Sunkari Brothes : సుంకరి బ్రదర్స్‌కి కష్టకాలం.. BRSలో దక్కని గుర్తింపు!
విధాత: వారిద్దరూ అన్నా తమ్ముళ్లు.. ఒకరు సుంకరి బిక్షం గౌడ్.. మరొకరు సుంకరి మల్లేశం గౌడ్.. సుంకరి బ్రదర్స్ గా పేరొందిన వారిద్దరూ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులు బీసీ సామాజిక వర్గాలను రాజకీయంగా ఆలోచనలో పడేస్తున్నాయి. గౌడ సామాజిక వర్గంకు చెందిన వారిద్దరిలో బిక్షం గౌడ్ ఉపాధ్యాయ సంఘంలో, మల్లేశం గౌడ్ రాజకీయరంగంలో స్వశక్తి తో అంచలంచెలుగా ఎదిగినప్పటికీ ప్రస్తుతం ఇద్దరు కూడా రాజకీయ క్రీడలో ఎదురీదుతున్నారు. బిఆర్ఎస్‌కు అనుబంధంగా ఉన్న పిఆర్టియు ఉపాధ్యాయ సంఘంలో భిక్షం […]

విధాత: వారిద్దరూ అన్నా తమ్ముళ్లు.. ఒకరు సుంకరి బిక్షం గౌడ్.. మరొకరు సుంకరి మల్లేశం గౌడ్.. సుంకరి బ్రదర్స్ గా పేరొందిన వారిద్దరూ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులు బీసీ సామాజిక వర్గాలను రాజకీయంగా ఆలోచనలో పడేస్తున్నాయి. గౌడ సామాజిక వర్గంకు చెందిన వారిద్దరిలో బిక్షం గౌడ్ ఉపాధ్యాయ సంఘంలో, మల్లేశం గౌడ్ రాజకీయరంగంలో స్వశక్తి తో అంచలంచెలుగా ఎదిగినప్పటికీ ప్రస్తుతం ఇద్దరు కూడా రాజకీయ క్రీడలో ఎదురీదుతున్నారు.
బిఆర్ఎస్‌కు అనుబంధంగా ఉన్న పిఆర్టియు ఉపాధ్యాయ సంఘంలో భిక్షం గౌడ్ 25 ఏళ్లుగా కొనసాగుతూ వరుసగా 14 ఏళ్ళు సంఘ ఎన్నికల్లో గెలుస్తూ జిల్లా పిఆర్టియు అధ్యక్షుడిగా పనిచేశారు. జిల్లాకు సంబంధం లేని రంగారెడ్డి- హైదరాబాద్- మహబూబ్ నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థి సంఘం అభ్యర్థి ఏవీయన్ రెడ్డి గెలుపు కోసం సహకరించాడన్న ఆరోపణలతో పిఆర్టియు రాష్ట్ర కమిటీ భిక్షం గౌడ్ ను తాజాగా సంఘం నుండి బహిష్కరించింది.
తన బహిష్కరణ ఎత్తివేతకు ఆయన అన్ని మార్గాల్లో పోరాడుతున్నప్పటికీ పిఆర్టియు రాష్ట్ర నాయకత్వం నుండి సానుకూల స్పందన లేకపోవడంతో పిఆర్టియుతో బిక్షం గౌడ్ కు ఉన్న సుదీర్ఘ అనుబంధానికి చెక్ పడే పరిస్థితి నెలకొంది. రానున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నానన్న ప్రచారం నేపథ్యంలో తన వ్యతిరేకులు కుట్ర చేసి సంఘం నుండి బహిష్కరించారని భిక్షం గౌడ్ తో పాటు ఆయన మద్దతు దారులు బలంగా నమ్ముతున్నారు.
ఇక సోదరుడైన సుంకరి మల్లేశం గౌడ్ పరిస్థితి కూడా వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న రీతిలో తాను సుదీర్ఘకాలం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ ను వదిలి బీఆర్ఎస్ లో చేరినప్పటికీ తగిన పదవులు దక్కడం లేదన్న ఆవేదనతో మధన పడుతున్నారు. న్యాయవాదియైన మల్లేశం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి నిర్వహించి ఎన్నికల్లో ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ రేసుల్లో నిలిచారు.
ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో బీసీ కోటాలో తనకు టికెట్ కావాలంటూ వరుసగా నాలుగు పర్యాయాల జనరల్ ఎన్నికల్లోను ఆ పార్టీ నాయకత్వంతో పోరాడినప్పటికీ వివిధ సమీకరణల నేపథ్యంలో మల్లేశం గౌడ్ కు టికెట్ దక్కలేదు. దీంతో కాంగ్రెస్ నుండి నిరాశగా బయటకు వచ్చి ఎన్నో ఆశలతో మల్లేశం గౌడ్ బిఆర్ఎస్ లో చేరారు.
