బీజేపీకి షాకిచ్చిన బాండ్ల రద్దు తీర్పు
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ వ్యతిరేకమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనాత్మక తీర్పు.. బీజేపీకి గట్టి షాకేనంటున్నారు రాజకీయ పరిశీలకులు

- 2027-18లో కేంద్రం తెచ్చిన పథకం
- అప్పటి నుంచి 12,979 కోట్ల విరాళాలు
- అందులో బీజేపీకి 53శాతం పైనే
- బీఆరెస్‌కు భారీగానే అందిన బాండ్లు
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ వ్యతిరేకమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనాత్మక తీర్పు.. బీజేపీకి గట్టి షాకేనంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇది రాజకీయ పార్టీలకు, విరాళాలు ఇచ్చేవారికి మధ్య క్విడ్ ప్రో కో కు దారి తీస్తుందని కూడా కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. రాజకీయ పార్టీలకు రహస్య విరాళాలు అందించేందుకు అవకాశం కల్పిస్తూ 2017-18 కేంద్ర బడ్జెట్‌లో బీజేపీ సర్కారు ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని తీసుకొచ్చింది.
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాల మొత్తాన్ని తమ ఆడిట్ రిపోర్టుల్లో ఆయా రాజకీయ పార్టీలు ప్రకటిస్తే సరిపోతుంది. విరాళాలు ఇచ్చిన వ్యక్తులు లేదా సంస్థల పేర్లను వెల్లడించాల్సిన అవసరం లేదు. విరాళాల విషయంలో పారదర్శకత పేరుతో దీన్ని తీసుకొచ్చినా.. నిజానికి పారదర్శకత ఏమోగానీ.. తెరచాటు వ్యవహారంలా తయారైంది. ఈ పథకం మొదలైన దగ్గర నుంచి వచ్చిన విరాళాల్లో సింహభాగం అందింది భారతీయ జనతాపార్టీకే.
దేశవ్యాప్తంగా సుమారు ఏడు జాతీయ పార్టీలు, 24 ప్రాంతీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు స్వీకరించాయి. 2023 ఏప్రిల్ నాటికి ఆయా రాజకీయ పార్టీలు సమర్పించిన ఆడిట్ నివేదికలు గమనిస్తే.. 26 ట్రెంచెస్‌లో రూ.12,979 కోట్ల విలువైన విరాళాలు వచ్చినట్టు తెలుస్తున్నది. ఇందులో బీజేపీకి రూ.6,572 కోట్లు అంటే.. 50శాతానికిపైగా అందాయి. మిగిలిన అన్ని పార్టీలకంటే ఎక్కువ విరాళాలు బీజేపీకే లభించాయి.
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ రూ.1,123 కోట్లతో మిగిలింది. 2022 ఏప్రిల్ నాటికి పార్టీల వారీగా విరాళాల వివరాలను పరిశీలిస్తే.. మొత్తం రూ.9,856.72 కోట్లకు గాను ఒక్క బీజేపీకే రూ.5,271.97 కోట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు రూ.952.29 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ రూ.767.88 కోట్లు, బిజు జనతాదళ్ రూ.622 కోట్లు, బీఆరెస్ రూ.383.65 కోట్లు బాండ్ల రూపంలో విరాళాలుగా స్వీకరించాయి. 2023-24 వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.