ఇస్రో నయా చరిత్ర..! ఎక్స్‌పోశాట్ ప్రయోగం విజయవంతం..!
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో సరికొత్త చరిత్ర సృష్టించింది

XPoSat Mission | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. చంద్రయాన్-3, ఆదిత్య ఎల్-1 మిషన్ల విజయవంతంతో భారతదేశ కీర్తిని దిగంతాలకు ఎగురవేసింది. తాజాగా ప్రతిష్టాత్మక పీఎస్‌ఎల్వీ సీ-58 ప్రయోగం చేపట్టి ఎక్స్‌పోశాట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్‌సెంటర్‌లోని ఒకటో లాంచ్‌ప్యాడ్ నుంచి పీఎస్‌ఎల్వీ వాహనక నౌక ఎక్స్‌పోశాట్‌ను ఉదయం 9.10 గంటలకు నింగిలోకి మోసుకెళ్లింది. ప్రయోగానికి ఆదివారం ఉదయం కౌంట్‌డౌన్ ప్రారంభమైన విషయం తెలిసిందే.
పీఎస్‌ఎల్వీ ఎక్స్‌పోశాట్‌తో పాటు పది ఉపగ్రహాలను సైతం నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని భూకక్ష్యలో 500-700 కిలోమీటర్ల దూరంలో ప్రవేశపెట్టింది. అయితే, ఎక్స్‌పోశాట్ ప్రయోగం ఖగోళశాస్త్రంలో మరో చరిత్రకు నాందిగా నిలిచింది. ఎక్స్‌రే కిరణాల ఆధారంగా ఇది పని చేయనున్నది. ఈ తరహా ప్రయోగం చేపట్టిన దేశంగా భారత్ నిలిచింది. ఇంతకు ముందు నాసా మాత్రమే ఈ ప్రయోగం చేపట్టింది. మొదటిని నాసా ఇమేజింగ్ ఎక్స్-రే పొలారిమెట్రీ ఎక్స్‌ప్లోరర్ (IXPE) కాగా.. రెండోది ఎక్స్‌పోశాట్ ఇస్రోది కావడం విశేషం. విశ్వంలోని ఎక్స్-రే మూలాలను అన్వేషించడం ఎక్స్‌పోశాట్ లక్ష్యం కాగా.. ఐదేళ్లపాటు పని చేయనున్నది. ఎక్స్‌పోశాట్‌తో బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్‌పై అధ్యయనం చేయనున్నది