27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు
శాసనసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయి కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఇక అందరి చూపు సింగరేణి వైపు మళ్ళింది.

- గనుల మీద కొనసాగుతున్న కార్మిక సంఘాల ప్రచారం
- రెండేళ్లుగా ఎన్నికలు వాయిదాలు వేసిన యజమాన్యం
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: శాసనసభ ఎన్నికల ప్రక్రియ పూర్తయి కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఇక అందరి చూపు సింగరేణి వైపు మళ్ళింది. ఈనెల 27న సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ కూడా జారీ అయ్యింది. అయితే రెండేళ్లుగా వాయిదాలు వేస్తున్న యజమాన్యం ఇప్పటికైనా ప్రకటించిన తేదీన ఎన్నిక నిర్వహిస్తుందా? లేదా? అన్న ఆసక్తి నెలకొంది.
బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీబీజీకేస్ యూనియన్ కనుసన్నల్లో సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘం ఎన్నికలను కావాలని వాయిదాలు వేస్తూ వస్తున్నదని ఆరోపణలు వినిపించాయి. ఇపుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. దీంతో ఎన్నిక నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. కాగా ఈ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలపై పడనుంది. అయితే మొన్నటి శాసన సభ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే గెలుపొందారు. దీంతో ఈ ఎన్నికలకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నారు.
కోర్టు ఆదేశాలతో దిగివచ్చిన యాజమాన్యం
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి ఆరేళ్లు అవుతున్నప్పటికీ యజమాన్యం ఎన్నికల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తూనే వచ్చింది. కొన్ని రోజులు కరోనా నేపథ్యంలో వాయిదా వేయగా, మరికొన్ని రోజులు టీబీజీకేఎస్ ఎన్నిక కాలపరిమితి పొడిగింపుపై కోర్టును ఆశ్రయించిందని కాలయాపన చేస్తూ వచ్చింది. ఈనేపథ్యంలో ఎట్టకేలకు ఏఐటీయూసీ హైకోర్టును ఆశ్రయించింది. 2023 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సింగరేణి యాజమాన్యానికి సూచన చేసింది.
ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తే ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని సింగరేణి యాజమాన్యం హైకోర్టును మూడు నెలల గడువు కోరుతూ, జూన్ లో ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చింది. కార్మిక శాఖ సిద్ధంగా ఉన్నా.. సింగరేణి యాజమాన్యం మరోసారి కోర్టుకు వెళ్లి అక్టోబర్ మొదటి వారంలో ఎన్నికల నిర్వహిస్తామని గడువు కోరింది. అక్టోబర్ 28న గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన నేపథ్యంలో నోటిఫికేషన్ ప్రకటనను వారం రోజులపాటు వాయిదా వేయాలని కోరింది.
మరోమారు వాయిదా వేయడానికి ప్రణాళికలు చేస్తున్నారా? కోర్టును ఆశ్రయిస్తారా? అనుమానంతో ముందుగానే ఏఐటీయూసీ కెవియట్ పిటిషన్ వేసింది. ఈ క్రమంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు అక్టోబర్ లో నిర్వహణకు సమాలోచనలు చేస్తున్న నేపథ్యంలో నవంబర్ 3న జనరల్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చి మళ్ళీ వాయిదా పడింది. అసెంబ్లీ జనరల్ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికలు నిర్వహించలేమని గడువు కోరి డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది.
39,748 మంది కార్మికులు
సింగరేణి తెలంగాణలోని 11 ఏరియాలో విస్తరించి ఉంది. సంస్థలో సుమారు 39,748 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 27న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో వారు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ట్రేడ్ యూనియన్ నాయకులు సింగరేణి ఎన్నికల్లో పోటీకి ఇప్పటికే నామినేషన్ పక్రియ పూర్తయింది. పోటీలో ఉన్న అభ్యర్థులకు డిప్యూటీ లేబర్ కమిషన్ అధికారులు గుర్తులు కూడా కేటాయించారు.
పార్టీలకు ప్రతిష్టాత్మకం
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ ను గెలిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నది. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్.. రెట్టింపు ఉత్సాహంతో సింగరేణి ఎన్నికల్లో పాల్గొని అన్ని ఏరియాలలో తమ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీ గెలుపు కోసం కృషి చేయాలని చూస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు వచ్చేసరికి విడివిడిగా పోటీకి సిద్ధమయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ ఊపుతోనే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లోనూ జెండా ఎగురవేసేందుకు పథకం రూపొందిస్తున్నారు. సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికల్లో ఐఎన్టీయూసీ ఒకేసారి గెలుపొందింది. రెండోసారి గెలుపు కోసం వ్యూహాలకు పదునుపెడుతున్నారు. గనులపైన కార్మికులతో మాటామంతి గడుపుతూ ప్రచారం చేస్తూ గెలుపు కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.
సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాలు
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల కోసం సింగరేణి కార్మికులు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అదేరోజు రాత్రి తొమ్మిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇందులో 14,797 మంది సింగరేణి కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. డిసెంబర్ 27న జరగబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులు జాతీయ సంఘాల వైపు ఆసక్తి చూపుతారో? ప్రాంతీయ సంఘమైన టీజీబీకేఎస్ యూనియన్ వైపు ఆసక్తి చూపుతారో వేచి చూడాల్సిందే.