త్రీడీ ప్రింట‌ర్‌తో క్యారెట్ల ఉత్పత్తి.. ఆక‌లి బాధ‌లు దూర‌మ‌య్యేనా?

త్రీడీ ప్రింట‌ర్‌తో క్యారెట్ల ఉత్పత్తి.. ఆక‌లి బాధ‌లు దూర‌మ‌య్యేనా?

విధాత‌: చాలా దేశాలు ఇప్ప‌టికీ ఆక‌లికి తాళ‌లేని అభాగ్యుల‌కు నెల‌వుగా ఉన్నాయి. ఒక వేళ ఆహారం అందుబాటులో ఉన్నా పూర్తిస్థాయి పోష‌కాహారం మాత్రం చాలా మందికి అంద‌ని ద్రాక్ష‌గానే ఉంది. ఈ స‌మ‌స్య‌కు చెక్ పెడ‌తామంటూ ఇద్ద‌రు యువ శాస్త్రవేత్త‌లు ముందుకొచ్చారు. కూర‌గాయ‌ల‌ను త్రీడీ ప్రింట‌ర్‌తో త‌యారుచేస్తామ‌ని, పైగా త‌మ విధానంలో అధిక స్థాయి ఉత్ప‌త్తి (మాస్ ప్రొడ‌క్ష‌న్‌) కూడా సాధ్య‌మేన‌ని చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాకుండా ఇప్ప‌టికే క్యారెట్‌ల‌ను ఉత్ప‌త్తి చేసే త్రీడీ ప్రిట‌ర్‌ (3D Printer) ను సైతం రూపొందించారు.



ఖ‌తార్‌కు చెందిన మొహ్మ‌ద్ అన్న‌న్ (20), లుజైన్ అల్ మ‌న్సూరీ (21)లు ఈ ఘ‌న‌తను సాధించారు. కృత్రిమ ప‌ద్ధ‌తుల్లో పెంచిన కూర‌గాయ‌ల క‌ణాలు, అల్ట్రా వ‌యోలెట్ కిర‌ణాల‌ను ఉప‌యోగించి తాము ఈ క్యారెట్ త్రీడీ ప్రింట‌ర్‌ను రూపొందించామ‌ని వారు తెలిపారు. ఇది త్రీడీ ప్రింటింగ్ టెక్నాల‌జీలోనే వ్య‌వ‌సాయ రంగానికి సంబంధించి ఒక మైలురాయి అని అభిప్రాయ‌ప‌డ్డారు.



దోహాలోని కార్నిగే మెలాన్ విశ్వ‌విద్యాల‌యంలో ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్స్ విద్యార్థులుగా ఉన్న వీరిద్ద‌రూ.. ఈ ప‌రిశోధ‌న‌కుగానూ బిజినెస్ ఇంక్యుబేష‌న్‌, యాక్స‌ల‌రేష‌న్ హ్యాక‌థాన్‌లో ఫుడ్ టెక్ కేట‌గిరీలో మొద‌టి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కూర‌గాయ‌ల‌ను పెద్ద మొత్తంలో ఉత్ప‌త్తి చేసే త్రీడీ ప్రింట‌ర్‌ను త‌యారుచేయాల‌ని వారు కొన్నేళ్ల నుంచీ ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనికి కావాల‌సిన వివిధ విడి భాగాల‌ను ప్ర‌పంచంలోని ప‌లు దేశాల నుంచి సేక‌రించారు.



గ‌తంలోనూ కూర‌గాయ‌ల‌ను ఉత్ప‌త్తి చేసే త్రీడీ ప్రింట‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ వాటిని సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా పండించిన ప‌ళ్లు, కూర‌గాయ‌ల‌ను ఉప‌యోగించే ప్రింట్ చేసేవారు. ఇది మాస్ ప్రొడ‌క్ష‌న్‌కు అంత అనుకూలంగా ఉండ‌దు. కాబట్టి ఆక‌లితో బాధ‌ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు ఈ విధానం ఉప‌యోగ‌ప‌డ‌దు. అందుక‌నే అన్న‌న్‌, మ‌న్సూరీలు కృత్రిమ కూర‌గాయ‌ల క‌ణాల‌ను త‌మ ప్ర‌యోగంలో వినియోగించారు. అంతే కాకుండా ఇంకింగ్ ప్ర‌క్రియ‌లో అల్ట్రావ‌యోలెట్ కిర‌ణాల‌ను ఉప‌యోగించే విధానాన్నీ మెరుగుప‌రిచారు.



దీంతో వీరి త్రీడీ ప్రింట‌ర్ మాస్ ప్రొడ‌క్ష‌న్‌కు అనుకూలంగా మారింది. ఖ‌తార్ విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ మొత్తం భూ విస్తీర్ణంలో 2.5 శాతం మాత్ర‌మే వ్య‌వ‌సాయానికి అనుకూలం. అందుకే ఇక్క‌డి ప్ర‌జ‌లు ఎక్కువ‌గా దిగుమ‌తుల‌పై ఆధార‌ప‌డ‌తారు. దిగుమ‌తులు కావ‌డంతో ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉండి పేద‌ల‌కు అందుబాటులో ఉండ‌వు. త్రీడీ టెక్నాల‌జీనే త‌మ దేశాన్ని కాపాడుతుంద‌ని.. ఈ దేశం ప్ర‌యోగాల‌కు ఎక్కువ నిధుల‌ను కేటాయిస్తోంది.