G. Jagadish Reddy | పథకం ప్రకారమే కేసీఆర్, కేటీఆర్ లపై దుష్ప్రచారం : మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి
కొందరు సత్యహరిశ్చంద్రునికి అన్నలుగా మీడియాపై దాడులా అంటూ ఫోజు కొడుతున్నారని..దక్కన్ క్రానికల్, సాక్షిలపై టీడీపీ, జనసేన దాడులు చేయలేదా? అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. మహా న్యూస్‌పై దాడి జరిగిందని ఎవరికీ తెలియకముందే చంద్రబాబు స్పందించారని..అంటే చంద్రబాబు ముందస్తు ప్రణాళిక ఏంటో దీన్ని బట్టి అర్థమవుతోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు.

G. Jagadish Reddy | ఫోన్ ట్యాపింగ్ కేసును అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పథకం ప్రకారం..కుట్రపూరితంగా ఆంధ్ర మీడియా దుష్ఫ్రచారం చేస్తుందని..మా నాయకులను అభిమానించే కోట్లాది ప్రజల మనసులను గాయపరిచిన వారిని వదిలేది లేదని మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా నుంచి తెలంగాణ విడిపోవడం ఇష్టం లేని వాళ్ళు కేసీఆర్‌పై కక్ష కట్టారని..మీడియా హౌజ్‌ల పేరిట స్లాటర్ హౌజ్‌లు నడుపుతు కేసీఆర్, కేటీఆర్‌లపై కుట్ర పూరిత కథనాలు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమంలో మాదిరిగానే తెలంగాణ వ్యతిరేక మీడియా ముసుగులు తీస్తామని..వారి రాక్షస రూపం బయటపెడతామని హెచ్చరించారు. ఇష్టమొచ్చినట్టు రాసి ఇదే జర్నలిజం అంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. పోలీస్ డ్రెస్ వేసుకుని దొంగ వచ్చిన్నట్టు, మిలిటరీ డ్రెస్ వేసుకుని ఉగ్రవాది వచ్చినట్టు.. మీడియా ముసుగు వేసుకుని మమ్మల్ని కాలుస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ విషయాలు అధికారికంగా ఎక్కడైనా వెల్లడించారా? అని ప్రశ్నించారు. ఏముంది ఫోన్ ట్యాపింగ్‌లో ? ఎవడిచ్చాడు సమాచారం? ఏ బలుపుతో కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో ఇతర మహిళల ఫోటోలను థంబ్‌నెయిల్ గా చూపిస్తారంటూ ప్రశ్నించారు. మీడియా ముసుగులో మీరు చేస్తున్న దుర్మార్గాలతో ఎంత మందిని క్షోభ పెడతారని.. మా ఆడబిడ్డలు ఏడుస్తున్నారు? ఎందుకు మీరు మాట్లాడటం లేదని మమ్మల్ని అడుగుతున్నారు? అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఏ మహిళనైనా తన ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పారా? కాళేశ్వరం అని కొంత సేపు, ఫోన్ ట్యాపింగ్ అని ఇంకొంత సేపు సీరియళ్ల సిరీస్ నడుపుతున్నారని…మీడియా హౌజ్ పేరిట ఏమిటీ అరాచకం? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ పై ట్యాపింగ్ బురద
ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ మాకు పట్టలేదని..ఫోన్ ట్యాపింగ్ కేసు పనికిమాలిన కేసు అని..ప్రభుత్వ వైఫ్యల్యాలను..తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్‌ను బద్నామ్ చేసే కుట్ర చేస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఆధారాలు లేనిది వార్తలు రాసి మా వ్యక్తిగత హననానికి పాల్పడితే సహించేది లేదన్నారు. కోట్లాది మంది హృదయాలు గాయపడ్డపుడు మీడియా హౌజ్‌ల దగ్గర నిరసనలు సహజమని..కేసీఆర్, కేటీఆర్‌లతో పాటు వేరే మహిళలు ఉన్న ఫోటోలు వేస్తున్నారని విమర్శించారు. అవి వేసినవారు వారి కుటుంబ మహిళల ఫోటోలు వేసుకుంటే బాగుంటుందని మా వాళ్ళు అంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి మీడియాను పండబెట్టి తొక్కుతా అన్నది వాళ్లకు కనిపించడం లేదా అని నిలదీశారు. మీడియా హౌజ్‌ల పేరిట కబేళా హౌజ్‌లను నడపడం మీదనే మా నిరసన అని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. మహాన్యూస్ పై చేసింది దాడి కాదని.. మేమింకా ఏ దాడి చేయలేదని.. పిల్లలు వాళ్ల పద్దతిలో వాళ్లు నిరసన తెలిపి వచ్చరంతే.! అని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేసి ప్రెస్ కౌన్సిల్ కు వెళుతా బిన్ లాడెన్ వద్దకు వెళుతా అంటే మాకేం అభ్యంతరం లేదన్నారు.
