TSPSC: పేపర్ లీకేజీ, నిరుద్యోగ సమస్యపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం: రేవంత్ రెడ్డి
ఈ నెల21 నుంచి జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు మే 4,5 తేదీలలో రాష్ట్రానికి ప్రియాంక అమరుడు శ్రీకాంత్ చారీ విగ్రహానికి నివాళులు అర్పించనున్న ప్రియాంక హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ 21న నల్గొండ, 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్‌లో నిరుద్యోగ నిరసన కార్యక్రమాలు మే 9 నుంచి రెండో విడత హాథ్ సే హాథ్ జోడో యాత్ర మీడియాకు వెల్లడించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్, విధాత: కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ సమస్య, టీఎస్‌పీఎస్ పేపర్ […]

- ఈ నెల21 నుంచి జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు
- మే 4,5 తేదీలలో రాష్ట్రానికి ప్రియాంక
- అమరుడు శ్రీకాంత్ చారీ విగ్రహానికి నివాళులు అర్పించనున్న ప్రియాంక
- హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ
- 21న నల్గొండ, 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్‌లో నిరుద్యోగ నిరసన కార్యక్రమాలు
- మే 9 నుంచి రెండో విడత హాథ్ సే హాథ్ జోడో యాత్ర
- మీడియాకు వెల్లడించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్, విధాత: కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ సమస్య, టీఎస్‌పీఎస్ పేపర్ లీకేజీ అంశాలపై పెద్ద ఎత్తున పోరాటం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాని నిర్ణయించినట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యపై వచ్చే నెల 4,5తేదీలలో సరూర్‌నగర్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
నిరుద్యోగులకు సంఘీభావం తెలుపడానికి తమ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ముఖ్య అతిధిగా హాజరవుతారన్నారు. నిరుద్యోగ సమస్య, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై టీపీసీసీ చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 21న నల్గొండలోని మాహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన చేపడతామన్నారు. అలాగే ఈ నెల 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్‌లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
మే 4,5 తేదీలలో హైదరాబాద్‌కు ప్రియాంక
నిరుద్యోగులకు అండగా నిలబడటానికి తమ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వచ్చే నెల 4,5 తేదీలలో హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో జరిగే నిరుద్యోగుల సభకు ముఖ్య అతిధిగా హాజరవుతారని రేవంత్ తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం ఆత్మార్పనం చేసుకున్న ఎల్‌బీనగర్‌లోని శ్రీకాంత్ చారీ విగ్రహనికి ప్రియాంక నివాళులు అర్పిస్తారన్నారు. అక్కడి నుచి సభాప్రాంగణానికి ఊరేగింపుగా వెళతామని తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరవుతున్న ప్రియాంక గాంధీ తమ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత యువతకు ఏమి చేయబోతున్నామో వివరిస్తారన్నారు.
ప్రియాంక కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వస్తారని రేవంత్ తెలిపారు. ఈ సభలో పాల్గొని తిరిగి ఆమె కర్ణాటక వెళతారన్నారు. ప్రియాంక పర్యటనపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. తాము ఈ విషయాన్ని సోమవారం నాడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రాహుల్ గాంధీకి వివరించామన్నారు. తాము చేసే ఈ పోరాటం కాంగ్రెస్ కోసం కాదని కేవలం నిరుద్యోగుల కోసమేనని రేవంత్ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల కోసం జరిగే ఈ పోరాటంలో 3౦ లక్షల మంది విద్యార్థులు పాల్గొనాలన్నారు. మీ భవిష్యత్ కోసం జరిగే ఈ పోరాటంలో మీరంతా ఒక సామాజిక బాధ్యతగా పొల్గొనాలని రేవంత్ విద్యార్థులు, నిరుద్యోగులను కోరారు. అలాగే నిరుద్యోగ, విద్యార్థి సంఘాలన్నీ ఈ నిరసన దీక్షలో భాగస్వాములు కావాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.
మేము ఎప్పుడు ప్రజల కోసం ఉదృతంగా పోరాటం చేసిన వెంటనే
బీజేపీ ఒక చిల్లర పంచాయతీ పెడ్తాది..!!
దాన్ని కేసీఆర్ పెద్ద పంచాయతీగా చేస్తాడు.— టీపీసీసీ అధ్యక్షుడు , రేవంత్ రెడ్డి#RevanthReddy @revanth_anumula @INCTelangana pic.twitter.com/RM6Y1crnBq
— Congress for Telangana (@Congress4TS) April 18, 2023
యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలం
తెలంగాణ ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలు నినాదం స్ఫూర్తి అని, దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది యువకులు ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చిందని రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే ఈ ఉద్యమాల ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో యువత సమిధలుగా మారారన్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.
