Telangana Inter Board: మారని తెలంగాణ ఇంటర్ బోర్డు పని తీరు!
సుదీర్ఘ కసరత్తు జరిపి రూపొందించే ప్రశ్నాపత్రాలలో తప్పులు చేయడం ఇంటర్ బోర్డుకు ఏటా రివాజుగా మారింది. వరుసగా ప్రథమ, ద్వీతీయ సంవత్సరం పరీక్ష ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లడం విమర్శలకు తావిస్తుంది.

Telangana Inter Board: ప్రభుత్వాలు మారిన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పనితీరు మారడం లేదన్న విమర్శలు మరోసారి వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభమయ్యాయి. 25 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. మొదటి, రెండో సంవత్సరం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు.
అయితే సుదీర్ఘ కసరత్తు జరిపి రూపొందించే ప్రశ్నాపత్రాలలో తప్పులు చేయడం ఇంటర్ బోర్డుకు ఏటా రివాజుగా మారింది. వరుసగా ప్రథమ, ద్వీతీయ సంవత్సరం పరీక్ష ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లడం విమర్శలకు తావిస్తుంది. మార్చి 10న జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఆంగ్ల పరీక్షలో 7వ ప్రశ్నకు మార్కులు కలుపుతామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ 4 మార్కుల ప్రశ్న ముద్రణ లోపం వల్ల సరిగా కనిపించకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు.
పైచార్టులో ఇచ్చిన శాతాలు స్పష్టంగా ఉన్నా.. వాటిని వివరిస్తూ పక్కన చిన్నబాక్సుల్లో ఇచ్చిన చుక్కలు, గీతలు సరిగా కనిపించలేదు. అనేక పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ఈ విషయాన్ని ఇన్విజిలేటర్లకు ఫిర్యాదు చేశారు. దీనిపై సబ్జెక్టు నిపుణులతో చర్చించిన అనంతరం.. ఆ ప్రశ్నకు సమాధానం రాసేందుకు ప్రయత్నించిన (అటెంప్ట్ చేసిన వారికి 4 మార్కులు ఇవ్వాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య మార్చి 10న రాత్రి ఒక ప్రకటన జారీ చేశారు. మార్చి 10న ఆంగ్ల పరీక్షకు 4,33,963 మంది హాజరుకాగా.. 13,029 మంది గైర్హాజరయ్యారు.
ప్రథమంలోనూ తప్పులే
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం మ్యాథ్స్, బోటని, పాలిటికల్ సైన్స్ పేవర్స్ లలో తప్పులు గుర్తించారు. పదాలను మార్చి చదివేలా పరీక్ష చీఫ్ సూపరింటెండెంట్లకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు ఇన్విజిలేటర్ల సహాయంతో మార్పు చేసి పదాలను అధికారులు వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా 1,532 పరీక్షా కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది.