ఈ నెల 6 నుంచి రేవంత్ రెడ్డి ‘హత్ సే హత్‌జోడో’ యాత్ర
మేడారం సమ్మక్క,సారలమ్మలను దర్శించుకొని పాదయాత్ర ప్రారంభం ఎమ్మెల్యే సీతక్క సకల సన్నాహాలు పాదయాత్రపై ఏఐసీసీ పర్యవేక్షణ తొలివిడత 60 రోజులు 50 నియోజకవర్గాలు సర్వశక్తులొడ్డుతున్న రేవంత్ వర్గం రాజకీయ వర్గాలు యాత్ర పట్ల ఆసక్తి. విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హత్ సే హత్ జోడో పాదయాత్ర ఈ నెల 6 న ములుగు జిల్లా మారుమూల అటవీ ప్రాంతంలో వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువైన మేడారంలో నుంచి ప్రారంభం […]

- మేడారం సమ్మక్క,సారలమ్మలను దర్శించుకొని పాదయాత్ర ప్రారంభం
- ఎమ్మెల్యే సీతక్క సకల సన్నాహాలు
- పాదయాత్రపై ఏఐసీసీ పర్యవేక్షణ
- తొలివిడత 60 రోజులు 50 నియోజకవర్గాలు
- సర్వశక్తులొడ్డుతున్న రేవంత్ వర్గం
- రాజకీయ వర్గాలు యాత్ర పట్ల ఆసక్తి.
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హత్ సే హత్ జోడో పాదయాత్ర ఈ నెల 6 న ములుగు జిల్లా మారుమూల అటవీ ప్రాంతంలో వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువైన మేడారంలో నుంచి ప్రారంభం కానున్నది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ జోడో యాత్ర ముగిసిన నేపథ్యంలో ఈ హాత్ సే హాత్ జోడో తెలంగాణలో చేపట్టేందుకు నిర్ణయించారు.
తొలుత భద్రాచలం నుంచి ఈ యాత్ర ప్రారంభించాలని భావించినప్పటికీ వివిధ కారణాల రీత్యా ములుగు జిల్లా మేడారం నుంచి యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలుగా భావించే ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ కారణంగా ములుగును యాత్ర ప్రారంభానికి అనువైనదిగా రేవంత్ రెడ్డి భావించినట్లు చెబుతున్నారు. ఈనెల ఒకటో తారీఖున ప్రారంభమైన మినీ మేడారం జాతర నాలుగో తేదీన ముగియగానే ఆరవ తేదీ నుండి అదే మేడారం నుంచే కాంగ్రెస్ జాతర షురూ కానున్నది.
- తొలి విడత 50 నియోజకవర్గాలు 60 రోజులు
హత్ సే హత్‌జోడో యాత్ర మొదటి విడత 60 రోజులపాటు కొనసాగనున్నట్లు ఇప్పటికే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. మొదటి విడత 50 నియోజకవర్గాలలో ఈ యాత్ర సాగనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మొదటి విడత యాత్ర ముగిసిన అనంతరం మిగిలిన నియోజకవర్గాలలో యాత్రకు సంబంధించి పార్టీలో చర్చించుకుని తగు కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. తనకు అత్యంత ఆప్తురాలు ఆత్మీయ సోదరి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం మేడారం నుంచి ఈ యాత్ర ప్రారంభం కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. యాత్రపై ఏఐసీసీ పర్యవేక్షణ కొనసాగుతుందని రేవంత్ స్పష్టం చేశారు.
- ఆలస్యమైన రేవంత్ అనుకున్నదే జరుగుతోంది
వాస్తవానికి రేవంత్ రెడ్డి తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియామకమైనప్పటినుంచి పాదయాత్ర చేపట్టేందుకు పలుసార్లు ప్రయత్నించినా ఆ పార్టీలోని రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం అడ్డు పుల్ల వేయడంతో పాదయాత్ర ప్రారంభానికి అవకాశం దక్కలేదు. తాజాగా ఆ పార్టీ యువనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు జోడోయాత్ర చేపట్టడంతో ఆ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఏఐసిసి ఇచ్చిన పిలుపుమేరకు రేవంత్ రెడ్డికి పాదయాత్ర చేపట్టే అవకాశం దక్కింది. ఇప్పటికీ రేవంత్ యాత్ర పట్ల కొందరు సీనియర్ నాయకుల నుంచి అడ్డంకులు ఉన్నప్పటికీ ఏఐసీసీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి ఈనెల 6న మేడారం నుంచి తన యాత్రను చేపట్టేందుకు సర్వసన్నద్ధమయ్యారు. ఈ దిశగా ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.
- సర్వసన్నద్ధం సకల ఏర్పాట్లు
పార్టీ ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొని తన బలం, బలగాలను మోహరించి కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్తేజం తెచ్చి అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ తన పట్టునూ, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను పెంచాలని దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి సకల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తన యాత్ర ఎట్టి పరిస్థితులలో విజయవంతం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే తన అనుకూల నాయకులు, అనుచరులు రంగంలో దిగి యాత్రకు అవసరమైన సకల సరంజామా సిద్ధం చేస్తున్నారు.
