అధ్యక్ష రేసు నుంచి మరొకరు ఔట్.. పోటీ నుంచి తప్పుకొన్న డెసాంటిస్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్ పోటీ నుంచి వైదొలిగారు

అమెరికా (America) అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్ పోటీ నుంచి వైదొలిగారు. ఆయన ఈ మేరకు ఆదివారం ప్రకటించారు. తాను పోటీ నుంచి తప్పుకొంటున్నానని.. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నానని ఆయన వెల్లడించారు. న్యూ హాంప్‌షైర్ రాష్ట్రంలో త్వరలో రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఒకానొక సమయంలో ఆయన ట్రంప్‌కు గట్టి పోటీదారుగానూ కనపడ్డారు.
అయితే ఇటీవల జరుగుతున్న అంతర్గత ఎన్నికల్లో ట్రంప్‌కు అనూహ్యంగా మద్దతు పెరగగా.. డెసాంటిస్ సింగిల్ డిజిట్‌లకే పరిమితం అవుతున్నారు. తన విజయం కనుచూపు మేరలో కనపడటం లేదని భావిస్తున్నానని.. అందుకే గౌరవంగా పోటీ నుంచి తప్పుకొంటున్నానని ప్రకటించారు. ‘నేను ఇక పోటీలో ఉండబోను. అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి వైదొలుగుతున్నా. ఇక నేను చేయగలిగిందేమైనా ఉంటే అది ట్రంప్‌కు మద్దతుగా ప్రచారం చేయడమే. ఆ కార్యక్రమాల్లో పాల్గొంటాను’ అని డెసాంటిస్ ఎక్స్‌లో ఒక వీడియో విడుదల చేశారు. సుమారు 7 నెలల పాటు ఆయన \ఈ ఎన్నికల్లో ఓ పోటీదారుడిగా ప్రచారం నిర్వహించారు.
తాజా ప్రకటనతో ఈ ప్రయాణానికి ముగింపు పలికినట్లయింది. ట్రంప్ తనకు అధ్యక్ష పదివికి అత్యంత ఎక్కువ ప్రజాకర్షణ ఉన్న నేతగా కనపడుతున్నారని డెసాంటిస్ వ్యాఖ్యానించారు. ట్రంప్‌కు మరో అవకాశం ఇవ్వాలని రిపబ్లికన్లు నిర్ణయించుకున్నట్లు తనకు అర్థమైందన్నారు. ట్రంప్‌తో కొన్ని విషయాల్లో తనకు భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కంటే ట్రంప్ అత్యుత్తమని అభిప్రాయపడ్డారు.
డెసాంటిస్ ప్రకటనపై ట్రంప్ స్పందించారు. ‘ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. ఇక్కడి వరకు ప్రచారాన్ని చాలా బాగా నిర్వహించారు. అది సులువైనది కాదు’ అని వ్యాఖ్యానించారు. ఇప్పటికి వివేక్ రామస్వామి, డెసాంటిస్ పోటీ నుంచి తప్పుకోవడంతో.. ఇక నిక్కీ హేలీ మాత్రమే ట్రంప్‌తో పోటీలో ఉన్నట్లు అయింది. వీరిద్దరి మధ్యా మంగళవారం.. న్యూ హాంప్‌షైర్‌లో ప్రైమరీ ఎలక్షన్ జరగనుంది.