ప్రజా భవన్ వద్ద కారు బీభత్సం.. బారికేడ్లు ధ్వంసం
బేగంపేటలోని ప్రజా భవన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అక్కడున్న బారికేడ్లను కారు వేగంగా ఢీకొట్టింది

హైదరాబాద్ : బేగంపేటలోని ప్రజా భవన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అక్కడున్న బారికేడ్లను కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో బారికేడ్లు పూర్తిగా ధ్వంసం కాగా, కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి దాటాక 2:45 గంటల సమయంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. శనివారం అర్ధరాత్రి ఓ కారు వేగంగా దూసుకొచ్చి ప్రజా భవన్ ముందున్న బారికేడ్లను ఢీకొట్టింది. అనంతరం ఓ యువకుడు కారు దిగి పరారీ అయ్యాడు. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడు మద్యం తాగలేదని తేల్చారు. మరో ముగ్గురు యువతులు కూడా కారులో ప్రయాణించినట్టు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా పోలీసులు నిర్ధారించారు.
ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు ప్రమాదానికి గురైన కారు(టీఎస్ 13 ఈటీ 0777) ను సీజ్ చేశారు. కారు నడిపిన అబ్దుల్ ఆసిఫ్(27)పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాద సమయంలో బోధన్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే తనయుడు కారు నడిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసు నమోదు సమయంలో అసలు నిందితుడిని తప్పించి మరొకరి పేరు చేర్చినట్టు సమాచారం. పంజాగుట్ట పోలీసులు మాత్రం డ్రైవింగ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం ట్రాఫిక్ పోలీసులకు అప్పగించినట్టు చెబుతున్నారు. వాస్తవాలు ఏమిటనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని నగర సీపీ శ్రీనివాస్ రెడ్డి పంజాగుట్ట పోలీసులను ఆదేశించినట్టు తెలిసింది