బడలిక తీర్చుకునేందుకు యోగాసనాలు వేసిన టెస్లా రోబో..

విధాత: సాంకేతిక రంగంలో తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకుపోతున్న ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని టెస్లా (Tesla) కంపెనీ మరో సంచలనానిని తెర తీసింది. తాము అభివృద్ధి చేస్తున్న హ్యూమనాయిడ్ రోబో ఆప్టిమస్ తొలి వీడియోను ఎక్స్ (X) లో పంచుకుంది. రంగు రంగుల వస్తువులను ఏ రంగుకి ఆ రంగు విడదీసి అందంగా సర్దడంతో పాటు ఆప్టిమస్ యోగా కూడా చేస్తున్నట్లు వీడియోలో ఉంది.
అచ్చం మనిషిలాగే హావభావాలు, శరీర కదలికలు ఉండేలా ఆప్టిమస్‌ను రూపొందించినట్లు వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. తన పనికి అవరోధాలు కలిగిస్తున్నా.. అయోమయానికి గురికాకుండా పర్‌ఫెక్ట్‌గా తన పనిలో ఆప్టిమస్ లీనమైపోయింది. పరిశోధనల్లో, పరిశ్రమల్లో హ్యూమనాయిడ్ రోబోలకు పలు అవాంతరాలు ఎదురవుతాయి. వాటిని తట్టుకుని, అధిగమించి ఏ రకంగా పని చేయాలన్న విషయాన్ని పరిశీలించడానికి టెస్లా పరిశోధకులు ఆప్టిమస్‌కు ఈ పరీక్ష పెట్టారు.
కష్టపడి పని చేసిన అనంతరం.. శరీరాన్ని తేలికపరచడానికి ఈ రోబో యోగా కూడా చేయడం విశేషం, ఒక కాలిపై నిలబడి శరీరాన్ని విల్లులా ఒంచి ఒక భంగిమ, నమస్తే ముద్ర, మరికొన్ని భంగిమలను వేసి తన అలసట తీర్చుకుంది. ఆప్టిమస్ స్వతంత్రంగా వివిధ రకాల వస్తువులను వేరు చేయగలదు.
దీని న్యూరాల్ నెట్వర్క్ ఆ మేరకు పూర్తిగా ట్రైన్ చేయబడింది అని టెస్లా ఆప్టిమస్ ఎక్స్‌లో ట్వీట్ చేసింది. టెస్లా ఆటోపైలట్ కార్లలో వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్, సెన్సర్లు, ఏఐనే ఆప్టిమస్‌లోనూ ఉపయోగిస్తున్నారు. ఈ పోస్టుకు ప్రోగ్రస్ అనే చిన్న పదంతో టెస్లా అధిపతి ఎలాన్‌మస్క్ ప్రతిస్పందించారు.
సురక్షితంకాని, పదేపదే చేయాల్సిన, నైపుణ్యాలు అవసరం లేని పనులను చేయడానికి ఆప్టిమస్‌ను రూపొందిస్తున్నట్లు టెస్లా వెబ్‌సైట్లో వివరించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి సాఫ్ట్‌వేర్ స్టాక్స్‌ను రూపొందించాలి. రోబో పట్టుకోల్పోకుండా ఉండటం, నావిగేషన్, భౌతిక ప్రపంచంతో సమన్వయం సాధించడం అత్యవసరం అని తెలిపింది.