పార్లమెంట్ సాక్షిగా నిరుద్యోగులను మోసం చేసిన మోడీ
ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చారని, ఆ లెక్కన ఇప్పటికీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కానీ కేవలం 7,22,311 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని రేవంత్ అన్నారు. ఉద్యోగాల కోసం 22 కోట్ల 6 లక్షల దరఖాస్తులు వస్తే కేవలం 7,22,311 ఉద్యోగాలు ఇచ్చామని పార్లమెంట్‌లో తన ప్రశ్నకు సమాధానంగా చెప్పారన్నారు. ఈ సమాధానంతో పార్లమెంటు సాక్షిగా నిరుద్యోగులను మోసం చేసినట్లు ప్రధాని అంగీకరించారని ఆయన అన్నారు. తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెపుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదని రేవంత్ అన్నారు.
నగరంలో వరదలు వచ్చిన సమయంలో బండి పోతే బండి ఇస్తామని ప్రకటించి ఆతరువాత ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పారన్నారు. బండి సంజయ్‌కు ఏశాఖలో ఎన్ని ఉద్యోగ ఖాళీలున్నాయో తెలుసా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పింది కానీ ఇంటికోటి ఏమో కానీ ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వలేదని రేవంత్ ఆరోపించారు.
బండి…. మోడీ ఇంటి ముందు నిరుద్యోగ మార్చ్ చేయ్
ఒకే రోజు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని బండి సంజయ్, ఇంటికొక ఉద్యోగం ఇస్తామని కేసీఆర్‌లు ప్రజలను మోసం చేస్తున్నారని రేవంత్ విమర్శించారు. నిరుద్యోగుల కోసం పార్లమెంటుతో పాటు నిత్యం ప్రజాక్షేత్రం నిరుద్యోగుల కోసం పోరాటం చేసింది కాంగ్రెస్‌పార్టీనే అని అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముందు బండి సంజయ్ నిరుద్యోగ మార్ఛ్ చేయాలని రేవంత్ అన్నారు.
నిరుద్యోగుల ఆశలను అడియాసలు చేసిన సర్కారు
నిరుద్యోగ ఆశలను అడియాసలు చేసిన టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ పాపం సర్కారు దేనని రేవంత్ ఆరోపించారు. ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలన్నారు. పేపర్ లీక్ లో అసలు నిందితులు తప్పించుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ కేసు విచారణను రాష్ట్ర అధికారులు చేపడితే కేసులో నిజానిజాలు నిగ్గు తేలవని అభిప్రాయపడ్డారు. గతంలో ప్రభుత్వం వివిధ సందర్భాల్లో వేసిన సిట్ లను చూస్తుంటే.. ప్రభుత్వంలో పెద్దలను కాపాడుకునేందుకే ప్రభుత్వం సిట్ ను ఉపయోగించుకుంటుందనే అభిప్రాయం కలుగుతుందన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై గ్రామ స్థాయి నుంచి అన్ని స్థాయుల్లో కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ పోరాటం చేశాయని గుర్తు చేశారు. పేపర్ లీకేజీ కేసులో కేటీఆర్‌ను భర్తరఫ్ చేయాలని, సంబంధిత కమిషన్ పై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరామని, అయినా గవర్నర్ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వం వేసిన సిట్.. కేటీఆర్ కనుసన్నుల్లో పని చేస్తూ ఇద్దరు ఉద్యోగులకే కేసును పరిమితం చేయాలని చూస్తుందని రేవంత్ ఆరోపించారు. తమ పోరాటం ఫలితంగానే ఈ కేసులో ఈడీ దర్యాప్తు మొదలయిందని రేవంత్ రెడ్డి అన్నారు.
మే 9 నుంచి రెండ విడుత పాదయాత్ర
మే మొదటి వారంలో ప్రియాంక పర్యటన ముగిసిన తరువాత మే9వ తేదీ నుంచి రెండవ విడుత హాథ్ సే హాథ్ జోడోయాత్ర(పాదయాత్ర) చేపడుతున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. రెండవ విడత జరిగే ఈ పాదయాత్ర జోగులాంబ జిల్లా నుంచి ప్రారంభమవుతుందన్నారు.