రేవంత్‌ రెడ్డి రెడ్‌ డైరీతో పలువురు అధికారుల్లో గుబులు!

మార్పు కోరిన తెలంగాణ ప్రజల తీర్పుతో బీఆరెస్‌ ప్రభుత్వం గద్దె దిగిపోయి, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది

  • By: Somu    latest    Dec 12, 2023 11:55 AM IST
రేవంత్‌ రెడ్డి రెడ్‌ డైరీతో పలువురు అధికారుల్లో గుబులు!
  • బీఆరెస్‌ ప్రభుత్వంతో అంటకాగిన పలువురు అధికారులు
  • ఏళ్ల తరబడి ఒకే శాఖలో తిష్ఠ.. రిటైరైనా.. పదవుల్లోనే
  • అప్పట్లో ప్రతిపక్ష పార్టీల నేతలపై దురుసు వ్యవహారాలు
  • ప్రభుత్వం మారడంతో ఐఏఎస్‌, ఐపీఎస్‌లలో కలవరపాటు
  • పలువురు కీలక గెజిటెడ్‌ అధికారుల్లోనూ గుబులు


విధాత : మార్పు కోరిన తెలంగాణ ప్రజల తీర్పుతో బీఆరెస్‌ ప్రభుత్వం గద్దె దిగిపోయి, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ పరిణామంతో.. ఏళ్ల తరబడి పలు శాఖల్లో తిష్ఠ వేసి, బీఆరెస్‌కు అనుకూలంగా పనిచేసిన అధికార గణంలో కలవరం మొదలైంది. గత ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో పావులుగా ఉండటమే కాకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష కాంగ్రెస్‌ నాయకులు రేవంత్‌రెడ్డిపైనా పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌, గెజిటెడ్‌ అధికారులు దురుసుగా వ్యవహరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.


ఇప్పుడు అదే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా రావడంతో సహజంగానే అటువంటివారికి గుబులు రేగుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న అధికారుల పేర్లు తన రెడ్‌ డైరీలో రాసుకుంటున్నానని, అధికారంలోకి వచ్చాక వారి లెక్క సరిచేస్తానని రేవంత్‌రెడ్డి ఘాటుగానే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంతో అంటకాగిన అధికారులకు రెడ్‌ డైరీ గుబులు పట్టుకున్నదనే చర్చ సచివాలయంలో నడుస్తున్నది.


ఇప్పటికే కొంతమంది అధికారులు తమను రిలీవ్‌ చేయాలని దరఖాస్తులు చేసుకోగా, మరికొందరు బదిలీ చేయించుకుని వెళ్లిపోయే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌లు లూప్‌లైన్ల టెన్షన్‌లో పడిపోయారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అధికారాలు చేపట్టాక గత బీఆరెస్‌ ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వానికి సానుకూలంగా పనిచేసిన అధికారులకు స్థాన చలనం కల్పించే ప్రక్రియను ప్రభుత్వం ముమ్మరం చేస్తున్నది. ఈ క్రమంలోనే మంగళవారం పలువురు ఐపీఎస్‌లు బదిలీ అయ్యారని చెప్పుకొంటున్నారు.


అప్పుడున్నోళ్లకు టెన్షన్‌


రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలలో పనిచేస్తూ పలు ఆందోళనలు నిర్వహించారు. ఆ సమయంలో కేసీఆర్‌ ఆదేశాలతో ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి అరెస్టయ్యారు. తర్వాతి కాలంలో పీసీసీ నేతగా గిరిజన దండోర, రైతులు వరి వేయద్దన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఫామ్‌హౌజ్‌ ముట్టడి యత్నం, వరి వద్దన్న కేసీఆర్‌ తన ఫాంహౌస్‌లో వరి పండిస్తున్న దృశ్యాలను డ్రోన్‌ కెమెరాల ద్వారీ చిత్రీకరించే ప్రయత్నాల వివాదం, జీహెచ్‌ఎంసీ సమస్యలపై ఆందోళనలు, ధరణి, బీఆరెస్‌ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపైన, భూముల అమ్మకాలపైన, టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వంటి సమస్యలపై పోరాడిన సందర్భంలో ఆయనను గృహ నిర్బంధానికి, అరెస్టులకు గురి చేశారు.


