త్వ‌ర‌లో కుల గ‌ణన షురూ : సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కుల గ‌ణ‌న చేప‌డ్తామ‌ని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించింది. ఆ ప్ర‌కారంగానే కుల గ‌ణ‌న‌కు ప్ర‌భుత్వం ఆమోదం

త్వ‌ర‌లో కుల గ‌ణన షురూ : సీఎం రేవంత్‌రెడ్డి

విధాత‌, హైద‌రాబాద్‌: రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కుల గ‌ణ‌న చేప‌డ్తామ‌ని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించింది. ఆ ప్ర‌కారంగానే కుల గ‌ణ‌న‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. శ‌నివారం నాడు బిఆర్ అంబేద్క‌ర్ తెలంగాణ స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న బిసి, గిరిజ‌న, మైనారిటీ సంక్షేమం పై ఉన్న‌త‌స్థాయి స‌మావేశం జ‌రిగింది.

త్వ‌ర‌లోనే రాష్ట్ర‌వ్యాప్తంగా కుల గ‌ణ‌న చేప‌డ్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ ప్ర‌కారం త‌మ ప్ర‌భుత్వం ఈ బృహ‌త్త‌ర నిర్ణ‌యం తీసుకుంద‌ని ఆయ‌న తెలిపారు. గ‌ణ‌న కోసం అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖ‌ల‌ను ఆదేశించారు. అయితే ఇంటింటికి తిరిగి వివ‌రాలు సేక‌రిస్తారా లేదా గ్రామ స‌భ‌ల్లో ద‌ర‌ఖాస్తులు తీసుకుంటారా అనేది స్ప‌ష్టం కావాల్సి ఉంది. క‌ర్నాట‌క‌, బిహార్‌, ఏపి రాష్ట్రాల‌లో ఏ విధానం అమ‌లు చేస్తున్నార‌నేది ప‌రిశీలించి తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌మ‌మైన నిర్ణ‌యం తీసుకోనున్న‌ది. రిజ‌ర్వేష‌న్ల అమ‌లుతో పాటు సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో కులానిది కీల‌క పాత్ర‌. రాష్ట్రంలో ఏ కులం శాతం ఎంత‌, వారి ఆర్థిక స్థితి ఏమిటీ అనేది వెల్ల‌డి అవుతే దాని ప్ర‌కారంగా సంక్షేమ ప‌థ‌కాలు రూప‌క‌ల్ప‌న చేసి అమ‌లు చేయ‌డానికి మ‌హ‌త్త‌ర అవ‌కాశం ప్ర‌భుత్వానికి ఉంటుంది. దీని ద్వారా వేల కోట్ల రూపాయ‌ల స‌ర్కార్ నిధులు స‌రైన మార్గంలో ఖ‌ర్చు చేయ‌డానికి మార్గం సుగ‌మం అవుతుంది.



 


