అక్కడ కేసీఆర్.. ఇక్కడ ‘కంచర్ల’ మళ్లీ గెలిస్తేనే అభివృద్ధి: మంత్రి జగదీష్ రెడ్డి
విధాత: నల్గొండలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి యజ్ఞం కొనసాగాలంటే అక్కడ సీఎం కేసీఆర్ ప్రభుత్వం, ఇక్కడ ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్ రెడ్డిలు మళ్ళీ గెలవాలని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం తిప్పర్తి మండలం బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నియోజక వర్గంలో భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాన్ని పార్టీ శ్రేణులు తిప్పి కొట్టాలన్నారు. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి కోపం ఎక్కువ ఉందంటూ బదనామ్ చేస్తున్నారని, ఆయన ఎవరిని కొట్టిండు.. కాంగ్రెసోడిని కొట్టిండా […]

విధాత: నల్గొండలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి యజ్ఞం కొనసాగాలంటే అక్కడ సీఎం కేసీఆర్ ప్రభుత్వం, ఇక్కడ ఎమ్మెల్యేగా కంచర్ల భూపాల్ రెడ్డిలు మళ్ళీ గెలవాలని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం తిప్పర్తి మండలం బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నియోజక వర్గంలో భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాన్ని పార్టీ శ్రేణులు తిప్పి కొట్టాలన్నారు.
ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి కోపం ఎక్కువ ఉందంటూ బదనామ్ చేస్తున్నారని, ఆయన ఎవరిని కొట్టిండు.. కాంగ్రెసోడిని కొట్టిండా అంటూ నిలదీశారు. అభివృద్ధి విషయంలో వంద స్పీడ్ తో భూపాల్ రెడ్డి వెళుతున్నాడని, భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా చెప్పడానికి ఏం మాటల్లేక కోపమెక్కువ అంటూ ఆయనపై ప్రచారాన్ని చేస్తున్నారని, దానిని పార్టీ శ్రేణులు తిప్పి కొట్టాలన్నారు.
నల్గొండలో అభివృద్ధి భూపాల్ రెడ్డి గెలిచాకే మొదలైంది అన్నారు. భూపాల్ రెడ్డి కేసీఆర్ ను కలిసిన ప్పుడల్లా మీ దత్తత మాటలను నమ్మి నన్ను భారీ మెజార్టీతో గెలిపించారని చెబుతూ నేను ఏ ఊర్లో పోయినా చెప్పుకునేలా నాకు ఎక్కువ నిధులు ఇవ్వాలని కేసీఆర్ ను అడిగి కేసీఆర్ నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకుని అభివృద్ధి చేస్తున్నాడన్నారు.
నల్గొండలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారని, హైదరాబాదులో మాత్రమే ఉండే ఐటీ హబ్ భూపాల్ రెడ్డి వల్లనే నల్గొండకు వచ్చిందన్నారు. ఇవాళ 60 ఏళ్లలో జరగని అభివృద్ధి భూపాల్ రెడ్డితో మూడేళ్లలో జరిగిందన్నారు. ఇటువంటి అభివృద్ధి కొనసాగాలంటే అక్కడ మళ్లీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం రావాలని, ఇక్కడ భూపాల్ రెడ్డి మళ్ళీ గెలవాలని అందుకు బిఆర్ఎస్ కార్యకర్తలంతా కంకణ బద్ధులై పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
మంత్రి మాటలతో నియోజకవర్గంలో భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ, పార్టీ టికెట్ ఆశిస్తున్న వారందరికీ క్లారిటీ వచ్చినట్లు అయిందని భూపాల్ వర్గీయులు చెప్పుకుంటున్నారు. భూపాల్ రెడ్డికి అనుకూలంగా మంత్రి మాట్లాడిన మాటలు భూపాల్ రెడ్డి వ్యతిరేకులకు చెంపపెట్టు లాంటివి అంటున్నారు.