తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా ఖమ్మం మాజీ ఎంపీ రేణుక చౌదరి, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు ఎం. అనిల్ కుమార్ యాదవ్‌లను ఎంపిక చేసింది

  • By: Somu    latest    Feb 14, 2024 11:30 AM IST
తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
  • రేణుకాచౌదరి, అనిల్‌కుమార్‌లకు అవకాశం
  • మూడో స్థానం బీఆరెస్‌కే

విధాత హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా ఖమ్మం మాజీ ఎంపీ రేణుక చౌదరి, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు ఎం. అనిల్ కుమార్ యాదవ్‌లను ఎంపిక చేసింది. రేణుకా చౌదరి పేరు మొదటి నుంచి వినిపిస్తున్నప్పటికి అనూహ్యంగా అనిల్‌కుమార్ యాదవ్ అభ్యర్థిగా ఎంపికి కావడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ నుంచి చాలమంది ఆశావహులున్నప్పటికి అనిల్‌కుమార్‌కు సామాజిక సమీకరణల్లో భాగంగా రాజ్యసభ అభ్యర్థిత్వం దక్కినట్లుగా భావిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో 119అసెంబ్లీ స్థానాలుండగా, వాటిని 4తో విభజిస్తారు. ఒక్కో అభ్యర్థికి సగటున 30మంది ఎమ్మెల్యేల ఓట్లు పడాల్సివుంటుంది. ప్రతి ఎమ్మెల్యే నలుగురు అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయవచ్చు. లేదంటే ఒక్క అభ్యర్థికే ఓటు వేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం అనుసరించి రెండు రాజ్యసభ స్థానాలు పక్కాగా వారు గెలుచుకోనున్నారు. మూడో స్థానం బీఆరెస్‌కే దక్కనుంది. బీఆరెస్ అభ్యర్థి ఎవరన్నది తేలాల్సివుంది.

తెలంగాణతో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్ రాజ్యసభ అభ్యర్థులను కూడా ప్రకటించారు. కర్ణాటక నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నాసీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్‌, రాజస్థాన్ నుంచి సోనియాగాంధీ, బీహార్ నుంచి డాక్టర్ అఖిలేశ్ ప్రసాద్ సింగ్‌, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సంఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ హందోరేలను ప్రకటించారు. తెలంగాణ నుంచి బీఆరెస్‌కు చెందిన వద్ధిరాజు రవిచంద్ర, జోగినిపల్లి సంతోశ్‌, బడుగుల లింగయ్య యాదవ్‌ల స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ మూడుసీట్లకు ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 8నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభంకాగా, 15వ తేదీతో నామినేషన్ల గడువు ముగియ్యనుంది.