కేసీఆర్ వ్యతిరేకుల మీడియా కుట్ర
కొందరు సత్యహరిశ్చంద్రునికి అన్నలుగా మీడియాపై దాడులా అంటూ ఫోజు కొడుతున్నారని..దక్కన్ క్రానికల్, సాక్షిలపై టీడీపీ, జనసేన దాడులు చేయలేదా? అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. మహా న్యూస్‌పై దాడి జరిగిందని ఎవరికీ తెలియకముందే చంద్రబాబు స్పందించారని..అంటే చంద్రబాబు ముందస్తు ప్రణాళిక ఏంటో దీన్ని బట్టి అర్థమవుతోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబుకు దమ్ముంటే కేటీఆర్, కేసీఆర్‌లపై మహా న్యూస్‌లో పెట్టిన థంబ్‌నెయిల్స్‌కు మద్దతు ప్రకటించి మాట్లాడాలని సవాల్ చేశారు. కేసీఆర్ ఫీనిక్స్ పక్షిలా వస్తున్న తీరు తెలంగాణ వ్యతిరేకులకు నచ్చడం లేదని..కేటీఆర్ ప్రజల పక్షాన పోరాడటం తెలంగాణ వ్యతిరేకులను నచ్చడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి టూల్ మాత్రమేనని.. మోడీ, చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణను దేశానికి రోల్ మోడల్ చేశారని.. అందుకే కేసీఆర్ కు వ్యతిరేకులు మీడియా ముసుగులో కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు భార్య గురించి ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగినపుడు కేసీఆర్ బాధపడ్డారని..మీలాగా కేసీఆర్‌కు ప్రచారం చేసుకునే అలవాటు లేదన్నారు. మాకు భాష రాక కాదు.. హుందాగా ఉంటున్నామన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది
దేశంలో ఫోన్ ట్యాపింగ్ చేయని రాష్ట్ర ప్రభుత్వం ఉందా? అని..రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని చెప్పగలరా? అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఉద్యమంలో నా ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందని..ఎవరి డ్యూటీ వాళ్ళం చేశామన్నారు. కాళేశ్వరం మేడిగడ్డలో పిల్లర్లకు చిన్న పగుళ్లు వస్తే నానా హంగామా చేసిన కాంగ్రెస్, బీజేపీ నేతలకు వాళ్ళ పాలిత రాష్ట్రాల్లో ఎన్నో బ్రిడ్జిలు కూలుతున్నా మాట్లాడరన్నారు. మీడియా కూడా అక్కడ జరుగుతున్న విషయాలు చూపించడం లేదన్నారు. మీడియా అంటే మాకు గౌరవం ఉందన్నారు. సమైక్యవాదుల నీడలో బతుకుతున్ కోదండరాం తన పాత ఉద్యమాల గురించి పశ్చాత్తాప పడుతున్నట్టు ఉందన్నారు. కొందరు శాంతి దూతలుగా నటించడం మరీ విడ్డూరమన్నారు. వాళ్ళ బలుపు అహంకారం అంతా కేసీఆర్ ఏమనరులే అని..కేసీఆర్‌ను ఏమైనా అంటాం అధికారంలోకి వచ్చాక మళ్ళీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాం అనేది వారి ఆలోచన అని జగదీష్ రెడ్డి విమర్శించారు.