ఆయా సందర్భాలలో ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులు ప్రభుత్వ ఆదేశాలతోనే రేవంత్‌ రెడ్డి పట్ల కఠినంగా వ్యవహరించారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ సందర్భాల్లో రేవంత్‌రెడ్డి ఎవరైతే బీఆరెస్‌కు తొత్తులుగా పనిచేస్తున్నారో వారిని మేం అధికారంలోకి వచ్చాక, రిటైర్‌ అయ్యి ఇంట్లో కూర్చున్నా.. లాక్కొచ్చి వారి అక్రమాలపై చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరికలే చేశారు. అలాగే పలు ఎన్నికల సందర్భంగా, ప్రజాందోళనల సందర్భంగా పలు జిల్లాల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలను ఇబ్బందిపెట్టినప్పుడు కూడా రేవంత్‌ రెడ్డి అధికారుల తీరుపై మండిపడిన సందర్భాలున్నాయి.


సర్దుకుంటున్న అధికారులు


బీఆరెస్‌ ప్రభుత్వం పోయి కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌రావు, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు రాజీనామా చేశారు. అలాగే గత ప్రభుత్వ సలహాదారులు కొందరు రాజీనామాలు చేయగా, ప్రభుత్వం మొత్తం సలహాదారులను, కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఒక్కో శాఖపై సమీక్ష చేస్తున్నారు.


పరిపాలన పరంగా తీసుకోవాల్సిన మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో డీజీపీ ఎంపికకు కసరత్తు చేస్తూనే మంగళవారం రాచకొండ, హైదరాబాద్‌ సీపీలను డీజీ ఆఫీస్‌కు అటాచ్‌ చేసింది. వారి స్థానంలో రాచకొండ సీపీగా సుధీర్‌బాబును, హైదరాబాద్‌ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని నియమిస్తూ ఆదేశాలిచ్చారు.


సైబారాబాద్‌ సీపీగా అవినాష్‌ మొహంతి, యాంటి నార్కోటింగ్‌ వింగ్‌ డైరక్టర్‌గా సందీప్‌ శాండిల్యాలను నియమించింది. ఏండ్ల తరబడిగా ఒకే శాఖలో పనిచేస్తూ బీఆరెస్‌కు కొమ్ము కాసిన శాఖాధిపతులపై రేవంత్‌ ప్రభుత్వం దృష్టి సారించిందని చెబుతున్నారు. వైద్యశాఖలో డీఏ, డీఎంఏలు రమేశ్‌రెడ్డి, గడల శ్రీనివాస్‌, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ డీ చంద్రశేఖర్‌రెడ్డి, వైద్య విధాన పరిషత్‌లో అజయకుమార్‌ వంటి వారు బదిలీ బాటలో ఉన్నారు. కాళేశ్వరం సహా ఇరిగేషన్‌ శాఖలో పనిచేసిన ఉన్నతాధికారులను సైతం విచారణలను, శాఖాపరమైన చర్యలను ఎదుర్కోవాల్సివస్తుందన్న ఆందోళన వెంటాడుతున్నదని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.


ఐఏఎస్‌లకూ స్థానచలనం!


ఐఏఎస్‌ల బదిలీలకు కూడా సీఎం రేవంత్‌ రెడ్డి కసరత్తు సాగిస్తున్నారని తెలుస్తున్నది. కేసీఆర్‌ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సీఎంవో అధికారిణి స్మితా సబర్వాల్‌ ప్రస్తుతం ఇరిగేషన్‌ శాఖ చీఫ్‌ సెక్రటరీగా ఉండికూడా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్షకు డుమ్మా కొట్టారు. ఆమె బదిలీ ఖాయమని పలువురు అధికారులు చెబుతున్నారు.


టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేశారు. అయితే రాజీనామాకు ఇంకా ఆమోదం లభించలేదు. ఇప్పటికే బీఆరెస్‌ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన వారు, లూప్‌లైన్లలో ఉన్న ఐఏఎస్‌, ఐపీఎస్‌లు రేవంత్‌ ప్రభుత్వంలో ముఖ్య శాఖల్లో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర సర్వీస్‌లో ఉన్న ఆమ్రపాలి వంటి వారు రేవంత్‌ ప్రభుత్వంలో పనిచేసేందుకు ముందుకొస్తున్నారని సమాచారం.