SPACE WAR | స్పేస్‌వార్‌ మొదలవుతున్నదా? చంద్రునిపై అణు రియాక్టర్ కోసం అమెరికా, రష్యా-చైనా పోటీ!

చంద్రునిపై అణు రియాక్టర్ నిర్మాణంపై అమెరికా నాసా నూతన ప్రణాళికలు. చైనా-రష్యాతో స్పేస్ వార్ కొనసాగుతున్న వేళ కీలక ప్రకటనపై ఆసక్తి.

  • By: TAAZ |    latest |    Published on : Aug 05, 2025 6:17 PM IST
SPACE WAR | స్పేస్‌వార్‌ మొదలవుతున్నదా? చంద్రునిపై అణు రియాక్టర్ కోసం అమెరికా, రష్యా-చైనా పోటీ!

SPACE WAR | ట్రంప్‌ యంత్రాంగం కొంతకాలంగా తమ అన్ని స్పేస్‌ ప్రాజెక్టులను నిలిపివేసింది. కానీ.. చంద్రునిపై అణు రియాక్టర్‌ (Nuclear Reactor Moon) నిర్మించాలన్న విషయంలో మాత్రం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నది. అంతరిక్షంలో అణు రియాక్టర్‌ నిర్మాణం విషయంలో అమెరికా ట్రాన్స్‌పోర్టేషన్‌ సెక్రటరీ, సీన్‌ డఫీత్వరలో తమ ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈయన NASA  తాత్కాలిక అడ్మినిస్ట్రేటర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు పొలిటికో ఒక కథనాన్ని పోస్ట్‌ చేసింది. ఈ వారంలోనే డఫీ ఈ ప్రణాళికలను వెల్లడించే అవకాశం ఉన్నది తన కథనంలో పేర్కొన్నది. చంద్రునిపై అణు రియాక్టర్‌ను నెలకొల్పాలన్న ఆలోచనలు ప్రపంచంలో చాలా కాలం నుంచే ఉన్నాయి. 2030 దశకంలో (TARGET 2030) చంద్రునిపై 40 కిలోవాట్‌ సామర్థ్యం కలిగిన అణు రియాక్టర్‌ను నిర్మించేందుకు నాసా గతంలోనే పరిశోధనలకు అవసరమయ్యే నిధులను కేటాయించింది. అయితే.. డఫీ చేయబోయే అధికారిక ప్రకటనతో ఇది కేవలం బ్యాగ్‌గ్రౌండ్‌ మిషన్‌గా ఎంతో కాలం ఉండబోదనే అంశాన్ని వెల్లడించనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఇతర అంతరిక్ష మిషన్‌లకు దాదాపు 50 శాతం వరకూ నిధులు కోత పెట్టినా.. అంతరిక్షంలోకి మానవను పంపించేందుకు ట్రంప్‌ యంత్రాంగం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నది. డఫీకి వేరే విధులు ఉన్నా.. నాసాలో తన పాత్రను మరింత క్రియాశీలకం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తున్నది.

వాస్తవానికి 2030ల నాటికి వంద కిలోవాట్‌ సామర్థ్యంతో కూడిన అణు రియాక్టర్‌ను అంతరిక్షంలో నిర్మించే విషయంలో పరిశ్రమ వర్గాల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించింది. రెండవ అంతరిక్ష రేసును గెలిచే ప్రయత్నంగా నాసా అధికారులు ఈ ప్రయత్నాలను అభివర్ణిస్తున్నారు. చైనా ఇప్పటిక చంద్రునిపైనే కాదు.. అంగారకుడిని సైతం చేరుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో చైనాతో రేసులో గెలవాలనుకుంటున్నదనే సంకేతాలను నాసా అధికారులు ఇచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మరో కీలక అంశం ఏమిటంటే.. చంద్రునిపై 2035 నాటికి ఆటోమేటెడ్‌ అణు విద్యుత్‌ స్టేషన్‌ను నిర్మించేందుకు చైనా, రష్యా చేతులు కలిపాయి. ఈ రేసులో చైనా, రష్యాలను వెనుకకు నెట్టే ప్రయత్నాల్లో అమెరికా ఉన్నది. ఈ క్రమంలోనే హ్యూమన్‌ స్పేస్‌ఫ్లయిట్‌లను పెంచేందుకు 2026 బడ్జెట్‌కు ప్రతిపాదనలు చేసింది. చంద్రునిపైకి మళ్లీ మనుషులు వెళ్లగలిగినప్పుడు వారి ఇంధన అవసరాలను తీర్చేందుకు ఈ అణు విద్యుత్‌ కేంద్రం ఉపయోగపడుతుంది. తొలత లూనార్‌ బేస్‌ నిర్మించి, తదుపరి అంగారకుడిపై నిర్మాణం ఈ ప్రణాళికల్లో ఉన్నది. ఈ విద్యుత్ కేంద్రాల నిర్మాణం తొలుత ఏ దేశం చేపడుతుందన్నదానిపై భవిష్యత్ మిషన్‌లు ఉంటాయి. ఏదైనా దేశం ముందుగా ఈ పని చేసినట్టయితే అక్కడ చొరబడనీయకుండా ‘కీప్‌ అవుట్‌ జోన్‌’ను ప్రకటించే అవకాశం ఉందని, అది అమెరికాకు ఇబ్బందికరంగా మారుతుందని నాసాకు అందిన ప్రభుత్వ ఆదేశం ఒకటి పేర్కొంటున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

2030 చుట్టూ చాలా అంశాలే ఉన్నాయి. అదే సంవత్సరం తన తొలి మానవుడిని చంద్రునిపైకి పంపేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నది. ఇక ఇప్పటి వరకూ ప్రపంచ దేశాలన్నీ వినియోగిస్తున్న ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ బదులు వేరొక స్పేస్‌ స్టేషన్‌ ప్రారంభించాలనే యోచనలో డఫీ ఉన్నారు. దీనిపై యుద్ధప్రాతిపదికన ప్రయత్నాలు చేయాలని ఆయన నాసా అధికారులను ఆదేశించారు. 2030 నాటికి ప్రస్తుత అంతర్జాతీయ స్పేస్‌ స్టేషన్‌ కాలవ్యవధి ముగియనున్నది. ఆలోపే కొత్త స్పేస్‌ స్టేషన్‌ను నిర్మించేందుకు నాసా ప్రయత్నాలు చేస్తున్నది. దీని కోసం కనీసం రెండు కంపెనీలను నాసా ఎంచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. అంతరిక్షంలో ఒక్క చైనా దేశానికే సొంత స్పేస్‌ స్టేషన్‌ ‘తియాంగాంగ్‌’ ఉన్నది.