Srisailam Temple Sparsha Darshan| శ్రీశైలంలో స్పర్శ దర్శనం పునః ప్రారంభం

Srisailam Temple Sparsha Darshan: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం పునః ప్రారంభమైంది. మంగళవారం నుంచి ఉచిత స్పర్శ దర్శనాన్ని పునః ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. సామాన్య భక్తులకు వారంలో 4 రోజులు ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని దేవస్థానం కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 నుంచి 3.34 గంటల వరకు భక్తులు స్వామిని తాకే అవకాశం ఉంది. స్పర్శ దర్శనం సమయంలో సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి. మహాశివరాత్రి, బ్రహ్మోత్సవాలు, ఉగాది, దసరా ఉత్సవాలు, శ్రావణ మాసం, కార్తీక మాసాల్లో ఈ దర్శనం ఉండదు. ఉచిత స్పర్శ దర్శనం పునః ప్రారంభ తొలి రోజున సుమారు 1200 మంది భక్తులను అనుమతిచ్చినట్లు తెలిపారు.
శ్రీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కేవలం శ్రీశైలంలో, కాశీలో మాత్రమే అందుబాటులో ఉండటం విశేషం. క్యూ లైన్ లో వచ్చే భక్తులకు ఆధార్ ద్వారా టోకెన్ జారీ చేసి ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు.. గంటకు 600 చొప్పున సుమారు 2 గంటలు రోజుకు 1000మంది వరకు శ్రీస్వామివారి ఉచిత స్పర్శ దర్శనానికి భక్తులకు అవకాశం కల్పిస్తామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. స్వామి వారి భక్తులందరూ ఉచిత స్పర్శ దర్శన సౌకర్యాన్ని వినియోగించుకొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని తెలిపారు.