Jangaon | ముత్తిరెడ్డికి ముప్పేట ముప్పు.. జనగామలో అప్రతిహతంగా ఆకర్ష్ పల్లా

Jangaon | అవకాశం చిక్కితే అకర్ష్ పల్లా అమలు ప్రజాప్రతినిధులకు విసురుతున్న వల బీఆర్ఎస్ లో సాఫీగా సాగుతున్న కొనుగోళ్లు మహిళలతో స్పెషల్ రక్షాబంధన్ విందు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అప్రకటిత అభ్యర్థి స్థానంగా జనగామ పెండింగ్ లో ఉంది. ఇక్కడ ‘ఆపరేషన్ ముత్తిరెడ్డి.. ఆకర్ష్ పల్లా’ స్పెషల్ ప్రోగ్రాం అప్రతిహతంగా సాగిపోతోంది. సిటింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి చెక్ పెట్టే కార్యక్రమం సాఫీగా సాగిపోతోంది. ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. ముత్తిరెడ్డి […]

  • Publish Date - September 1, 2023 / 12:34 AM IST

Jangaon |

  • అవకాశం చిక్కితే అకర్ష్ పల్లా అమలు
  • ప్రజాప్రతినిధులకు విసురుతున్న వల
  • బీఆర్ఎస్ లో సాఫీగా సాగుతున్న కొనుగోళ్లు
  • మహిళలతో స్పెషల్ రక్షాబంధన్ విందు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అప్రకటిత అభ్యర్థి స్థానంగా జనగామ పెండింగ్ లో ఉంది. ఇక్కడ ‘ఆపరేషన్ ముత్తిరెడ్డి.. ఆకర్ష్ పల్లా’ స్పెషల్ ప్రోగ్రాం అప్రతిహతంగా సాగిపోతోంది. సిటింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి చెక్ పెట్టే కార్యక్రమం సాఫీగా సాగిపోతోంది. ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. ముత్తిరెడ్డి బలాన్ని తగ్గంచే పనినీ కొనసాగిస్తున్నారు. ఆఖరికి రక్షాబంధన్ పర్వదినాన్ని సైతం తమ లక్ష్యానికి అనుకూలంగా మార్చుకునే కార్యక్రమానికి తెరతీశారంటే, పాపం ముత్తిరెడ్డికి ముప్పేట ముప్పు పొంచి ఉన్నది. జనగామ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తొలి లక్ష్యంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధర్వంలో ఆకర్షణీయమైన ఆకర్ష్ కార్యక్రమం కొనసాగుతోంది.

ముత్తిరెడ్డికి మూడో పర్యాయం అవకాశం ఇవ్వకూడదనే అధిష్టానం నిర్ణయం నేపథ్యమే జనగామలో తాజా రాజకీయ పరిణామాలకు కారణంగా చెప్పవచ్చు. కొత్త అభ్యర్థిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఛాన్సు ఇవ్వాలని అధిష్టానం భావించడం వల్ల ఈ సమస్యలు నెలకొంటున్నాయి. ‘కోడెల కొట్లాటలో ఎన్ని లేగదూడల కాళ్ళు విరుగుతాయో? అన్ని రకాల రంగు, హంగులున్న ముగ్గురు ‘రెడ్లు’ సాగిస్తున్న కుమ్ములాటలో ఎంతమంది కింది వర్గాల ప్రజాప్రతినిధులు బలిపశువులవుతారో? వారి రాజకీయ భవిష్యత్ నాశనమవుతోందోననే చర్చ మరో వైపు నియోజకవర్గంలో సాగుతోంది.

నిరాటంకంగా ఆకర్ష్ పల్లా

జనగామ సెగ్మెంటులో ముత్తిరెడ్డి పై నెలకొన్న ప్రజావ్యతిరేకత, ఆయన పై వచ్చిన ఆరోపణలు, సర్వే ఫలితాలు కారణమేదైనా ముత్తిరెడ్డిని తొలగించాలని భావిస్తున్నట్లుంది. ముందుగా ఈ స్థానాన్ని ఆశపడిన ఎమ్మెల్సీ పోచంపల్లిని కాదని, పల్లాకు అవకాశం కల్పించాలనే అధినేత ఆకాంక్ష ఫలితంగా సమస్యలు నెలకొన్నాయి. కారణమేదైనా తొలి లిస్టులో ముత్తిరెడ్డికి మూడవ సారి పోటీ చేసే అవకాశం కేసీఆర్ ప్రస్తుతానికి కల్పించలేదు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటనకు ముందే ముత్తిరెడ్డికి సంబంధం లేకుండా పల్లా జనగామ నియోజకవర్గంలో ప్రత్యక్ష జోక్యం చేసుకున్నారు.

తన పరపతి, ప్రతిష్ట పెంచుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి ద్వారా ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులను పల్లా వైపు సమీకరించే పని ప్రారంభించారు. రకరకాల ప్రలోభాలు, ఆకర్షణలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు బహిరంగంగా విమర్శిస్తున్నారు. సొంత పార్టీ నాయకులను కొనుగోలు చేస్తున్నారు. చేర్యాల, నర్మెట ప్రాంత ప్రజాప్రతినిధులను తమ శిబిరంలోకి మార్చుకునే పనిని ముందుగా ప్రారంభించారు.

