Kerala | ఖాకీ వేసుకున్న వారిని కరిచేలా కుక్కలకు శిక్షణ ఇచ్చిన డ్రగ్ డీలర్.. పోలీసులకు చుక్కలు చూపించిన శునకాలు

విధాత: ఓ డ్రగ్ డీలర్ ఇంటికి సోదాలకు వెళ్లిన పోలీసులకు కుక్కలు చుక్కలు చూపించాయి. పదునైన పళ్లతో బలమైన శరీరంతో ఉన్న శునకాలు వారిపై కాలు దువ్వి పరుగులు పెట్టించాయి. కేరళ (Kerala) లోని కొట్టాయం పోలీసుల (Police) కు ఈ పరిస్థితి ఎదురైంది.
పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆదివారం రాత్రి పోలీసులు ఆ డ్రగ్ డీలర్ ఇంటికి వెళ్లి తలుపు కొట్టారు. ఒక్కసారిగా మీదకు ఉరికిన అక్కడి కుక్కలు.. సిబ్బంది వెంట పడ్డాయి. పోలీసులు వాటి నుంచి తప్పించుకునే సమయంలో సదరు డ్రగ్ డీలర్ వారి కళ్లు కప్పి తప్పించేసుకున్నాడు.
చివరికి ఆ కుక్కలను శాంతింపజేసి పోలీసులు ఆ ఇంట్లో సోదాలు నిర్వహించారు. 17 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ‘ఇన్ని కుక్కలు అతడి ఇంటి వద్ద ఉన్నట్లు మాకు సమాచారం లేదు. అవి చాలా క్రూరంగా ప్రవర్తించాయి.
దీంతో మొదట మాకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అదృష్టవశాత్తు మా సిబ్బందిలో ఎవరికీ గాయాలు కాలేదు’ అని కొట్టాయం ఎస్పీ కే.కార్తిక్ వెల్లడించారు. అంతే కాకుండా ఆ కుక్కల (Trained Dogs) కు ఖాకీ దుస్తులు వేసుకున్న ఎవరిపైనా మీద పడి కరిచేసేలా డ్రగ్ వ్యాపారి శిక్షణ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు.
బీఎస్ఎఫ్ జవానుగా రిటైర్డ్ అయిన ఒక వ్యక్తి నుంచి కుక్కలకు శిక్షణ ఇవ్వడంలో మెలకువలను దుండగుడు నేర్చుకున్నాడని వెల్లడించారు. అయితే ఖాకీ దుస్తులు వేసుకున్న వారిని కరిచేలా ఎలా శిక్షణ ఇవ్వాలి అని ప్రశ్నించడంతో ఆ బీఎస్ఎఫ్ జవాను ఇతడిని వెళ్లగొట్టాడని ఎస్పీ వివరించారు.
‘స్థానికంగా నిందితుడు అద్దె ఇంట్లో ఉంటూ కుక్కల హాస్టల్, శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. రోజుకు రూ.1000 వసూలు చేసి స్థానికులు ఊరు వెళ్లినపుడు తన దగ్గర పెట్టుకుంటాడు. వారు వెళ్లిపోగానే మీద పడి కరిచేలా శిక్షణ ఇస్తాడు’ అని కార్తిక్ తెలిపారు. ప్రస్తుతం 13 కుక్కలను స్వాధీనం చేసుకున్నామని.. వాటి యజమానులను గుర్తించి అందిస్తామని పేర్కొన్నారు.