యాత్ర కోసం ఇప్పటికే ప్రత్యేకంగా 15 వాహనాలను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ వాహనాలలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఒక వాహనం వేదికగా రూపొందించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. మీడియా కోసం, కళాకారుల కోసం, ఇతరత్రా అవసరాల కోసం మిగిలిన వాహనం వాహనాలను వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ వాహనాల్లో విద్యుత్ జనరేటర్ లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. యాత్రకు ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా తగిన అన్ని అవసరాలు సమకూర్చుకుంటున్నట్లు చెబుతున్నారు.
- యాత్ర పైన ఏఐసీసీ పర్యవేక్షణ
ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మానిక్ రావు ఠాకూర్ పర్యవేక్షణలో ఈ యాత్ర సాగను న్నది. దీనికి సంబంధించి ఏఐసీసీ 12 మందితో కమిటీ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఈ కమిటీలో ఠాకూర్ కూడా సభ్యులుగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. యాత్ర మధ్యలో ఎఐసిసి, పీసీసీ నాయకులు పాల్గొంటారని చెబుతున్నారు.
కాగా యాత్రలో భాగస్వామ్యం అయ్యే నాయకులు, ముఖ్య నాయకుల వివరాలు, యాత్ర విజయవంతంలో వారి భాగస్వామ్యం, తదితర విషయాల పట్ల ఎప్పటికప్పుడు ఏఐసీసీ పర్యవేక్షణతో పాటు నివేదికలు సమర్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికలకు ఈ యాత్రలో భాగస్వామ్యం అయ్యే నాయకుల పనితీరు, పట్టుదల గీటురాయి కానున్నట్లు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ సాధ్యమేనా? అనే సంశయం కూడా లేకపోలేదు.
- యాత్ర కోసం సీతక్క సన్నాహాలు
తనకు అనుకూలమైన ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో జన సమీకరణకు ఎలాంటి సమస్యలు ఉండవని రేవంత్ భావిస్తున్నారు. ఈ మేరకు రెండు రోజుల నుంచే ఎమ్మెల్యే సీతక్క రంగంలోకి దిగి గ్రామ గ్రామం నుంచి కార్యకర్తలు ఈ యాత్రలో భాగస్వామ్యం అయ్యే విధంగా సర్వశక్తులు ఒడ్డుతోంది. మేడారం మినీ జాతర నేపథ్యంలో ఇప్పటికే కొండాయి ఐలాపురం సమ్మక్క సారమ్మలను దర్శించుకుని యాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇప్పటికే కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. శుక్రవారం ములుగు, వెంకటాపురం మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిపారు. ఐదో తేదీలోపు మిగిలిన మండలాలలో కూడా కాంగ్రెస్ శ్రేణులను కదిలించే ఏర్పాట్లను ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతోంది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ఇప్పటినుంచి సీతక్క ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేవంత్ రెడ్డి యాత్ర మన నియోజకవర్గం నుంచి ప్రారంభం కానున్న ప్రతి కార్యకర్త ఈ యాత్రను జయప్రదం చేయడంలో భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని సీతక్క ఈ సమావేశాల్లో నొక్కి చెప్పారు.
- అధికారమే కాంగ్రెస్ లక్ష్యం
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని సీతక్క కోరారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏక కాలంలో రూ. 2లక్షల రైతు రుణమాఫీ చేస్తుందని వివరించారు. పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం,రైతుల పాలిట శాపంగా మారిన నేపథ్యంలో సరైన ధర కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. రైతుల భూ వ్యవహారాలను ఇబ్బందుల్లోకి నెట్టిన ధరణి పోర్టల్ రద్దు చేస్తామని ప్రకటించారు.
పోడు భూములకు పట్టాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది సీతక్క వివరించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న గులాబీ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు కదలాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని సీతక్క పిలుపునిచ్చారు. ఈ విషయాలను రేవంత్ రెడ్డి చేపడుతున్న పాదయాత్రలో ఇంటింటికి తీసుకుపోయేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని ఎమ్మెల్యే వివరించారు.
- రేవంత్ యాత్ర పట్ల రాజకీయ వర్గాల ఆసక్తి
చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అందులో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా చేపడుతున్న పాదయాత్ర కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ పాదయాత్ర పట్ల విపక్ష వర్గాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. యాత్రకు ప్రజల నుంచి ఏ విధమైన స్పందన వస్తుందో ఆధారపడి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేపట్టబోయే తన పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోని ఇతర వర్గాలు కూడా రేవంత్ యాత్ర పట్ల మరో విధమైన ఆసక్తిని కనబరుస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న గులాబీ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ నేతలు కాంగ్రెస్ చేపడుతున్న ఈ యాత్ర పట్ల మరింత ఆసక్తిని చూపుతున్నారు.