Astronaut | అంతరిక్షం నుంచి హిందూ కుష్ పర్వతాల అందాలు..
ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రంతో భారత్ అత్యంత ప్రకృతి రమణీయంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.

- క్లిక్‌మనిపించిన ఐఎస్ఎస్ వ్యోమగామి
Astronaut | విధాత: ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రంతో భారతదేశం అత్యంత ప్రకృతి రమణీయంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అంతరిక్షం నుంచి చూసినప్పుడు ఆ అందం మరింత ద్విగుణీకృతం అయినట్లు కనిపిస్తోంది. తాజాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి ఒక వ్యోమగామి (ISS Astronaut) .. భారత్‌లోని హిందూ కుష్ (Hindukush Range) పర్వతాలను ఫొటో తీశారు. సూర్యోదయం వేళలో బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆ పర్వత శ్రేణిని ఐఎస్ఎస్ వ్యోమగామి లోరల్ ఓ హరా క్లిక్ మనిపించారు.
ఈ రంగులో పర్వతాలు కనిపించడాన్ని శాస్త్రవేత్తలు అల్పెంగ్లో అని వ్యవహరిస్తారు. ‘ఆయన ఈ ఫొటోలను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. అల్పెంగ్లో అనేది ఒక అద్భుతం.. అంతరిక్షం నుంచి చూస్తుంటే మరింత అందంగా ఉంది. మధ్య దక్షిణాసియా నుంచి తీసిన ఈ చిత్రం చూసి ఆనందించండి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఫొటోలపై పలువురు ఎక్స్ యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చాలా కొద్ది మంది మాత్రమే చూడగలిగే ఈ దృశ్యాన్ని ఫొటో తీసి పెట్టినందుకు లోరల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెల్లని మంచుతో కప్పబడి ఉండే మంచు పర్వతాలు సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయాల్లో బంగారు వర్ణంలోకి మారతాయి.
దీనిని అప్లెంగ్లో అంటారని అమెరికన్ మెటరలాజికల్ సొసైటీ వెల్లడించింది. ఇక హిందూ కుష్ పర్వతాలు 800 కి.మీ. పొడవున అఫ్గానిస్థాన్ నుంచి ఉత్తర పాకిస్థాన్ మీదుగా తజికిస్థాన్ వరకు వ్యాపించి ఉంటాయి. ఈ మార్గంలో భారత్, భూటాన్, చైనా, నేపాల్, మయన్మార్‌లలోనూ ఈ పర్వతాలు ఉంటాయి. వీటి నుంచి వచ్చే తాగునీరు 200 కోట్ల మందికి జీవనాధారం. అయితే గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇక్కడి సాధారణం కంటే ఉష్ణోగ్రతలు మూడు రెట్లు పెరిగిపోయాయి. దీనిపై పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.