కాళేశ్వరం ముంపు.. బీఆరెస్ కు ముప్పు
బీఆరెస్ ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు ఆపార్టీ కొంపముంచుతోంది. ఎన్నికల వేళ సెగ పుట్టిస్తోంది.

- ముంపు గ్రామాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
- మరో అభ్యర్థికి శేజల్ ఎఫెక్ట్.. ఛీకొడుతున్న మహిళలు
- మంచిర్యాల జిల్లాలో గులాబీకి ఎదురీత?
- కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై ప్రజల ఆసక్తి
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: బీఆరెస్ ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు ఆపార్టీ కొంపముంచుతోంది. ఎన్నికల వేళ సెగ పుట్టిస్తోంది. మంచిర్యాల జిల్లాలో ప్రాజెక్టు పరిధిలోని ముంపు ప్రాంతాల జనం తెరపైకి వచ్చారు. ప్రపంచంలోనే మెగా ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మించామని బీఆరెస్ గొప్పలుపోయింది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని తనే ఇంజనీర్ గా మారి తన మేధాశక్తిని ధారవోసి కలల సౌధం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించానని చెప్పుకున్నారు. ఇదే ప్రాజెక్టు ఎన్నికల వేళ గులాబీ అభ్యర్థులకు శాపంగా మారనుందా? అంటే ప్రజల నుండి అవుననే సమాధానం వస్తున్నది.
మంచిర్యాల, చెన్నూరు ప్రజలకు శాపం
మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాల ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు శాపమైంది. ఈ ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి నేటి వరకు మూడేళ్లుగా వర్షాకాలం వస్తే ఇక్కడి ప్రజలకు కునుకులేకుండా పోతోంది. గ్రామాలకు గ్రామాలు, కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బాధితులు ఇళ్లు ఖాళీ చేస్తున్నారు. జీవితకాలం సంపాదించిన ఆస్తిని వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.
ఈ ఘటనలు మర్చిపోలేదని ఆయా ప్రాంతాల ప్రజలు స్పష్టం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి ఏటా మంచిర్యాలకు వరదలు వచ్చి ముంపునకు గురవుతున్నాయి. ప్రాజెక్టు కింద ప్రతి 15 కిలోమీటర్ల దూరంలో ఒక్కో బ్యారేజీ నిర్మించడం మూలంగా బ్యారేజీలో వరద నీరు ఎక్కువై గ్రామాలు, పంట పొలాల్లోకి చొరబడుతున్నాయి. మంచిర్యాల పట్టణం ముంపునకు గురవుతోంది. గోదావరి పరివాహక ప్రాంతమంతా రైతుల పంట పొలాలు వేలాది ఎకరాలు ముంపులోనే ఉండిపోయాయి. పెట్టుబడి నష్టపోయి రైతులు అప్పులపాలయ్యారు.
మంచిర్యాల పట్టణ ప్రజల నరకయాతన
కాళేశ్వరం ప్రాజెక్టు మూలంగా అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎలాంటి సాగునీరు అందకపోగా, దాని ప్రభావం మంచిర్యాల జిల్లాను వణికిస్తోంది. ఏటా మంచిర్యాల పట్టణంలోని సగం ప్రాంతం ప్రతి వర్షాకాలం ముంపునకు గురవుతోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని, తట్టాబుట్ట సర్దుకుని, అర్ధరాత్రి పునరావాస శిబిరాలకు పరుగులు తీయాల్సి రావడం తమవంతైంది. పాలకులు చేసిన పాపానికి నరకయాతన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిరుపేదలు పైసా పైసా కూడబెట్టుకొని నిర్మించుకున్న ఇళ్లు కళ్లెదుటే ముంపునకు గురికావడంతో.. తమ వేదనను ఈ ఎన్నికల్లో చూపిస్తామని ప్రజలు బాహాటంగానే చెప్తున్నారు. మంచిర్యాల పట్టణంలోని రామ్ నగర్, పాత మంచిర్యాల, సంఘం, ఎల్ఐసీ కాలనీ, ఎన్టీఆర్ నగర్, నస్పూరు, సీతారాం పల్లితో కలిపి దాదాపుగా సగం ముంపునకు గురైనప్పటికీ.. సీఎం కేసీఆర్ ఒక్కసారి కూడా ఈవైపు రాలేదని వాపోతున్నారు. ప్రజలను పరామర్శించే తీరిక లేదు గానీ ఎలక్షన్లకు మాత్రం వస్తూ గొప్పలు చెబుతున్నారంటూ మండిపడుతున్నారు.
