుకొని కెరెమెరికి వెళ్లి వైద్యం చేయించాడు.
గ్రామీణ ప్రాంతాల్లో వాగులపై వంతెనలు లేకపోవడం, నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కొన్ని గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరమవుతున్నాయి. మొన్నటి వరకు వాన జాడ లేకుండా పోయింది. తాజాగా ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో పంటలకు కొంత జీవం పోశాయని అన్నదాతలు మురిసిపోతున్నారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో రైతులు పంట నష్టపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కురుస్తున్న వర్షాలు ఆశలను చిగురింపజేస్తున్నాయి.