ఈ దేశాల్లో న్యూ ఇయ‌ర్ వేడుక‌లు కాస్త విభిన్నం… వినూత్నం!

ప్ర‌పంచవ్యాప్తంగా క్రిస్‌మ‌స్ సంద‌డి మొద‌లైపోయింది. సెమీ క్రిస్‌మ‌స్ వేడుక‌లు మొద‌లు కాగా నూత‌న సంవత్స‌ర వేడుక‌ల కోసం దేశాల ప్ర‌జలు ఆనందంగా ఎదురుచూస్తున్నారు.

  • By: Somu    latest    Dec 21, 2023 10:36 AM IST
ఈ దేశాల్లో న్యూ ఇయ‌ర్ వేడుక‌లు కాస్త విభిన్నం… వినూత్నం!

విధాత: ప్ర‌పంచవ్యాప్తంగా క్రిస్‌మ‌స్ సంద‌డి మొద‌లైపోయింది. సెమీ క్రిస్‌మ‌స్ వేడుక‌లు ఇప్ప‌టికే మొద‌లు కాగా.. నూత‌న సంవత్స‌ర వేడుక‌ల (New Year Celebrations) కోసం అన్నిదేశాల ప్ర‌జలు ఆనందంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పండుగ‌ను అంద‌రూ ఒకేలా చేసుకోరు. ఆయా ప్ర‌జ‌ల జీవ‌న విధానం, దేశాల సంస్కృతులు, స్థానిక న‌మ్మ‌కాల‌కు అనుగుణంగా కొత్త సంవ‌త్స‌రాన్ని ఆహ్వానిస్తారు. ఈ న‌మ్మ‌కాలు కొన్ని ఆస‌క్తిక‌రంగా, ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంటాయి.


అలా కొన్ని ప్ర‌త్యేక ప‌ద్ధ‌తుల్లో న్యూఇయ‌ర్ జ‌రుపుకొనే దేశాలు.. ఆ విధానాల‌ను ఒక సారి గ‌మ‌నిస్తే… బుల్‌ఫైట్‌ల‌కు ప్ర‌సిద్ధి చెందిన స్పెయిన్‌ (Spain) లో కొత్త ఏడాది వేడుక‌ల‌కు ద్రాక్ష ప‌ళ్లు ప్ర‌ధాన వ‌స్తువు. అర్ధ‌రాత్రి స‌రిగ్గా 12 ద్రాక్ష ప‌ళ్ల‌ను తిన‌డంతో వారి సంద‌డి మొద‌ల‌వుతుంది. అందుకోసం ప్ర‌త్యేకంగా 12 గంట‌లు కొట్టే గ‌డియారాన్నీ ఏర్పాటు చేసుకుంటారు. ఆ 12 గంట‌లు కొట్టే స‌మ‌యంలో గ‌బ‌గ‌బా 12 ద్రాక్ష‌ప‌ళ్ల‌ను తినేస్తారు.


వ‌చ్చే 12 నెల‌లూ త‌మకు అదృష్టాన్ని తెచ్చిపెట్టేలా నెలకో ద్రాక్ష తినాల‌ని ఇక్క‌డి వారి న‌మ్మ‌కం. ఒక వేళ 12 గంట‌లు కొట్టేలోపు ద్రాక్ష ప‌ళ్లు తిన‌లేక‌పోతే సంవ‌త్స‌రంలో ప్ర‌తికూల‌త‌లు త‌ప్ప‌వ‌ని స్పెయిన్ వాసులు బాధ‌ప‌డిపోతారు. మ‌రో యూర‌ప్ దేశం డెన్మార్క్‌ (Denmark) లో అయితే న్యూ ఇయ‌ర్ రోజు ప్ర‌తి ఇంట్లో ప్లేట్లు ప‌గిలిపోతాయి.