గోసగానే కరకట్ట బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాల్లో తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్ కాలు గిరిక కట్టుకొని ప్రజల ఓట్లను అడగడానికి తిరుగుతున్నారని, ఇప్పుడేమో కరకట్ట కడతామని హామీ తెరపైకి తెచ్చారని పెదవి విరుస్తున్నారు. మూడేళ్లుగా పట్టించుకోకుండా, కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి పరామర్శించే తీరికలేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. కనీసం మంత్రులు కూడా ఈ వైపు రాకుండా, ప్రజల గోడు పట్టించుకోకుండా మా కర్మకు మమ్మల్ని వదిలేసిన నాయకులు.. ఇప్పుడు ఓట్ల కోసం ఎలా వస్తున్నారని నిలదీస్తున్నారు.
అధికార పార్టీకి ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకు వచ్చారా అంటూ ప్రశ్నిస్తున్నారు. పునరావాస శిబిరాల్లో తలదాచుకుని, వరద ఉధృతి తగ్గిన తర్వాత ఇళ్లకు వెళ్లి చూస్తే గుండె చెరువవుతుందన్నారు. ఉన్న సామగ్రి బురదనీడిలో కూరుకుపోయి కన్నీళ్లు తప్ప ఇంకేమీ మిగలలేదంటూ బాధితులు ఆవేదన చెందుతున్నారు. వచ్చిన ఒక్క నాయకుడు కనీసం నష్టపరిహారం ఇవ్వలేదని ఆగ్రహిస్తున్నారు. ఇప్పుడు వచ్చి కరకట్ట నిర్మాణం చేస్తాం.. ఇది చేస్తాం.. అది చేస్తాం అంటున్నారని బాధితుల్లో అధికార బీఆరెస్ పై తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది.
చెన్నూరు రైతులకు కన్నీళ్లు
సాగునీటి ప్రాజెక్టుల కోసం రైతులు తమ విలువైన భూములు కోల్పోయారు. మిగతా భూములకు సాగునీరు అందుతుందని ఆశపడ్డారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మూలంగా రెండు పంటలకు నీళ్ళు అందడం దేవుడెరుగు.. వేసిన పంటలు చేతికి రాకుండా పోయాయని బాధిత రైతులు వాపోతున్నారు. రెండేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగువ భాగమైన చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు, భీమారం, జైపూర్ మండలాల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బ్యారేజ్ బ్యాక్ వాటర్ తో పంట మొత్తం ముంపునకు గురైంది. ఎమ్మెల్యే బాల్క సుమన్ ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇప్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి పరివాహక ప్రాంత రైతులను కన్నీళ్లు పెట్టిoచడానికి నిర్మించారని బాధితులు అంటున్నారు. బ్యాక్ వాటర్ తో ఏటా వేసుకున్న పంటలు కళ్ళముందే చెరువులుగా మారి, జవుకేసి పంటలు నష్టపోతున్నామని వాపోతున్నారు. ఎమ్మెల్యేను వేడుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు అంటున్నారు. ఎన్నికలవేళ ఆన్ని కోట్ల అభివృద్ధి చేశామని గొప్పలు పోతున్న బీఆరెస్ ఎమ్మెల్యే.. అన్నం పెట్టే రైతుకు కన్నీళ్లు రాకుండా చూడలేదని చెన్నూరు రైతులు నిలదీస్తున్నారు. చెన్నూరు, మంచిర్యాల రైతులు కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రజలు అధికార పార్టీపై గుర్రుగా ఉన్నారు.
బెల్లంపల్లి బీఆరెస్ కు మహిళల చిచ్చు
బెల్లంపల్లి బీఆరెస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మహిళ వివాదంలో ఇరుకున్నారు. ఎన్నికల వేళ ఆయనకు సంకటంగా మారింది. అనుచరులు పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు కబ్జాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు మరోవైపు ఉన్నాయి. ఇటీవల హరిజన్ డెయిరీ నిర్వాహకురాలు శేజల్ వివాదం నియోజకవర్గంలో రాద్దాంతమైంది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు చేశారు. న్యాయం కావాలని సీజన్ గల్లి నుండి ఢిల్లీ వరకు పోరాటం చేస్తూనే ఉంది.
ఇప్పటికీ సద్దుమణగలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం తనకు న్యాయం చేయడం లేదని.. అధికార పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున శేజల్ బెల్లంపల్లిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. దుర్గం చిన్నయ్యకు ఓటేస్తే బెల్లంపల్లి నియోజకవర్గంలో మహిళలకు రక్షణ కరువవుతుందని, భూములన్నీ కబ్జాలకు గురవుతాయని ఆమె ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేస్తున్నది.
వీటికితోడు ప్రభుత్వ పథకాల అమల్లో అవినీతిపైనా విమర్శలు ఎదుర్కొంటున్నారు. మంచిర్యాల జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార బీఆర్ఎస్ కు ప్రజలు సానుకూలంగా లేరని స్పష్టంగా తెలుస్తోంది. బెల్లంపల్లిలో భూకబ్జాలు, లైంగిక ఆరోపణలు మూలంగా ఒకరు, మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు ఆపార్టీని ఎన్నికల వేళ కలవరపెడుతున్నాయి.