Voyager Station | అంతరిక్షంలో బార్ అండ్ రెస్టారెంట్.. ఎప్పుడు? ఎలా వెళ్లాలి?
స్పేస్ టూరిజం.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న కొత్త పర్యాటకం. మరి పర్యాటకులు వెళ్లినప్పుడు హోటల్ కావాలి కదా! అందుకే స్పేస్ హోటల్ కూడా ఏర్పాటవుతున్నది.
Voyager Station | అందమైన చెరువుల తీరంలో ఏర్పాటు చేసిన లేక్ వ్యూ హోటళ్లు, కొండ ప్రాంతాల్లోని హిల్ వ్యూ రెస్టారెంట్లు, సముద్ర తీరాన ఓషన్ వ్యూ హోటళ్లు చూశాం. అక్కడి వాతావరణ పరిస్థితులను ఎంజాయ్ చేస్తూ భోజనం చేస్తుంటే ఆ మజానే వేరు. మరి ఆకాశంలోకి వెళ్లి.. అక్కడి నుంచి విశ్వాంతరాళను, కింద భూమిని చూస్తే ఎంజాయ్ చేసే అవకాశం ఉంటే? భోజనం మాత్రమే కాదు.. అన్ని సదుపాయాలు ఉన్న బార్, జిమ్, కాన్సర్ట్‌హాల్, భూమిని వీక్షించేందుకు ప్రత్యేకమైన లాంజ్, ఆఖరుకు సినిమాహాల్ కూడా ఉంటే! ఎలా సాధ్యం అంటారా? సాధ్యమేనంటున్నారు శాస్త్రవేత్తలు అంతేకాదు.. అతి త్వరలోనే ఎర్త్ వ్యూ హోటల్‌ను సిద్ధం చేస్తున్నారు.
ప్రపంచపు మొట్టమొదటి స్పేస్‌హోటల్ ‘వోయేజర్ స్టేషన్’ను 2027 నాటికి రెడీ అవ్వనున్నది. స్పేస్ టూరిజంలో ఇదొక కీలక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా కలగానే ఉన్న స్పేస్ హోటల్‌కు వాస్తవ స్థితిని కల్పించేందుకు శ్రమిస్తున్నారు. దీనిని కాలిఫోర్నియాకు చెందిన ఎబోవ్: స్పేస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్మిస్తున్నది. నిజానికి ఇలాంటి హోటల్ ఇప్పటి వరకూ సైన్స్ ఫిక్షన్ సినిమాలు, నవలలోనే ఉన్నది. కానీ దీనిని సాకారం చేయబోతున్నారు. అంతరిక్ష పర్యాటకాన్ని వేరే లెవల్‌కు తీసుకువెళ్లనున్నారు.
ఈ హోటల్ భూ కక్ష్యలో నిమిషానికి 1.5 సార్లు (భ్రమణం) తిరుగుతుంది. దాని వల్ల ఏర్పడే సెంట్రిఫ్యుగల్ ఫోర్స్ ద్వారా చంద్రుని గురుత్వాకర్షణను అనుసరిస్తుంది. ఇది భూమి గురుత్వాకర్షణ శక్తిలో ఆరో వంతు. భవిష్యత్తులో అంగారకుడు, భూమికి సమీప గురుత్వాకర్షణను సృష్టించే ప్రయత్నం చేస్తామని ఎబోవ్ : స్పేస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చెబుతున్నది. దీని వల్ల స్పేస్ హోటల్‌కు వచ్చే అతిథులు ఎక్కువ రోజులు ఉండేందుకు అవకాశాలు ఏర్పడతాయి. ఈ హోటల్.. ముందుకు సాగే వేగం (Inertia), భూమి గురుత్వాకర్షణ శక్తి, సెంట్రిపిటల్ ఫోర్స్‌లతో సమ్మేళనంతో కక్ష్యలో నిలుస్తుంది.
నిజానికి ఈ అంతరిక్ష హోటల్ భావన కొత్తదేమీ కాదు. ఆ మాటకొస్తే సుమారు వందేళ్ల క్రితం నాటి ఆలోచన. 1900ల మొదట్లో ఈ ఆలోచనను రష్యన్ శాస్త్రవేత్త కాన్‌స్టాంటిన్ ట్సిలియోల్కోవ్ స్కీ ప్రతిపాదించారు. తర్వాత జర్మన్ రాకెట్ శాస్త్రవేత్త వెర్నర్ వాన్ బ్రౌన్ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. దీనిని మరింత అభివృద్ధి చేసి, వోయేజర్ స్టేషన్ రూపంలోకి మార్చారు.

ఇవీ ప్రత్యేకతలు
- వోయేజర్ స్టేషన్‌లో మొత్తం 24 ప్రత్యేక మాడ్యూల్స్ ఉంటాయి.
- సుమారు 1,25,000 చదరపు అడుగుల విస్తీర్ణం
- ఒకేసారి అతిథులు, సిబ్బంది కలుపుకొని 400 మంది వరకూ బస చేసే వెసులుబాటు.
- భూమి అందాలను గగనసీమ నుంచి చూపించే విశాలమైన లాంజ్‌లు.
వోయేజర్ స్టేషన్‌ను కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేయనున్నారు. సందర్శకులు అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత ముందుగా జీరోగ్రావిటీ పోడ్ వద్ద డాక్ అవుతారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా రూపొందించిన ఎలివేటర్ ద్వారా హోటల్ వెలుపలి మాడ్యూల్స్‌కు చేరుతారు.

ఇంతకీ ఖర్చు ఎంత?
దాని గురించే మాట్లాడుకుందాం.. అంతరిక్ష హోటల్‌లో బస చేయడం మామూలు విషయం కాదు. అందరికీ అందుబాటులో ఉండేదీ కాదు. వందల కోట్ల రూపాయల పైనే చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా కాగితాలపైనే ఉన్న ఈ నమూనాను టెస్టింగ్ 2026లో మొదలు కానున్నది. అనంతరం 2027లో ప్రారంభిస్తారు. ఆ మాత్రం సమయం తమకు సరిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Read Also |
G Ram G To Replace MGNREGA : ఉపాధి హామీలో ‘గాంధీ’ పేరు తొలగింపు.. ‘రామ్ జీ’ అక్షరాల చేరిక!
CIA Lost nuclear device | హిమాలయాల్లో పొంచి ఉన్న అణు ముప్పు!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram