Karimnagar | బీఆర్ఎస్ కార్పొరేటర్‌పై రౌడీషీట్

భూకబ్జాల కేసులో కొత్తపల్లి పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్ జంగిలి సాగర్ పై కరీంనగర్ పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు

Karimnagar | బీఆర్ఎస్ కార్పొరేటర్‌పై రౌడీషీట్

Karimnagar | విధాత బ్యూరో, కరీంనగర్: భూకబ్జాల కేసులో కొత్తపల్లి పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్ జంగిలి సాగర్ పై కరీంనగర్ పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. కార్పొరేటర్‌పై భూ కబ్జాలకు సంబంధించి అనేక ఫిర్యాదులు రావడం, ఇప్పటికే ఐదు క్రిమినల్ కేసుల్లో నిందితునిగా ఉండడంతో, పోలీస్ మాన్యువల్ 600 ప్రకారం రూరల్ సబ్ డివిజన్ పోలీసులు ఆయనపై రౌడీషీట్ ఓపెన్ చేశారు.


కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని భూమికి సంబంధించి సాగర్ తనకు 40 లక్షలు ఇవ్వాలని పదవి విరమణ పొందిన ఉపాధ్యాయున్ని డిమాండ్ చేశారు. ఇవ్వకపోవడంతో ఆ భూమి మధ్య నుండి రహదారి వేయించి భూ యజమానిని ఇబ్బందులకు గురి చేశారు. ఇది లేని పరిస్థితుల్లో సదరు రిటైర్డ్ ఉపాధ్యాయుడు కార్పొరేటర్ తో రాజీ కుదుర్చుకునేందుకు రెండు లక్షలు అతని కూతురు బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేశారు. మరో ఎనిమిది లక్షలు నేరుగా సాగర్ కు అందజేశారు.


ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆయన పోలీసులకు సమర్పించారు. ఈ కేసులో సాగర్ ను కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా, కోర్టు ఆయనకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. సాగర్ పై 515/2011లో సెక్షన్ 447,186R/W34, క్రైమ్ నెంబర్ 90/2022లో సెక్షన్ 427,290,324R/W34 ఐపిసి, క్రైమ్ నెంబర్ 164/2023లో 147,148,452,427,R/W149, క్రైమ్ నెంబర్ 31/2024లో 386,506 కింద కేసులు నమోదు అయ్యాయి.


సాగర్ అరెస్టుకు ముందు బీఆర్ఎస్ పార్టీకే చెందిన మరో కార్పొరేటర్ తోట రాములును పోలీసులు భూ కబ్జాల కేసులో అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఆయన నివాస గృహంలో స్వాధీనం చేసుకున్న అనేక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ఆధారంగా, భూకబ్జాల్లో మరెందరి ప్రమేయం ఉందనే విషయంలో ఆరా తీస్తున్నారు. భూ కబ్జాలకు సంబంధించి ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఈ అంశంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేసిన విషయం విధితమే.


ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి భూకబ్జాలకు సంబంధించి వందల సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. భూ కబ్జాల విషయంలో ఇప్పటికే మరో కార్పొరేటర్ ను పోలీస్ స్టేషన్లకు రప్పించి విచారణ జరిపిన పోలీసులు, ఆయన పాత్ర పై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. భూ కబ్జాల వ్యవహారంలో మరికొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్ట్ కాక తప్పదని ప్రచారం సాగుతోంది.


బీఆర్ఎస్ రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూకబ్జాల దందా యదేచగా సాగింది. ఈ వ్యవహారంలో అప్పటి మంత్రి గంగుల కమలాకర్ అనుంగు అనుచరుల ప్రమేయం ఎక్కువగా ఉందని పట్టణ ప్రజలు బాహాటంగానే ఆరోపించారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన ఇద్దరు కార్పోరేటర్లు కూడా ఆయనకు సన్నిహిత సహచరులే. భూ కబ్జాలపై పోలీసులు దూకుడు పెంచడంతో గత ప్రభుత్వంలో ఆడింది ఆటగా వ్యవహరించిన బీఆర్ఎస్ నేతల్లో వణుకు మొదలైంది. పోలీసులు ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.