Kishan Reddy | డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులతో బాధితలకు అండ: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy రాష్ట్రం వద్ద 900 కోట్ల నిధులు బాధితులకు కేంద్రం సహకరిస్తుందీ మోరంచ పల్లె, వరంగల్ సిటీలో మంత్రి పర్యటన వరద బాధితులను ఓదార్చిన మంత్రి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరద బీభత్సానికి దెబ్బతిన్న మోరంచపల్లె, వరంగల్ నగరంతో పాటు జిల్లాలోని వరద బాధితులకు, నష్టపోయిన ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. […]

Kishan Reddy | డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులతో బాధితలకు అండ: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy

  • రాష్ట్రం వద్ద 900 కోట్ల నిధులు
  • బాధితులకు కేంద్రం సహకరిస్తుందీ
  • మోరంచ పల్లె, వరంగల్ సిటీలో మంత్రి పర్యటన
  • వరద బాధితులను ఓదార్చిన మంత్రి
  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరద బీభత్సానికి దెబ్బతిన్న మోరంచపల్లె, వరంగల్ నగరంతో పాటు జిల్లాలోని వరద బాధితులకు, నష్టపోయిన ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ. 900 కోట్ల మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులు ఉన్నాయని, వాటి నుంచి వరద బాధితులను ఆదుకోవాలని మంత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన వరద బీభత్సాన్ని కేంద్ర మంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పరిశీలించారు. ఆదివారం మోరంచ పల్లె,వరంగల్ నగరంలోని వరద బాధిత ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నష్టపోయిన కుటుంబాలతో పాటు, మృతుల కుటుంబాలకు కూడా తగిన పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పరిస్థితి హృదయ విదారకంగా ఉందని, ప్రజలకు చాలా నష్టం జరిగిందని కేంద్ర ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.

మంత్రి ముందుగా మొరంచ పల్లెలో దెబ్బతిన్న గ్రామాన్ని పరిశీలించారు. పల్లెలో పరిస్థితి భయానకంగా, దయనీయంగా ఉంది. ఈ భయానిక దృశ్యాలను చూసి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ తో కలిసి కేంద్రమంత్రికి పరిస్థితిని కలెక్టర్ భవేశ్ మిశ్రా వివరించారు. బురదమయమైన ఇళ్లను, కొట్టుకుపోయి చెట్లకు ఇరుక్కుపోయిన వాహనాలను పరిశీలించారు. గ్రామంలో పరిస్థితిని చూసి కిషన్ రెడ్డి చలించిపోయారు. ర్యాకం విజయ, నర్సారెడ్డి తో పాటు పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు.

ఆ రోజు ఘటనను, వరదల సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు అన్నింటినీ వదిలి పరిగెత్తిన పరిస్థితిని కిషన్ రెడ్డికి గ్రామస్తులు వివరించారు. ఊరు ఊరంతా కొట్టుకుపోయింది.. ఒక్క ఇల్లు కూడా మళ్లీ ఉండేందుకు పనికిరాకుండా పోయిందని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేశారు.గూడు, గొడ్డు అంతా పోయిందంటూ గ్రామస్తులు. ఆవేదనతో తెలిపారు.ఇంట్లో వస్తువులేవీ పనికిరాకుండా పోయాయని స్థానికులు విలపించారు. వారి బాధను చూసి కేంద్రమంత్రి ఉద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఫోన్ కాల్ తో స్పందించి హెలికాప్టర్ పంపించినందుకు స్థానికులు కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

వరంగల్ నగరంలో మంత్రి పర్యటన

వరంగల్ నగరంలోని కాశిబుగ్గ, ఎస్ఆర్ నగర్, బి ఆర్ నగర్, హనుమకొండలోని నయీమ్ నగర్, గండి పడిన భద్రకాళి చెరువు తదితర ప్రాంతాలను మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులతో ఆయన మాట్లాడారు.వరద బీభత్సంతో ఇళ్లల్లోని అన్ని వస్తువులు నాశనం అయ్యాయని, తినడానికి తిండి కూడా లేదని పలువురు ఆయనకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో బిజెపి భూపాలపల్లి ఇంచార్జ్ చందుపట్ల కీర్తి రెడ్డి, పార్టీ నాయకులు గుండె విజయరామారావు, ప్రేమేందర్ రెడ్డి, రాకేష్ రెడ్డి, బీజేపీ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్,కుసుమ సతీష్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు,గంటా రవికుమార్ తదితరులు ఉన్నారు.