చాలా చేస్తున్నాం.. కానీ ఇస్రో తొలి ప్రాధాన్యం మాత్రం అదే!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అనేక లక్ష్యాలతో పనిచేస్తున్నా.. అంతరిక్షంలోకి తొలి మానవ సహిత యాత్రకు ఉద్దేశించిన గగన్‌యాన్ తమ తొలి ప్రాధాన్యమని ఆ సంస్థ చైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు.

- గగన్‌యాన్‌పై ఇస్రో చైర్మన్ సోమనాథ్
విధాత: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అనేక లక్ష్యాలతో పనిచేస్తున్నా.. అంతరిక్షంలోకి తొలి మానవ సహిత యాత్రకు ఉద్దేశించిన గగన్‌యాన్ తమ తొలి ప్రాధాన్యమని ఆ సంస్థ చైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు. ‘ఒకటని కాదు.. చాలా టార్గెట్లు ఉన్నాయి. కానీ మా తొలి ప్రాధాన్యం మాత్రం గగన్‌యాన్. భారతీయుడిని అంతరిక్షంలోకి పంపి.. తిరిగి సురక్షితంగా తీసుకురావడం. ఇది మా తక్షణ, అతిపెద్ద టార్గెట్’ అని సోమనాథ్ కోల్‌కతాలో జరిగిన 2023 గ్లోబల్ ఎనర్జీ పార్లమెంటు కార్యక్రమం సందర్భంగా చెప్పారు.
2025 నాటికి గగన్‌యాన్ నిర్వహించాలని ఇస్రో భావిస్తున్నది. భూమి దిగువ కక్ష్యలో భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున మూడు రోజుల పాటు భారత వ్యోమగాములను ఈ మిషన్‌లో పంపనున్నారు. ఇది మూడు రోజుల కార్యక్రమం. భారతదేశపు అంతరిక్ష స్టేషన్ నిర్మాణం 2028లో మొదలు పెట్టి, 2035 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.
అక్టోబర్ నెలలో ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశమైన ప్రధాని నరేంద్రమోదీ.. 2040 నాటికి చంద్రుడిపైకి మానవ సహిత యాత్ర చేపట్టాలని, 2035 నాటికి ఇండియన్ స్పేస్ స్టేషన్‌ను నెలకొల్పాలని నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ఆదిత్య ఎల్ 1 లక్ష్యానికి చేరుకునేందుకు ప్రయాణం కొనసాగిస్తున్నదని సోమనాథ్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 7 నాటికి నిర్దేశిత లాగ్‌రేంజ్ పాయింట్ 1 (ఎల్ 1)కు చేరుకుంటుందని భావిస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో కొన్ని విన్యాసాలు చేపట్టాల్సి ఉంటుందని వివరించారు.