భార‌త దేశంలో మొద‌టిసారి బ్రిటీష్ ప్ర‌భుత్వం 1931 సంవ‌త్స‌రంలో కులాల వారీగా వివ‌రాలు సేక‌రించింది. మొత్తం జ‌నాభాలో ఏ కులం వారు ఎంత మంది ఉన్నార‌నే వివ‌రాలు అప్పుడే వెల్ల‌డి అయ్యాయి. అయితే అప్పుడు బంగ్లాదేశ్‌, పాకిస్తాన్ లు భార‌త్ లో అంత‌ర్భాగం. ఆ తరువాత ఏ ప్ర‌భుత్వం కుల గ‌ణ‌న నిర్వ‌హించ‌లేదు. 1941 జ‌నాభా లెక్క‌ల నుంచి కుల గ‌ణ‌న‌ను తీసివేశారు. బ్రిటీష్ పాల‌కుల నుంచి దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చినా పాత లెక్క‌ల ఆధారంగా రిజ‌ర్వేష‌న్లు, సంక్షేమ ప‌థ‌కాల‌ను కేంద్ర‌, రాష్ట్రాలు అమ‌లు చేస్తున్నాయి. బిసిల లెక్క‌లు తేల్చ‌కుండా కేంద్ర‌, రాష్ట్రాలు పాల‌న సాగిస్తున్నాయని బిసి సంఘాల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు మండిప‌డుతున్నారు. కేంద్రంలో బిసిల‌కు ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల‌ని, కుల గ‌ణ‌న చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. బిసిల నుంచి వ‌చ్చిన డిమాండ్ ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే దేశ‌వ్యాప్తంగా కుల గ‌ణ‌న చేప‌ట్టి, వివ‌రాలు బ‌హిర్గ‌తం చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. కాగా ఈ అంశంపై కేంద్రంలోని బిజెపి ప్ర‌భుత్వం నోరు మెద‌ప‌డం లేదు. క‌రోనా పేరుతో జ‌నాభా లెక్క‌లు వాయిదా వేసింది. జ‌నాభా లెక్క‌లు ప్రారంభిస్తే, కుల గ‌ణ‌న చేయాల‌ని ఒత్తిడి పెరుగుతుంద‌నే భ‌యం బిజెపికి ప‌ట్టుకుంది. అయితే కొన్ని రాష్ట్రాలు ఈ విష‌యంలో నిర్ణ‌యాలు తీసుకుని అమ‌లుచేస్తున్నాయి. కాగా తెలంగాణ‌లో కె.చంద్ర‌శేఖ‌ర్ రావు స‌ర్కార్ స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే నిర్వ‌హించింది. ఆ వివ‌రాల‌ను పౌరుల‌కు తెలియ‌చేయ‌కుండా దాచి పెట్టింది.

దేశంలో ఇప్ప‌టికే క‌ర్నాట‌క‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం 2014 సంవ‌త్స‌రంలో తొలిసారి కుల గ‌ణ‌న‌కు శ్రీకారం చుట్టింది. ఈ స‌ర్వేకు విద్యా, సామాజిక స‌ర్వే అనే పేరు పెట్టిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ దీన్ని బ‌హిర్గ‌త ప‌ర్చ‌లేదు. బిహార్ రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ నాయ‌క‌త్వంలో కుల గ‌ణ‌న 2023 సంవ‌త్స‌రంలో పూర్తి చేసింది. పొరుగున ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడా ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కుల గ‌ణ‌న‌కు ఆదేశాలు జారీ చేశారు. జ‌న‌వ‌రి 19 నుంచి 28వ తేదీ లోపు ఈ ప్ర‌క్రియ పూర్తి చేసి వివ‌రాలు అంద‌చేయాల‌ని సంబంధిత శాఖ‌ల‌ను ఆదేశించింది. ఇంటింటికి తిరిగి వివ‌రాలు సేక‌రిస్తారు. అప్ప‌టికీ వివ‌రాలు న‌మోదు చేసుకోలేని వారికి మ‌రో అవ‌కాశం క‌ల్పించారు. గ్రామ స‌చివాల‌యాల్లో జ‌న‌వ‌రి 29 నుంచి ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ వ‌ర‌కు వివ‌రాలు అంద‌చేసుకునే వెసులుబాటు క‌ల్పించారు. తెలంగాణ‌లో కుల గ‌ణ‌న పూర్త‌యితే దేశంలో నాలుగ‌వ‌ రాష్ట్రంగా గుర్తింపు పొంద‌నున్న‌ది. రానున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కుల గణ‌న ప్రారంభిస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ అధినాయ‌కుడు రాహుల్ గాంధీ ప‌లు వేదిక‌ల మీద ప్ర‌క‌టించారు. దేశంలో షెడ్యూల్డు కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డు తెగ‌లు (ఎస్టీలు) సంఖ్య‌పై స్ప‌ష్ట‌త ఉంది. ఆ సంఖ్య ఆధారంగానే కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నాయి. జ‌నాభా దామాషా ప్ర‌కారం నిధుల‌ను కేటాయిస్తూ, వ్య‌యం చేస్తున్న‌ది.

