ఆ బస్సుల్లో ఎక్కొద్దు.. మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ కీలక సూచన..

హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి అనూహ్య స్పందన వస్తోంది. బస్సుల నిండా మహిళలే కనిపిస్తున్నారు. కనీసం పురుషులకు సీట్లు కూడా ఇవ్వట్లేదు. అయితే తక్కువ దూరం ప్రయాణించే మహిళలు సైతం ఎక్స్‌ప్రెస్ బస్సులను ఎక్కుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీంతో ఆర్టీసీ కీలక సూచన చేసింది.
తక్కువ దూరం వెళ్లే ప్రయాణికులు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఎక్కితే దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని ఆర్టీసీ తెలిపింది. దీంతో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సుల్లోనే ఎక్కాలని సూచించింది. మహిళా ప్రయాణికులు సిబ్బందికి సహకరించాలని కోరారు.
మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు #TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి… pic.twitter.com/bJryVNNxkM
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) December 23, 2023
ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎక్కడంటే అక్కడ ఆపరు..
అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోంది. ఇక నుంచి ఎక్స్ ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.