Telangana Debts: అప్పుల్లో.. తెలంగాణ చాలా బెటర్! ఎన్నో స్థానం అంటే?

దేశంలో 28రాష్ట్రాలు చేసిన అప్పుల జాబితాలో తెలంగాణ కింది నుంచి 5వ స్థానంలో అంటే 24వ స్థానంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 1.6 లక్షల కోట్ల రూపాయల పైచిలుకు అప్పులు చేసినా కూడా.. అతి తక్కువ అప్పులు చేసిన రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణకు చోటు దక్కడం గమనార్హం.

  • By: Somu |    latest |    Published on : Mar 25, 2025 12:20 PM IST
Telangana Debts: అప్పుల్లో.. తెలంగాణ చాలా బెటర్! ఎన్నో స్థానం అంటే?

Telangana Ddebts:  తెలంగాణ అప్పుల్లో మునిగింది.. వచ్చే ఆదాయంలో సింహభాగం అప్పులకే పరిమితమైంది.. అప్పులు చేయందే నెల గడవడం లేదంటూ నిత్యం రాష్ట్ర ప్రజలు వింటున్న మాటలు. తెలంగాణ అప్పులు ప్రస్తుతం రూ.8,06,298 కోట్లుగా ఉన్నట్లు ప్రతిపక్షాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై రూ. 2,30,346 తలసరి రుణభారం పడిందని విమర్శిస్తున్నాయి. అయితే దేశంలోని 28 రాష్ట్రాల వారిగా చూస్తే అప్పుల భారంలో తెలంగాణ స్థానం కాస్తా ఊరటనిచ్చేదిగా ఉండటం ఆసక్తికరం.

28రాష్ట్రాలు చేసిన అప్పుల జాబితాలో తెలంగాణ కింది నుంచి 5వ స్థానంలో అంటే 24వ స్థానంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 1.6 లక్షల కోట్ల రూపాయల పైచిలుకు అప్పులు చేసినా కూడా.. అతి తక్కువ అప్పులు చేసిన రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణకు చోటు దక్కడం గమనార్హం. ఈ ఏడాది మార్చి 31నాటికి తెలంగాణ అప్పు రూ.4,42,298కోట్లుగా ఉండగా..ఏపీ అప్పు రూ.5,62,557కోట్లుగా ఉంది. జీఎస్డీపీలో కేవలం 26.2% అప్పులతో దేశంలో 24వ స్థానంలో తెలంగాణ ఉంది. ఏపీ అప్పుల్లో స్థూల దేశీయోత్పత్తి(జీఎస్డీపీ)34.7శాతంగా ఉంది.

రాష్ట్రాల అప్పుల లెక్కలను కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు. దేశంలోనే అత్యధికంగా తమిళనాడు రూ.9,55,691కోట్లు, ఉత్తర ప్రదేశ్ రూ.8,57,844కోట్లు, మహారాష్ట్ర రూ.8,12,068కోట్లు, కర్ణాటక రూ. 7,25,456కోట్లు, పశ్చిమ బెంగాల్ రూ.7,14,196కోట్ల అప్పులు చేశాయి. ఏపీ అప్పుల్లో స్థూల దేశీయోత్పత్తి(జీఎస్డీపీ)34.7శాతంగా ఉంది. ఆర్బీఐ అంచనా మేరకు 2025మార్చి 31వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు రూ.2కోట్ల 67లక్షలు 35,462కోట్లుగా ఉంటుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

ఇటీవల తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ లో తీసుకునే అప్పులతో కలిపి ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో రాష్ట్ర అప్పు రూ.5,04,814 కోట్లుగా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఇది రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎ్‌సడీపీ)లో 28.1 శాతంగా ఉండనుంది. ఈ మొత్తం అప్పులో బహిరంగ మార్కెట్‌ రుణాలు రూ.4,07,059 కోట్లు, కేంద్ర ప్రభుత్వ రుణాలు రూ.23,719 కోట్లు, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థల రుణాలు రూ.11,202 కోట్లు, స్మాల్‌ సేవింగ్స్‌, ప్రావిడెంట్‌ ఫండ్‌కు సంబంధించి రూ.21,787 కోట్లు, డిపాజిట్లు, రిజర్వ్‌ ఫండ్‌ రూ.41,048 కోట్లుగా ఉన్నాయి.

ఇవి కాకుండా ఎఫ్‌ఆర్‌బీఎంకు ఆవల కూడా కార్పొరేషన్ల పేరిట అప్పులు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి కార్పొరేషన్ల అప్పులు మొత్తం రూ.3,01,484 కోట్లుగా ఉన్నాయని బడ్జెట్‌లో ప్రభుత్వం తెలిపింది. ఇందులో కార్పొరేషన్ల కోసం ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చి, ప్రభుత్వమే స్వయంగా చెల్లించే అప్పులు రూ.1,17,109 కోట్లు కాగా, ప్రభుత్వ గ్యారెంటీలతో కార్పొరేషన్లు తీసుకుని, కార్పొరేషన్లే చెల్లించే రుణాలు రూ.1,24,419 కోట్లు అని వివరించింది. ఇవే కాకుండా ప్రభుత్వ గ్యారెంటీలు లేకుండా కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు రూ.59,956 కోట్లు అని పేర్కొంది. ఇలా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో తీసుకున్న అప్పు రూ.5,04,814 కోట్లు, కార్పొరేషన్ల కోసం సేకరించిన అప్పు రూ.3,01,484 కోట్లు కలిపి మొత్తం అప్పు రూ.8,06,298 కోట్లుగా తేలింది.

అప్పులకు సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరంలో పాత అప్పుల అసలు, కొత్త అప్పుల వడ్డీల కింద ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.39,396.73 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో కేవలం వడ్డీల కింద రూ.19,369.02 కోట్లు, కిస్తీల కింద రూ.20,027,71 కోట్లను చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ కిస్తీల్లో వేస్‌ అండ్‌ మీన్స్‌ కాకుండా ప్రభుత్వ రుణాలకు సంబంధించి రూ15,848.20 కోట్లు, కేంద్ర ప్రభుత్వ రుణాలకు రూ.440.85 కోట్లు, ఇతర రుణాలకు సంబంధించి రూ.3,738.66 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.