గత సహకార సంఘం ఎన్నికల్లో బిఆర్ఎస్ తరుపున డిసిసిబి చైర్మన్ అభ్యర్థి అంటూ పార్టీలో ప్రచారం పొందిన మల్లేశం గౌడ్ సొంత మండలం చిట్యాల సింగిల్ విండో చైర్మన్ గా గెలుపొందడంతో పాటు ఆ ఎన్నికల్లో ఇతర చోట్ల బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకు వ్యయ ప్రయాసలు పడ్డారు.
అనూహ్యంగా డిసిసిబి చైర్మన్ పదవిని గొంగిడి మహేందర్ రెడ్డి ఎగరేసుకుపోవడంతో ఖంగుతిన్న మల్లేశం గౌడ్ మరో పదవి కోసం స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.
కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆ పార్టీలో విపరీతమైన అంతర్గత ప్రజాస్వామ్యం నేపథ్యంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులను, కేంద్ర పార్టీ ఇన్చార్జిలను, ఆ పార్టీల ముఖ్యమంత్రులను నేరుగా కలుసుకొని తన డిమాండ్లను వినిపించిన స్వేచ్ఛను అనుభవించిన మల్లేశం గౌడ్ బిఆర్ఎస్‌లో తన పదవి సాధన ఆకాంక్షలను చెప్పుకునే మార్గం లేక మధన పడుతున్నారు.
బిఆర్ఎస్ పార్టీలో కేంద్రీకృత రాజకీయ వ్యవస్థ నేపథ్యంలో తన గోడును పార్టీ అధ్యక్షులు అయిన సీఎం కేసీఆర్ దృష్టికి గాని, లేక వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ దృష్టికిగాని తీసుకెళ్లే అవకాశం లేక పోవడంతో మల్లేశం గౌడ్ తన రాజకీయ భవిష్యత్తు పురోగతిలో, పదవుల సాధన ప్రయత్నాలలో ముందడుగు వేయలేకపోతున్నారు.
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీ నుంచి వెళ్లిన తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ లో పేరొందిన గౌడ సామాజిక వర్గం నేతగా కేవలం సుంకరి మల్లేశం గౌడ్ పేరు మాత్రమే వినిపించింది.
అదే సమయంలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్ మళ్లీ బీఆర్ఎస్‌లో చేరారు. బిక్షమయ్యగౌడ్ కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్‌లోకి, అటు నుండి బిజెపిలోకి వెళ్లి తిరిగి బిఆర్ఎస్ లో చేరగా ఆయన పేరు తరచూ ఎమ్మెల్సీ పదవుల ఎంపికలో తెరపైకి వస్తుంది.
అయితే తనకు రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ పదవి దక్కిన చాలనుకుంటున్న మల్లేశం గౌడ్‌కు ఆ పదవులు కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాలో యాదవ సామాజిక వర్గానికి రాజ్యసభ సభ్యుడిగా బడుగుల లింగయ్య యాదవ్‌కు, సాగర్, కోదాడ అసెంబ్లీ స్థానాల్లో నోముల భగత్, బొల్లం మల్లయ్యలకు అవకాశాలు ఇచ్చారు.
మున్నూరు కాపు, పద్మశాలి వర్గాల నుండి నేతి విద్యాసాగర్, కర్నె ప్రభాకర్లకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు. గతంలో ఎంపీ ఎన్నికల్లో బూర నర్సయ్య గౌడ్ కు రెండు పర్యాయాలు అవకాశం ఇచ్చినప్పటికీ ఆయనకు సామాజిక వర్గం కోణంలో కాకుండా తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ జేఏసీ నేతగానే అవకాశం దక్కిందని చెప్పవచ్చు.
దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి గౌడ, ముదిరాజ్ సామాజిక వర్గాలు బిఆర్ఎస్ పార్టీ నుండి ముఖ్య పదవుల కొసం ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనకు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవినైనా ఇవ్వాలని మల్లేశం గౌడ్ ఆశిస్తున్నారు. అయితే ఆయన ఆకాంక్షలను అధిష్టానం దృష్టికి తీసుకవెళ్లే మార్గం లేకపోవడం ఆయనను నిరాశకు గురిచేస్తుంది.
ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్, కంచర్ల బ్రదర్స్ మాదిరిగా బీసీ సామాజిక వర్గం నుంచి ఎదిగే అవకాశాలు ఉన్న సుంకరి బ్రదర్స్ కు తాజాగా తమ తమ రంగాల్లో వరుసగా ఎదురు దెబ్బలు తగిలిన నేపథ్యాన్ని..పరిణామాలను బీసీ సామాజిక వర్గాలు ఆసక్తిగా గమనిస్తూ విశ్లేషణలు సాగిస్తుండటం కోస మెరుపు.