TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కొత్త కోణం

TSPSC | ఎలక్ట్రానిక్‌ పరికరాల సహాయంతో పరీక్ష రాసిన ఏడుగురు నిందితులకు సహకరించిన విద్యుత్‌ శాఖ డీఈ, ఓ ఎగ్జామినర్‌  ఈ మొత్తం వ్యవహారంలో TSSPDCL జూ. అసిస్టెంట్‌ సురేశ్‌ను దళారీగా మార్చిన ప్రధాన నిందితులు ప్రవీణ్‌ విధాత: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీలో విచారణలో కొత్త అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. పరీక్ష హాలులోకి నిబంధనలకు విరుద్ధంగా ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకెళ్లిన ఏడుగురు నిందితులకు విద్యుత్‌ శాఖ డీఈ రమేశ్‌ జవాబులు చెప్పినట్టు అధికారులు […]

  • By: krs    latest    May 30, 2023 5:58 AM IST
TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కొత్త కోణం

TSPSC |

  • ఎలక్ట్రానిక్‌ పరికరాల సహాయంతో పరీక్ష రాసిన ఏడుగురు
  • నిందితులకు సహకరించిన విద్యుత్‌ శాఖ డీఈ, ఓ ఎగ్జామినర్‌
  • ఈ మొత్తం వ్యవహారంలో TSSPDCL జూ. అసిస్టెంట్‌ సురేశ్‌ను దళారీగా మార్చిన ప్రధాన నిందితులు ప్రవీణ్‌

విధాత: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీలో విచారణలో కొత్త అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. పరీక్ష హాలులోకి నిబంధనలకు విరుద్ధంగా ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకెళ్లిన ఏడుగురు నిందితులకు విద్యుత్‌ శాఖ డీఈ రమేశ్‌ జవాబులు చెప్పినట్టు అధికారులు గుర్తించారు.

దీనికి ఎగ్జామినర్‌ కూడా సహకరించాడు. ఆయనను విచారిస్తే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉన్నదని సిట్‌ భావిస్తున్నది. రాత పరీక్షలు పూర్తైన మూడు ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో సిట్‌ నివేదిక వచ్చిన తర్వాతే ముందుకు వెళ్లాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నది.

విద్యుత్‌ శాఖ డీఈ రమేశ్‌ కనుసన్నల్లో ప్రశ్నపత్రాలు చేతులు మారినట్టు సిట్‌ నిర్ధారించింది. ఏఈఈ, డీఏవో పరీక్షలకు హాజరయ్యేందుకు కొందరు అభ్యర్థులు రమేశ్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఎలక్ట్రానిక్‌ పరికరాల సహాయంతో పరీక్ష కేంద్రాల్లో ఏడుగులు అభ్యర్థులకు సమాధానాలు చేరవేసినట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. దీనికి ఓ ఎగ్జామినర్‌ కూడా సహకరించినట్టు దర్యాప్తులో తేలింది.

ఇప్పటిదాకా కేవలం ప్రశ్నపత్రాలు విక్రయించిన సొమ్ము చేసుకున్న ఈ కేసులో మొదటిసారి నిందితులు ఎలక్ట్రానిక్‌ పరికరాలు వినియోగించడం సంచలనంగా మారింది. విద్యుత్‌ శాఖ డీఈ రమేశ్‌తో ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ ద్వారా పరీక్ష రాసిన ప్రశాంత్‌, నరేశ్‌, మహేశ్‌, శ్రీనివాస్‌లను సిట్‌ అధికారులు అరెస్టు చేశారు.

ఈ ముఠా నుంచి మంది ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసిన మరో 20 అభ్యర్థులను అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ సురేశ్‌తో పేపర్‌ లీకేజీ ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌తో పరిచయం ఉన్నది. ప్రవీణ్‌ ప్రశ్నపత్రాలు తన చేతికి వచ్చాక సురేశ్‌ను దళారీగా మార్చాడు.

సురేశ్‌ ఏఈఈ, డీఏవో ప్రశ్నపత్రాలను 25 మందికి విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. సురేశ్‌ ద్వారా రమేశ్‌ కొన్ని ప్రశ్నపత్రాలు తీసుకుని అమ్మినట్టు సమాచారం. ఏఈఈ, డీఏవో ప్రశ్నపత్రాలు కావాలంటూ మరికొంత మంది నుంచి ఒత్తిడి రావడంతో ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

దీంతో సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సమాధానాలు చేరవేసేలా ఏడుగురు అభ్యర్థులతో ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకోసం ఒక్కొక్కరి దగ్గర రూ. 20 నుంచి 30 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారికి ముందుగా మైక్రో ఫోన్‌ వంటి ఎలక్రటానిక్‌ డివైజ్‌ ఇచ్చాడు. అభ్యర్థులు వాటిని బెల్టులో పెట్టుకుని పరీక్ష హాలులోకి చేరారు.

అక్కడి ఎగ్జామినర్‌ సహాయంతో ప్రశ్నపత్రాల ఫొటోలు తీసుకున్నారు. వాటిని పరీక్ష ప్రారంభమయ్యే పది నిమిషాల ముందు రమేశ్‌ వాట్సప్‌ నంబర్‌కు చేరవేశారు. చాట్‌జీపీటీ ద్వారా రమేశ్‌ వాటికి అనువైన జవాబులు సేకరించిన వాట్పప్‌ ఫోన్‌ కాల్‌ ద్వారా పరీక్ష హాలులోని ఏడుగురు అభ్యర్థులకు చెప్పాడు.

పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా పరీక్ష హాల్‌లోకి తీసుకెళ్లేందుకు సహకరించిన ఎగ్జామినర్‌ను గుర్తించే పనిలో పోలీసులు యత్నిస్తున్నారు. ఈ కేసులో అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు.

రాత పరీక్షలు పూర్తైన మూడు ఉద్యోగాల నోటిఫికేషన్ల తదుపరి ప్రక్రియలు.. ప్రశ్నపత్రాల లీకేజీ దర్యాప్తు తుది నివేదిక వచ్చే వరకు నిలిచిపోనున్నాయి. సిట్‌ దర్యాప్తు కొనసాగుతున్నందున ఫలితాలు వెల్లడించి తుది ఫలితాలు వెల్లడించడం న్యాయ సూత్రాలకు విరుద్దమని సర్వీస్‌ కమిషన్‌ భావిస్తున్నది. దీనివల్ల సాంకేతిక, న్యాయపరంగా ఇబ్బందులు వస్తాయని అంచనా వేస్తున్నది. అందుకే దర్యాప్తు పూర్తి నివేదిక వెల్లడయ్యే వరకు వేచి చూడాలనుకుంటున్నది.