చ‌రిత్ర సృష్టించిన సుప్రీం..ఒకే రోజు 11 మందికి సీనియ‌ర్ అడ్వ‌కేట్ హోదా

సుప్రీంకోర్టు చ‌రిత్ర సృష్టించింది. ఒకే రోజు 11 మంది మ‌హిళా న్యాయ‌వాదుల‌కు సీనియ‌ర్ అడ్వ‌కేట్ హోదా క‌ల్పిస్తూ భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం నిర్ణ‌యం తీసుకుంది

చ‌రిత్ర సృష్టించిన సుప్రీం..ఒకే రోజు 11 మందికి సీనియ‌ర్ అడ్వ‌కేట్ హోదా

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు చ‌రిత్ర సృష్టించింది. ఒకే రోజు 11 మంది మ‌హిళా న్యాయ‌వాదుల‌కు సీనియ‌ర్ అడ్వ‌కేట్ హోదా క‌ల్పిస్తూ భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. గ‌త 75 ఏండ్ల కాలంలో కేవ‌లం 14 మంది మ‌హిళా న్యాయ‌వాదులు మాత్ర‌మే సీనియ‌ర్ అడ్వ‌కేట్ హోదాను పొందారు. ఇందులో ఇప్ప‌టికే ఇద్ద‌రు ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ ఆధ్వ‌ర్యంలో మొత్తం 56 మంది లాయ‌ర్లు శుక్ర‌వారం సీనియ‌ర్ అడ్వ‌కేట్ హోదా పొందారు. ఇందులో 11 మంది మ‌హిళ‌లు కాగా, 34 మంది ఫ‌స్ట్ జ‌న‌రేష‌న్ లాయ‌ర్లు ఉన్నారు.


సీనియ‌ర్ అడ్వ‌కేట్ హోదా పొందిన మ‌హిళా న్యాయ‌వాదుల్లో శోభా గుప్తా, స్వ‌రూప‌మ చ‌తుర్వేది, లిజ్ మాథ్యూ, క‌రుణ నుంది, ఉత్త‌ర బాబ‌ర్, హ‌రిప్రియ ప‌ద్మ‌నాభ‌న్, అర్చ‌న్ ప‌ఠాక్ దేవ్, శిరీన్ ఖ‌జురియా, ఎన్ఎస్ న‌ప్పిన‌యి, ఎస్ జ‌న‌ని, నిషా బాగ్చి ఉన్నారు. సుప్రీంకోర్ట్‌ తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్‌ బీవీ నాగరత్న 2027 సెప్టెంబర్‌ 25న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నది.


ఈ సంద‌ర్భంగా అడిష‌న‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్, సీనియ‌ర్ అడ్వ‌కేట్ ఐశ్వ‌ర్య భాటి మాట్లాడుతూ.. భారీ స్థాయిలో మ‌హిళా న్యాయ‌వాదుల‌కు సీనియ‌ర్ అడ్వ‌కేట్ హోదా క‌ల్పించ‌డం ఎంతో గొప్ప విష‌య‌మ‌న్నారు. సుప్రీంకోర్టు చ‌రిత్ర‌లోనే ఇది ఒక సంచ‌ల‌నం అని పేర్కొన్నారు. చారిత్ర‌త్మాక నిర్ణ‌యం తీసుకున్న సీజేఐ డీవై చంద్ర‌చూడ్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ చారిత్రాత్మ‌క నిర్ణ‌యం మ‌హిళా న్యాయ‌వాదుల ప‌ట్ల గౌర‌వాన్ని చూపుతుంద‌ని ఐశ్వ‌ర్య భాటి పేర్కొన్నారు.