సీఏఏ వ్యతిరేక పిటిషన్లపై 3 వారాల్లో స్పందించండి: సుప్రీంకోర్టు ఆదేశం
సీఏఏను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై మూడు వారాల్లో కేంద్ర ప్రభుత్వం తన స్పందనను తెలియజేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది
సీఏఏను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై మూడు వారాల్లో కేంద్ర ప్రభుత్వం తన స్పందనను తెలియజేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై స్పందించేందుకు గడువు కావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. సీఏఏ అనేది ఏ వ్యక్తి పౌరసత్వాన్ని గుంజుకునేది కాదని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపారు. ఈ పిటిషన్లపై స్పందించేందుకు తమకు కొంత సమయం కావాలని కోరారు. ఇందుకు జస్టిస్ చంద్రచూడ్ అనుమతిస్తూ.. కేంద్రానికి మూడు వారాల గడువు ఇచ్చారు. తదుపరి విచారణను మార్చి 9వ తేదీకి వాయిదా వేశారు.
సీఏఏకు వ్యతిరేకంగా 200కు పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వాటన్నింటినీ కలిపి కోర్టు విచారిస్తున్నది. పౌరసత్వ సవరణ చట్టం నిబంధనల అమలును నిలిపివేయాలని పిటిషనర్లు కోరారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు సీఏఏను తీసుకురావడంలో ఉద్దేశం ప్రశ్నించతగినదిగా ఉన్నదని గత వారం కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తరఫున పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు. మతం ప్రాతిపదికన ముస్లింల పట్ల ఈ చట్టం వివక్ష చూపుతున్నదని పిటిషనర్లు ఆరోపించారు. ఎలాంటి సహేతుక కారణం చూపకుండా మతపరమైన విభజన 14వ అధికరణంలోని సమానత్వ హక్కుకు ఉల్లంఘిస్తున్నదని పేర్కొన్నారు.
సీఏఏకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసినవారిలో తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా, కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, అసోం కాంగ్రెస్ నేత దేబబ్రత సైకియా, స్వచ్ఛంద సంస్థ రిహాయి మంచ్ అండ్ సిటిజన్స్ ఎగైనెస్ట్ హేట్, అసోం అడ్వకేట్స్ అసోసియేషన్, పలువురు న్యాయ విద్యార్థులు ఉన్నారు. వీరితోపాటు ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) తదితర సంఘాలు, పార్టీలు కూడా ఉన్నాయి. సీఏఏను తొలుత 2020లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram