Thalapathy Vijay | రాజకీయాల్లోకి తళపతి విజయ్‌?

రాజకీయ అరంగేట్రం రాబోయే లోక్‌సభ ఎన్నికలతోనా? అసెంబ్లీ ఎన్నికలతోనా? ఓట్లకు నోట్లు స్పీచ్‌తో మళ్లీ రాజకీయ చర్చ రిటైర్డ్‌ అధికారులతో మాట్లాడి ఉపన్యాసం! తాజా సినిమాలో ‘నాన్‌ రెడీ తా’ డైలాగ్‌ ఫ్యాన్స్‌కు సంకేతాలిచ్చేలా పొలిటికల్‌ పంచ్‌లు? చెన్నై: తళపతి విజయన్ (Thalapathy Vijay) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళనాడులో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో. దాదాపు మూడు దశాబ్దాలుగా తమిళ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న కథానాయకుడు. ఆయన తాజా […]

Thalapathy Vijay | రాజకీయాల్లోకి తళపతి విజయ్‌?
  • రాజకీయ అరంగేట్రం రాబోయే లోక్‌సభ ఎన్నికలతోనా? అసెంబ్లీ ఎన్నికలతోనా?
  • ఓట్లకు నోట్లు స్పీచ్‌తో మళ్లీ రాజకీయ చర్చ
  • రిటైర్డ్‌ అధికారులతో మాట్లాడి ఉపన్యాసం!
  • తాజా సినిమాలో ‘నాన్‌ రెడీ తా’ డైలాగ్‌
  • ఫ్యాన్స్‌కు సంకేతాలిచ్చేలా పొలిటికల్‌ పంచ్‌లు?

చెన్నై: తళపతి విజయన్ (Thalapathy Vijay) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళనాడులో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో. దాదాపు మూడు దశాబ్దాలుగా తమిళ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న కథానాయకుడు. ఆయన తాజా సినిమా ‘వారిసు’ బాక్సాఫీసు వద్ద సూపర్‌ హిట్‌ అయింది. ప్రముఖ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రాబోతున్న తదుపరి సినిమా ‘లియో’. ఈ సినిమాలో పొలిటికల్‌ పంచ్‌లు భారీగా ఉన్నాయని తెలుస్తోంది.

తన అభిమానులకు సందేశం ఇచ్చేలా ఇవి ఉండబోతున్నాయని అంటున్నారు. ఈ సినిమా మొదటి ట్రైలర్‌ ‘నాన్‌ రెడీ తా’ (నేను సిద్ధం) అన్న డైలాగ్‌తో మొదలవుతుంది. దాని అర్థం రాజకీయాల్లోకి వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఫ్యాన్స్‌కు సంకేతం ఇవ్వడమేనని అంటున్నారు. 2009లో విజయ్‌ ఫ్యాన్‌ క్లబ్‌ను పుడుకొట్టాయ్‌లో అతడి తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ ప్రారంభించిన సందర్భంగా విజయ్‌ రాజకీయాల్లోకి రావడంపై చర్చ మొదలైంది. 2011లో ఈ ఫ్యాన్‌ క్లబ్‌ జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకేకు మద్దతు పలికింది.

అయితే.. సన్‌టీవీ నిర్మించిన ‘సూర’ సినిమా బ్లాక్‌బస్టర్‌ మూవీగా నిలిచిన తర్వాత విజయ్‌, ఆయన తండ్రి చంద్రశేఖర్‌ డీఎంకే వైపు మొగ్గు చూపారు. విజయ్‌ ఫ్యాన్‌ క్లబ్‌కు తమిళనాడులోని మొత్తం 38 జిల్లాల్లోనూ శాఖలు ఉన్నాయి. 2020లో విజయ్‌ పేరుతో ఆయన తండ్రి రాజకీయ పార్టీని రిజిస్టర్‌ చేశారు.

అయితే.. విజయ్‌ మాత్రం దానితో తనకేమీ సంబంధం లేదని, తన అభిమానులెవరూ దానితో సంబంధాలు కలిగి ఉండొద్దని కోరారు. రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు విజయ్‌ గట్టి ప్రణాళికలు ఏమీ అప్పటికి వేసుకోలేదు. కానీ.. 2021లో తళపతి విజయ్‌ మక్కల్‌ ఇయక్కమ్‌ (టీవీఎంఐ) అప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో 169 స్థానాల్లో పోటీచేసి.. 115 సీట్లలో గెలుపొందింది.

leo
leo

విశేషం ఏమిటంటే గెలిచిన 115 సీట్లలో 102 ఏకగ్రీవాలే! విజయ్‌ తన రాజకీయ ప్రణాళికలపై మౌనం వహిస్తున్న సమయంలో టీవీఎంఐ సాధించిన విజయాలు సంచలనం రేపాయి. చెంగల్పట్టు, రాణిపేట, తిరుపత్తూర్‌, టెంకాసి, తిరునెల్వేలి సీట్లను గెలుచుకోవడంతోపాటు.. కల్లకురిచి, కాంచీపురం, విల్లుపరం వంటి జిల్లాల్లో కూడా సత్తా చాటడంతో ఫ్యాన్‌ క్లబ్‌ తన శాఖలను వాటిలో విస్తరించేందుకు మంచి అవకాశం దొరికింది.

మరోవైపు టీవీఎంఐ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఎన్‌ ఆనంద్‌ క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. ఇటీవలే టీవీఎంఐ ఆలిండియా తళపతి విజయ్‌ మక్కల్‌ ఇయక్కమ్‌గా మారింది. విజయ్‌ రాకకు ముందే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గ్రౌండ్‌ వర్క్‌ చేస్తున్నది. కొంతకాలంగా రిటైర్డ్‌ ప్రభుత్వాధి కారులు, సివిల్‌ సర్వెంట్‌లు, రాజకీయ వ్యూహకర్తలతో విజయ్‌ సంప్రదింపులు జరుపుతున్నాడని సమాచారం. వ్యూహకర్తల సహకారంతో రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో పొలిటికల్‌ సర్వేలు కూడా చేయించారని తెలుస్తున్నది.

నిజానికి జూన్‌ 9న ఒక సమావేశంలో మాట్లాడిన విజయ్‌.. పెరియార్‌ గురించి, డబ్బుకు ఓట్లు అమ్ముడు పోవడం గురించి, అవినీతి గురించి మాట్లాడారు. దానికి ముందు ఆయన తన ఉపన్యాసం తయారు చేసుకునేందుకు కొందరు రిటైర్డ్‌ బ్యూరోక్రాట్‌లను కలిశారని తెలుస్తున్నది. తమిళనాడులో రాజకీయం, సినిమా కవల పిల్లల్లాంటివి. విజయ్‌ రాబోయే 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాకుండా.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేస్తారని టాక్‌ నడుస్తున్నది.