ఎదురుతిరిగిన ముత్తిరెడ్డి

పల్లా చర్యలతో ముత్తిరెడ్డి అప్రమత్తమై బలప్రదర్శనకు దిగారు. దీంతో పల్లా ప్లాన్, అధిష్టానం ఆలోచన బెడిసికొట్టిందని చెప్పవచ్చు. పల్లా డైరెక్టు ఎంట్రీతో గులాబీ రాజకీయం రచ్చరచ్చగా మారింది. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులను బుట్టలో వేసుకుని సాఫ్ట్ గా తప్పిద్దామనుకున్న సమయంలో ముత్తిరెడ్డి బలంగా ఎదురుతిరగడంతో ‘తక్షణ పరిస్థితిని’ గమనించిన అధినేత ప్రస్తుతానికి సీటు పెండింగులోనైతే పెట్టారు. పల్లా చేపట్టిన ఆకర్ష్ కార్యక్రమం మాత్రం ఆపలేదని తేలిపోతోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎమ్మెల్సీ పోచంపల్లి సైతం తన మార్కు చక్రం తిప్పే పనిలో ఉన్నారు. పల్లా తన సహచర ఎమ్మెల్సీ పోచంపల్లిని కూడా టార్గెట్ చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు.

మహిళలతో స్పెషల్ రక్షాబంధన్

రక్షాబంధన్ స్పెషల్ గా మహిళా ప్రజాప్రతినిధులను తన గ్రూపులోకి చేర్చుకునే పనిని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జనగామలో ముత్తిరెడ్డికి బలంగా నిలుస్తున్న ప్రజాప్రతినిధులను తమవైపు తిప్పుకుని పట్టు బిగించే పనిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నట్లు పరిణామాలు స్ఫష్టం చేస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు ప్రత్యేక సమావేశాలు, ధావత్ లు, అభివృద్ధి పనుల హామీలతో పురుషులకే పరిమితమైన ఆకర్ష్ పల్లా కార్యక్రమం మహిళా ప్రజాప్రతినిధులను తన వైపు తిప్పుకునే వరకు చేరింది.

ఈ మేరకు జనగామ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు పల్లా ఇంటికి క్యూ కట్టారు. పల్లాకు మహిళా ప్రతినిధులు పోటీలు పడి రాఖీలు కట్టారు. పనిలో పనిగా అన్న దగ్గరకు వచ్చిన చెల్లెళ్లకు స్పెషల్ భోజనం తన చేతుల మీదుగా వడ్డించి వారి ప్రేమాభిమానాలు చూరగొనే ప్రయత్నం చేశారు. కొసరి కొసరి వడ్డించి తమ గుంపులో చేరాలని సెలవిచ్చారు.

అంటే ఈ ఆకర్ష్ పథకం నియోజకవర్గంలో ఏ అడ్డంకులు లేకుండా కొనసాగుతోంది. మరో వైపు జనగామ ప్రధాన సెంటర్లలో పల్లా ఫ్లెక్సీలు వెలిశాయి. అంటే ముత్తిరెడ్డితో అమీతుమీ తేల్చుకునేందుకు పల్లా సిద్ధమయ్యారని అర్థం కాకుంటే. జనగామలో పల్లా తన పట్టును పెంచుకోవడం, ముత్తిరెడ్డి పలుకుబడి తగ్గించి, ఆయన అనుచరులను తన వైపు తిప్పుకునే కార్యక్రమం చేపట్టడం ప్రస్తుత కర్తవ్యంగా సాగుతోంది.

పల్లా అనుకూల పరిస్థితి లక్ష్యం

ముత్తిరెడ్డి బలం తగ్గి పల్లా బలం పెరిగిన ‘అనుకూల’ పరిస్థితి ఏర్పడగానే అప్రకటిత స్థానం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎంత సేపు ముత్తిరెడ్డి రియాక్షన్ ఎలా? ఉంటుందనే లెక్కల పై ఆధారపడి నిర్ణయం ఉంటుందని చెప్పవచ్చు. ముత్తిరెడ్డి తిరుగుబాటు చేస్తే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ముత్తిరెడ్డి అధిష్టానం మాటవింటే పరిస్థితి మరోలా ఉంటుంది.

బలం, బలగం, కులం, ఉద్యమం, ఆర్థికం తదితర అన్నివిధాలుగా బలమైన నేతగా ఉన్న ముత్తిరెడ్డి అంత సులభంగా వెనక్కి తగ్గే అవకాశం లేక పోవడంతో ఆయన పునాదులకు గోతులు తీస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదంతా బహిరంగంగా సాగుతున్నా ‘క్రమశిక్షణ’గల పార్టీ పట్టించుకోవడంలేదంటూ అధిష్టానం ఆశీస్సులతో ఇదంతా జరుగుతోందని భావిస్తున్నారు.

Latest News