ఈ దేశంలో ప్ర‌జ‌ల‌కు క్రిస్‌మ‌స్‌, న్యూ ఇయ‌ర్ వ‌స్తే చాలు.. బాణ‌సంచా క‌న్నా పింగాణీ ప్లేట్లు మోగించ‌డానికే ఇష్ట‌ప‌డ‌తారు. ఈ శ‌బ్దాలు త‌మ‌కు శుభాన్ని చేకూరుస్తాయ‌ని వారి విశ్వాసం. ఆఖరుకి ప‌గిలిపోయిన ప్లేటు ముక్క‌లు ఎన్ని ఉంటే.. ఆ సంవ‌త్స‌ర‌మంతా అంత బాగుంటుంద‌ని న‌మ్ముతారు. ఈక్వెడార్ (Equador) ప్ర‌జ‌లు చేసుకునే న్యూ ఇయ‌ర్ వేడుకా విధానం.. మ‌న భోగి పండ‌గ‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. వీరు కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతూ.. పాత సంవ‌త్స‌రం గుర్తుల‌ను చెరిపేయాల‌నుకుంటారు.


దానికి సూచ‌కంగానే పాత‌త‌రం రాజకీయ నాయ‌కులు, పాప్ గాయ‌కుల దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేస్తారు. ఆ దిష్టిబొమ్మ‌ల‌ను వారి భాష‌లో ఏనోస్ వైజోస్ (పాత సంవ‌త్స‌రం) అని పిలుచుకుంటారు. ఇలా చేస్తే గ‌త కాల‌పు దుర‌దృష్టం, క‌ష్టాలు పోయి… కొత్త జీవితానికి ఆహ్వానం చెబుతున్న‌ట్లు వారు భావిస్తారు. స‌నాత‌న ధర్మంలో లాగానే బౌద్ధంలోనూ 108 సంఖ్య‌కు చాలా ప్రాధాన్యం ఉంది. ఆ మ‌త‌స్థులు ఎక్కువ‌గా ఉండే జపాన్‌ (Japan) లో నూత‌న‌ సంవ‌త్స‌రం రాగానే జ‌న‌వ‌రి 1 సాయంత్రం బౌద్ధారామాల్లో ఉండే గంట‌ను 108 సార్లు మోగిస్తారు.


జోయో నా కానే అనే మంత్రాన్ని జ‌పిస్తూ.. గంట‌లు కొడ‌తారు. త‌మ గ‌త పాపాల‌ను క్ష‌మించ‌మ‌ని వేడుకుంటారు. స్కాట్‌లాండ్ వాసుల న‌మ్మ‌కం కాస్త కొత్త‌గా ఉంటుంది. జ‌న‌వ‌రి 1 వ‌స్తుంద‌న‌గా అర్ధరాత్రి దాటాక ఎవ‌రు త‌మ ఇంట్లో అడుగు పెడ‌తారో.. వారిని బ‌ట్టే త‌మ సంవ‌త్స‌రం మొత్తుం ఉంటుంద‌ని న‌మ్ముతారు. బాగా న‌ల్ల జుట్టు ఉన్న వ్య‌క్తి అడుగుపెడితే శుభాలు క‌లుగుతాయని.. మ‌హిళ‌లు వ‌చ్చినా, త‌క్కువ జుట్టు ఉన్న‌వారు వ‌చ్చినా క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని వారు భావిస్తారు.


ద‌క్షిణాఫ్రికాలో న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ వేడుక‌ల‌కు వారి ఇళ్ల కిటికీలే ముఖ్యం. కొత్త సంవ‌త్స‌రం రాగానే ఎవ‌రి ఇళ్ల‌ల్లోంచి వారు కిటికీల ద్వారా ఫ‌ర్నీచ‌ర్‌ను బ‌య‌ట‌కు విసిరేస్తారు. పాత‌ను దూరంగా విసిరేసి వ‌దిలించుకోవ‌డం.. కొత్త‌ద‌నాన్ని ఆస్వాదించ‌డ‌మే ఇందులో ముఖ్య ఉద్దేశం. విధానం ఏదైనా స‌రే.. పాత విష‌యాల‌ను, వైఫ‌ల్యాల‌ను వ‌దిలేసి కొత్త‌ద‌నాన్ని ఆహ్వానించ‌డ‌మే న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌లో ప్ర‌ధాన అంశం.