ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు.. వారంతా ఇంటి బాటే..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు చేయాలని సీఎస్ శాంతి కుమారిని సీఎం రేవంత్ ఆదేశించారు

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు చేయాలని సీఎస్ శాంతి కుమారిని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ మేరకు సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద 12 మంది సలహాదారులు ఉన్న సంగతి తెలిసిందే. వీరంతా పదవీ విరమణ పొందిన తర్వాత ప్రభుత్వ సలహాదారులగా కొనసాగారు. ఈ సలహదారుల నియామకాలను రద్దు చేయాలని రేవంత్ నిర్ణయించారు.
సీఎం ముఖ్య సలహాదారుగా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా రాజీవ్ శర్మ, ఇరిగేషన్ అడ్వైజర్‌గా మాజీ సీఎస్ ఎస్కే జోషి, ప్రభుత్వ అడ్వైజర్‌గా కేవీ రమణాచారి కొనసాగారు. పీసీసీఎఫ్ హోదాలో పదవీ విరమణ పొందిన శోభను అదే రోజు సలహాదారుగా నియమించారు. మాజీ డీజీపీ అనురాగ్ శర్మ, రిటైర్డ్ ఐపీఎస్ ఏకే ఖాన్ కూడా సలహాదారులుగా కొనసాగారు. ఆర్థిక శాఖలో జీఆర్ రెడ్డి, శివశంకర్(స్పెషల్ ఆఫీసర్లు) కొనసాగారు. ఆర్ అండ్ బీకి సుధాకర్ తేజ, ఎనర్జీ సెక్టార్‌కు రాజేంద్ర ప్రసాద్ సింగ్, హార్టికల్చర్‌కు శ్రీనివాస్ రావు సలహాదారుగా కొనసాగారు. సలహాదారుల నియామకాలు రద్దు కావడంతో వీరంతా ఇంటి బాట పట్టనున్నారు.