సింగరేణి యాజమాన్యానికి హైకోర్టులో ఊరట

- సింగరేణి జూనియర్ అసిస్టెంట్ నియామక ప్రక్రియకను చేపట్టవచ్చు
- తుది ఉత్తర్వుల మేరకే నియామకాలు ఉంటాయి
- స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు
విధాత, హైదరాబాద్ : సింగరేణి యాజమాన్యానికి హైకోర్టు ఊరటనిచ్చింది. గత సంవత్సరం నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 పరీక్ష ఫలితాలను వెల్లడించి, నియామక ప్రక్రియ చేపట్టవచ్చని చెప్పింది. అభ్యర్థులను ఎంపిక చేయవచ్చని చెబుతూ.. తుది ఉత్తర్వుల మేరకే నియామకాలు ఉంటాయని స్పష్టం చేసింది. సింగరేణి వ్యాప్తంగా 177 జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేసేందుకు 2022లో సింగరేణి యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చింది.
దాదాపు 98,882 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2022, సెప్టెంబర్ 4న రాష్ట్రంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంతో పాటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్‌లో నిర్వహించిన పరీక్షకు 79,898 మంది హాజరయ్యారు. ఆ తర్వాత సింగరేణి యాజమాన్యం ‘కీ’ని విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో పరీక్ష సందర్భంగా మాస్ కాపీయింగ్, ఇతర అవకతవకలు జరిగాయంటూ రామగుండంకు చెందిన అభిలాష్ సహా పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 పరీక్షను రద్దు చేశారు. నిర్వహణలో పలు అవకతవకల కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని, నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ పరీక్షను మళ్లీ నిర్వహించాలని తేల్చిచెప్పారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు.
ఈ అప్పీల్‌పై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ జె.అనీల్‌కుమార్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. సింగరేణి తరపున స్పెషల్ జీపీ ఎ.సంజీవ్‌కుమార్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. నియామక ప్రక్రియకు అనుమతించింది. దర్యాప్తు తర్వాత తుది ఉత్తర్వుల మేరకే నియామకాలు ఉంటాయని చెబుతూ విచారణను వాయిదా వేసింది. కాగా, కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ ఎన్.బలరామ్ తెలిపారు. అతి త్వరలోనే నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.