CJI : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (CJI DY Chandrachud), సీనియర్ న్యాయవాది దినేష్ ద్వివేది (Dinesh Dwivedi) మధ్య ఇటీవల కోర్టు హాల్లో సరదా సంభాషణ జరిగింది. పారిశ్రామిక మద్యానికి సంబంధించిన కేసును సుప్రీంకోర్టు విచారిస్తున్న సందర్భంగా ఈ హాస్యభరిత సంభాషణ చోటుచేసుకుంది. ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పారిశ్రామిక మద్యానికి సంబంధించిన కేసును వాదిస్తున్న సీనియర్ న్యాయవాది దినేష్ ద్వివేది ధర్మాసనాన్ని ఉద్దేశిస్తూ.. ‘నా జుట్టు రంగురంగులుగా ఉన్నందుకు క్షమించండి. దీనికి కారణం హోలీ. ఇంట్లో చాలామంది పిల్లలు, మనుమలు, మనుమరాళ్లు ఉండటంవల్ల తలెత్తే సమస్య ఇది. అలాంటప్పుడు మనమేం చేయలేం’ అన్నారు.
దీనిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సరదాగా స్పందిస్తూ ‘హోలీకి మద్యంతో సంబంధం లేదా..?’ అని ప్రశ్నించారు. సీజేఐ ప్రశ్నకు అడ్వకేట్ ద్వివేదీ స్పందిస్తూ.. ‘హోలీ అంటే కొంత వరకు ఆల్కహాల్ అని కూడా అర్థం. నేను ఒక విషయం మీ ముందు ఒప్పుకోవాలి. నాకు విస్కీ అంటే చాలా ఇష్టం’ అని సమాధానమిచ్చారు.
ఈ వీడియోను రెండు రోజుల క్రితం పోస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1.5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దాదాపు 400 లైక్స్‌ను రాబట్టింది. ఈ వీడియో క్లిప్‌పై నెటిజన్లు కూడా సరదాగా స్పందించారు. విస్కీపై తనకున్న అభిమానం గురించి ద్వివేది మరింత వివరించారు. ‘నేను సింగిల్ మాల్ట్ విస్కీని ఇష్టపడతాను. ఈ మధ్య ఎడిన్ బర్గ్‌కు వెళ్లాను. నేను నా విస్కీ పెగ్‌లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేయాలనుకున్నాను. కానీ వెయిటర్ అందుకు అంగీకరించలేదు. సింగిల్ మాల్ట్ విస్కీని నీట్‌గానే (ఏం కలుపుకోకుండా) తాగాలని చెప్పాడు. దానికి ప్రత్యేక గ్లాస్ కూడా ఉంది. ఈ విషయం నాకు మొదటిసారి తెలిసింది’ అని ద్వివేదీ వివరంగా చెప్పారు.