Congress | మూడు సీట్లపై కాంగ్రెస్ త్రిశూల వ్యూహం

Congress | మూడు సీట్లపై కాంగ్రెస్ త్రిశూల వ్యూహం
  • ఆచితూచి అడుగులు..

  • రెండిటిలో గెలుపే లక్ష్యం.. ఒక దాంట్లో ప్రెండ్షిప్

  • క‌రీంన‌గ‌ర్, ఖ‌మ్మం, హైదరాబాద్ అభ్య‌ర్థుల ఎంపికపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌

  • చిర‌కాల మిత్రుడి కోసం ఖ‌మ్మం సీటుపై తుమ్మ‌ల ప‌ట్టు

  • కీలక చర్చల కోసం ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి

 

విధాత‌, హైద‌రాబాద్‌: లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థులను శరవేగంగా ఎంపిక చేసిన తెలంగాణ‌ కాంగ్రెస్ పార్టీ.. మూడు సీట్ల విషయంలో అభ్యర్థుల ఎంపికకు తీవ్రంగా శ్రమిస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు గానూ 14 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టింది.

ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ మూడు నియోజకవర్గాలలో కుల స‌మీక‌ర‌ణ‌లు అత్యంత కీలకమైనవని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది. అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు పీసీసీ చీఫ్‌, సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లడంతో అభ్యర్థుల ఎంపికపై మరోసారి ఊహాగానాలు జోరందుకున్నాయి.

ఖమ్మంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న భావన నాయకుల్లో ఏర్పడింది. దాంతో ఆ నియోజకవర్గానికి పోటీ ఎక్కువైంది. స్థానికంగా బలమైన నాయకులే కాకుండా స్థానికేతర నాయకులు కూడా ఆ సీటుపై కన్నేశారు. టికెటిస్తే చాలు గెలుస్తామన్న ధీమా ఆశావహుల్లో నెలకొంది. జిల్లాకు చెందిన బలమైన నాయకుల కుటుంబ సభ్యులు కూడా టికెట్ ఆశిస్తున్నారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్ర‌సాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు కుమారుడు యుగంధ‌ర్‌ టికెట్ ను ఆశించారు. అంతేకాకుండా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంత రావు, ఎన్టీవి చైర్మ‌న్ తుమ్మ‌ల న‌రేంద్ర చౌద‌రి కుమార్తె ర‌చ‌న‌, నంద‌మూరి హ‌రికృష్ణ కుమార్తె సుహాసిని వంటి నాయకులు కూడా పోటీకి ఆసక్తి కనబర్చారు.

అయితే, అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఆలస్యమవుతున్న క్రమంలో పలువురు ఆశావహులు వెనక్కి తగ్గినట్లు సమాచారం. తాజాగా తెరమీదికి కొత్త పేరు రావడం గమనార్హం. కమ్మ కులానికి చెందిన నిజామాబాద్‌ నాయకుడు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌ రావు అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా.. తన చిరకాల మిత్రుడైన వెంకటేశ్వర్‌ రావుకు టికెట్ ఇప్పించడానికి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వివాద‌ర‌హితుడు, అన్ని వ‌ర్గాల‌తో సంబంధాలున్న వెంక‌టేశ్వ‌ర్ రావు అయితే విజ‌యబావుటా ఎగుర‌వేస్తాడ‌నే ఆలోచ‌న‌లో కాంగ్రెస్ ముఖ్య నాయ‌కులు ఉన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు బలంగా ఉన్న కరీంనగర్ లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే పోటీ నెలకొని చివరికి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం సాధించారు. ఈ సారి కరీంనగర్ లో ఎలాగైనా పాగా వేయాలన్న ఉత్సాహంతో కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. అభ్యర్థిని ఎంపిక చేయడానికి అన్ని కొణాలను పరిగణన‌లోకి తీసుకొని అగ్రనాయకులు చర్చలు జరుపుతున్నారు.

కుల‌ సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా వెలిశాల రాజేందర్ రావు, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని తానై ప్రచారం చేస్తున్నారు.

ఈ క్రమంలో అభ్యర్థి ఎంపికలో ఆయన పాత్ర కూడా కీలకంగా మారింది. ఖ‌మ్మం సీటును క‌మ్మ కులం వారికి ఇస్తే, క‌రీంన‌గ‌ర్ అభ్య‌ర్థిగా వెల‌మ కులం నాయ‌కుడికి ఇవ్వ‌వ‌చ్చ‌నే వాద‌న ఉంది. క‌నీసం త‌మ కులానికి ఒక్క పార్ల‌మెంటు సీటు ఇవ్వ‌రా అని వెల‌మ కుల నాయ‌కులు అధిష్టానం పెద్ద‌ల‌పై ఒత్తిడి తెస్తున్నారు.

హైదరాబాద్ లోక్ సభ సీటుకు అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఎంఐఎం పార్టీతో స్నేహపూర్వక బంధాన్ని నెరపాలని తెలంగాణ కాంగ్రెస్ సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎంఐఎం పార్టీ నేతలు కూడా అదే వైఖరిని అవలంభిస్తూ క్ర‌మంగా బీఆరెస్ కు దూరం జ‌రుగుతున్నారు.

బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్న ఎంఐఎం… బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దించాలని కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అధినేత అసదుద్దిన్ ఓవైసీ విజ్ఞప్తి చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. హైదరాబాద్ లో ఎంఐఎంకి సహకరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇతర సీట్లలో ముస్లిం వ‌ర్గం ఓట్లను పొందవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక్క‌డ బిసి అభ్య‌ర్థిని బ‌రిలో దించితే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న‌లో కాంగ్రెస్ పార్టీ స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ది.