అద్దె భ‌వ‌నాల్లో ఉన్న సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌ల‌కు సంబంధించి పూర్తి వివరాలను అంద‌చేయాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. గురుకుల పాఠ‌శాల‌ల‌కు స్వంత‌ భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన‌ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలని స్ప‌ష్టం చేశారు. ఒక్కో గురుకులం భ‌వ‌నం నిర్మాణానికి ఎంత వ్య‌యం అవుతుందో అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆయ‌న‌ ఆదేశించారు. ప్రభుత్వ హాస్టళ్లతో పాటు గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని అన్నారు. ఇక‌నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు జ‌ర‌గాల‌ని రేవంత్ రెడ్డి అన్నారు.


 


మహాత్మ జ్యోతిభాపూలే ఓవర్ సీస్ స్కాలర్ షిప్ ప‌థ‌కం కింద ఇప్పుడున్న దాని కంటే ఎక్కువ మంది అర్హులైన విద్యార్థులకు మేలు జరిగేలా చూడాలని రేవంత్ రెడ్డి అన్నారు. విదేశాల్లో ఉన్న టాప్ యూనివర్సిటీలను గుర్తించి అందుకు అనుగుణంగా మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించాల‌న్నారు. ప్ర‌ముఖ యూనివ‌ర్సిటీల్లో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ఈ ప‌థ‌కంలో ఉప‌యోగ‌ప‌డాల‌ని ఆయ‌న‌ సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ వేర్వేరు చోట్ల విడివిడిగా కాకుండా ఒకే చోట ఉండే విధంగా ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్ర‌తి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటేడ్ హబ్ నిర్మించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత శాఖ‌ల అధికారుల‌ను కోరారు. ఈ విధానం వ‌ల్ల విద్యా సంస్థ‌ల‌ నిర్వహణ, పర్యవేక్షణ, అజమాయిషీ మెరుగు ప‌డుతుంద‌ని అన్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎడ్యుకేషన్ హబ్ ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన ఖాళీ స్థలాలను గుర్తించాలని అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో స్థ‌లం ల‌భ్య‌త లేన‌ట్ల‌యితే ప్రత్యామ్నాయంగా అదే నియోజ‌క‌వ‌ర్గంలో మరో పట్టణం లేదా మండల కేంద్రాలను ఎంపిక చేయాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం 20 ఎకరాలకుపైగా విస్తీర్ణంలో ఉన్న విద్యా సంస్థ ప్రాంగణాల్లో మిగతా భవనాలు నిర్మించి హబ్ గా అభివృద్ధి చేయాల‌ని రేవంత్ రెడ్డి తెలిపారు.

అయితే ఎడ్యుకేషన్ హబ్ ల నిర్మాణానికి అవ‌స‌ర‌మైన నిధులు స‌మ‌కూర్చుకునేందుకు కార్పొరేట్ సంస్థల, కంపెనీల సహకారం తీసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. దాతల నుంచి విరాళాలు స్వీకరించి ఈ భవన నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. సంక్షేమ హాస్టళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, నోట్ బుక్స్, యూనిఫామ్స్, పుస్తకాలకు కూడా కార్పొరేట్ కంపెనీల సీఎస్ఆర్ ద్వారా నిధులు సమీకరించాలని సూచించారు.

ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ ప్ర‌కారం కళ్యాణ మస్తు, షాదీ ముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు ఒక తులం బంగారం అందించేందుకు ఎంత మేర నిధులు అవ‌స‌రం అవుతాయ‌నేది ప్ర‌తిపాద‌న‌లు రూపొందించాలని అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్రంలో న‌డుస్తున్న‌ బీసీ స్టడీ సర్కిళ్లను ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్ గా ఏర్పాటు చేసే అంశంపై అధ్యయనం చేసి నివేదిక అంద‌చేయాల‌ని రేవంత్ రెడ్డి అధికారుల‌ను కోరారు.