మ‌నిషికి పంది గుండె అమ‌ర్చిన అమెరికా వైద్యులు.. చ‌రిత్ర‌లో రెండోసారి

మ‌నిషికి పంది గుండె అమ‌ర్చిన అమెరికా వైద్యులు.. చ‌రిత్ర‌లో రెండోసారి
  • చ‌రిత్ర‌లో రెండో ఘ‌ట‌న‌గా న‌మోదు
  • మొద‌టిసారి రెండు నెల‌లు మాత్ర‌మే జీవించిన రోగి

విధాత‌: గుండె విఫ‌లం కావ‌డంతో చ‌నిపోతున్న ఓ వ్య‌క్తికి పంది గుండె (Pig Heart to Human) ను అమ‌ర్చి వైద్యులు ప్రాణ‌దానం చేశారు. గ్జీనోట్రాన్స్‌ప్లాంటేష‌న్ అని పిలుచుకునే ఈ శ‌స్త్రచికిత్స సైన్సు చ‌రిత్ర‌లో రెండ‌వ ఘ‌ట‌న‌. 58 ఏళ్ల నేవీ ఉద్యోగి లారెన్స్ ఫాసెటీకి గుండె విఫ‌లం కావ‌డంతో అమెరికా (America) లోని యూనివ‌ర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడిసిన్ అనుబంధ ఆసుప‌త్రి వైద్యులు ప‌రీక్షించారు. అత‌డి గుండెకు ఇక ప‌నిచేసే శ‌క్తి లేక‌పోవ‌డంతో.. అవ‌య‌వ‌మార్పిడికే మొగ్గు చూపారు. అయితే అత‌డికి ఇత‌ర స‌మ‌స్యలు ఉండ‌టంతో మ‌నిషి గుండెను పెట్ట‌డం సాధ్యం కాదు. దీంతో పంది గుండెను మార్పిడి చేద్దామ‌ని నిర్ణ‌యించారు.

ఇక‌పై ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియ‌దు. అయితే నేను బ‌త‌క‌డానికి ఒక ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌న్న ఆనందం ఉంది అని ఆప‌రేష‌న్ ముందు లారెన్స్‌తో రికార్డు చేయించిన వీడియోను ఆసుప‌త్రి విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం లారెన్స్ ఆప‌రేష‌న్ జ‌రిగిన రెండు రోజుల‌కు జోకులు వేస్తూ ఆనందంగా గ‌డుపుతున్నార‌ని వైద్యులు పేర్కొన్నారు. అత‌డు కోలుకుంటున్న‌ప్ప‌టికీ పూర్తిగా ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడ‌ని చెప్ప‌డానికి మ‌రికొన్ని రోజులు ప‌డుతుంది. 

ప్ర‌స్తుతానికి అయితే లారెన్స్ వేగంగా కోలుకున్న‌ట్టేన‌ని ఈ స‌ర్జ‌రీకి నేతృత్వం వ‌హించిన డా.బార్‌టిలే గ్రిఫిత్ పేర్కొన్నారు. నేను పంది గుండెతో బ‌తుకుతున్న ఓ వ్య‌క్తితో మాట్లాడుతున్నానంటే న‌మ్మ‌లేక‌పోతున్నా. ఇలాంటి శ‌స్త్రచికిత్స చేయ‌డం ఒక గౌర‌వ‌మే. కానీ అదే స‌మ‌యంలో ఎంతో ఒత్తిడి అనుభ‌వించాల్సి ఉంటుంది అని ఆయ‌న వెల్ల‌డించారు. గ‌త ఏడాది ఇదే మేరీల్యాండ్ యూనివ‌ర్సిటీ వైద్యులు ప్ర‌పంచ వైద్య చరిత్ర‌లో తొలిసారి పంది గుండెను చావుబ‌తుకుల మ‌ధ్య ఉన్న డేవిడ్ బెనెట్ అనే వ్య‌క్తికి అమ‌ర్చారు.

అయితే అత‌డు రెండు నెల‌ల అనంత‌రం ప్రాణాలు కోల్పోవ‌డం గ‌మ‌నార్హం. నీతో కొన్ని రోజుల పాటు గ‌డుపుదామ‌నే ఆశ త‌ప్ప‌. ఇంక ఏ విధ‌మైన ల‌క్ష్యాలూ లేవు. ఇద్ద‌రం క‌లిసి మ‌రికొన్ని రోజుల పాటు మ‌న సోఫాలో కూర్చుని కాఫీ తాగితే చాలు అని ఆప‌రేష‌న్ త‌ర్వాత లారెన్స్ త‌న భార్య‌కు లేఖ రాశాడు. బుధ‌వారం ఈ చికిత్స జ‌ర‌గ‌గా.. శుక్ర‌వారానికి అతడి గుండె ఏ మెషీన్ సాయం లేకుండా ప‌నిచేస్తోంద‌ని వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతానికి మేము ఏమీ అనుకోవ‌డం లేదు. ప్ర‌తి ఉద‌యాన్ని విజ‌యంగా భావించి ముందుకెళ్ల‌డ‌మే అని గ్రిఫిత్ చెప్పుకొచ్చారు.