ఎల్పీజీ కొరతపై పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిపక్షాల నిరసన!

దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరతపై కాంగ్రెస్ సహా ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. కట్టెల పొయ్యి, వంట పాత్రలతో మోదీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Mar 12, 2026, 1:17 pm IST
Read Time: 4 mins
ఎల్పీజీ కొరతపై పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిపక్షాల నిరసన!

న్యూఢిల్లీ : పశ్చిమాసియా యుద్ద పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఏర్పడిన చమురు, ఎల్పీజీ గ్యాస్ కొరతను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పక్షాలు ఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహించాయి. పార్లమెంటు ప్రాంగణంలో బైఠాయించిన కాంగ్రెస్ సహా ప్రతిపక్ష ఎంపీలు కట్టెల పొయ్యి, గ్యాస్ సిలిండర్ ఫోటోలు, వంట పాత్రలతో నిరసనలో పాల్గొని.. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్బంగా ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లిఖార్జున్ ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు, ఆహార తయారీ సంస్థలు ఎల్పీజీ కొరతతో ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం సంక్షోభాన్ని ముందుగానే ఊహించకపోవడంతోనే ఈ రోజు ప్రజలు చమురు, గ్యాస్ కొరత ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.

అటు ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం విపక్షాల ఆరోపణలను కొట్టిపారేశారు. పశ్చిమాసియా సంక్షోభాన్ని రాజకీయాలకు వాడుకోవడం దారుణమని, ఇరాన్ తో ఇజ్రాయెల్, అమెరికా యుద్దంతో ప్రపంచ దేశాలన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాయని గుర్తు చేశారు. దేశంలో తగినంత ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని, బుక్ చేసిన వారికి రెండున్నర రోజుల్లో గ్యాస్ సరఫరా అందతుందని తెలిపారు.

మరోవైపు భారతీయ జెండాతో హర్మూజ్‌లో ప్రయాణించే నౌకలకు ఇరాన్‌ అనుమతించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భారత్‌, ఇరాన్‌ విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ఇప్పటికే భారత్‌కు చెందిన రెండు చమురు ట్యాంకర్‌లు సురక్షితంగా హర్మూజ్‌లో ప్రయాణించినట్లు సమాచారం. ముంబై పోర్టుకు గురువారం ఓ చమురు నౌక చేరుకుంది.

ఇవి కూడా చదవండి :

Telangana new DGP| తెలంగాణకు త్వరలో కొత్త పోలీస్ బాస్!
LPG Gas Shortage | గ్యాస్ కొరతతో కరెంటు పొయ్యిల ధరలకు రెక్కలు!